రాజకీయ దురుద్దేశంతోనే వ్యాక్సిన్‌‌పై రూమర్లు

రాజకీయ దురుద్దేశంతోనే వ్యాక్సిన్‌‌పై రూమర్లు

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్‌‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించలేదని విమర్శలు వస్తున్నాయి. ట్రయల్స్ పూర్తిగా చేయకుండా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారంటూ విపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ విమర్శలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ స్పందించారు. టీకా పూర్తి సురక్షితం అని, ఎటువంటి పుకార్లనూ ప్రచారం చేయొద్దన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో కావాలనే వ్యాక్సిన్‌‌పై రూమర్లను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

‘దేశంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్‌‌లు పూర్తిగా సురక్షితమైనవి అలాగే చాలా ప్రభావవంతంగా పని చేస్తాయనేది సుస్పష్టం. టీకా తీసుకున్నాక ప్రతికూల ఘటనలు జరగడం లేదా సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే. ఏ వ్యాక్సినేషన్ తర్వాత అయినా ఇలాంటివి జరుగుతుంటాయి. వ్యాక్సిన్ వేయించుకునే వారికి ఏదైనా హాని జరగాలని ప్రభుత్వం కోరుకోదు. టీకా వేయించుకునే డాక్టర్ల సేఫ్టీ ఎంత ముఖ్యమో సాధారణ ప్రజానీకం సురక్షితంగా ఉండాలనే దానికీ అంతే ప్రాధాన్యత ఇస్తాం. హెల్త్ సెక్టార్ పనితీరుకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్ ప్రతిబింబిస్తోంది. కరోనాపై పోరులో చివరి అంకం అయిన వ్యాక్సినేషన్‌‌ను మనం విజయవంతంగా దాటుతామని నమ్ముతున్నా’ అని హర్షవర్దన్ చెప్పారు.