కరోనాకు సెప్టెంబర్ లో వ్యాక్సిన్

కరోనాకు సెప్టెంబర్ లో వ్యాక్సిన్
  • ఆక్స్ ఫర్డ్ సైంటిస్టుల వెల్లడి

లండన్:కరోనా నివారణకు తాము కనిపెట్టిన వ్యాక్సిన్ సెప్టెంబర్ లో అందుబాటులోకి వస్తుందని ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు చెప్పారు. దీని కోసం వివిధ కంపెనీలు, దాతలతో కలిసి పని చేస్తున్నామన్నారు. “మేము కనుగొన్న వ్యాక్సిన్ కరోనాపై ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. సెప్టెంబర్ నాటికి 10 లక్షల డోస్ ల వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తాం. మూడు ఫేజ్ లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. 510 మంది వలంటీర్లతో మొదలైన ట్రయల్ మూడో ఫేజ్ నాటికి 5 వేల మందితో ముగుస్తుంది” అని ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ అన్నారు. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందని, సెప్టెంబర్ నాటికి ఆ ప్రక్రియ పూర్తవుతుందని ప్రొఫెసర్ ఆడ్రియాన్ హిల్ అన్నారు. సీహెచ్ఓడీఓఎక్స్ 1 టెక్నాలజీతో ఇప్పటికే వివిధ రోగాలకు సంబంధించి 12 క్లినికల్ ట్రయల్స్ చేశామని చెప్పారు. ఇతర టెక్నాలజీతో తయారు చేసిన వ్యాక్సిన్లు రెండు లేదా ఎక్కువ డోస్ లు కావాలని, తాము తయారు చేసిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ కు ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏడు కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ లో మూడు, యూరప్ లో రెండు, చైనా, ఇండియాలో ఒక్కో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు. ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులే కాకుండా అమెరికా, చైనా సైంటిస్టులు కూడా వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని, అందుబాటులోకి రావడానికి 12 నుంచి 18 నెలల పడుతుందని ప్రకటించారు.