రేపట్నుంచి 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సిన్

రేపట్నుంచి 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సిన్
  • వ్యాక్సిన్ నిల్వలు లేక చేతులెత్తేస్తున్న పలు రాష్ట్రాలు
  • స్టాక్ వచ్చినప్పుడే ప్రారంభిస్తామంటూ కేంద్రానికి లేఖలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం సవాల్ గా మారింది. ప్రాధాన్యతా క్రమం మేరకు విడుతల వారీగా చేపట్టిన ఈ ప్రక్రియ మొదటి విడుత సాఫీగా జరుగగా.. రెండో విడుత కొరత ఏర్పడింది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే చేతులెత్తేయగా.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వాలే తమ వద్ద సరిపడా వ్యాక్సిన్ నిల్వలు లేవని చేతులెత్తేస్తుండడంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దందాకు తెరలేపాయి. అనేక చోట్ల బ్లాక్ మార్కెటింగ్ దందా జోరుగా సాగుతున్న ఘటనలు మీడియాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్దేశించిన ప్రకారం మే 1వ తేదీ నుంచి అంటే శనివారం నుంచి 18 - 45 ఏళ్ల మధ్య వయసు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆక్సిజన్, పడకల కొరతతో సతమతం అవుతున్న రాష్ట్రాలు... టెస్టులు, వ్యాక్షినేషన్ ను కట్టుదిట్టంగా కొనసాగించంలో సతమతమవుతున్నాయి. ఇదే క్రమంలో వ్యాక్సిన్  కు కూడా భారీగా డిమాండ్ ఏర్పడడంతో సరిపడినన్ని నిల్వలు లేక పలు రాష్ట్రాలు ఇబ్బందిపడుతున్నాయి. ఈ నేపధ్యంలో రేపట్నుంచి ప్రారంభించాల్సిన వ్యాక్సినేషన్ ను ప్రారంభించలేమని.. మా దగ్గర  సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు లేవనీ పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలియజేశాయి. టీకాల కోసం ఆస్పత్రులకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ల కొరత తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్‌ కోసం శుక్రవారం ఉదయం  నాటికే 2.45 కోట్ల మంది కోవిడ్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాయి. వ్యాక్సిన్ కావాలంటున్న వారి సంఖ్య భారీగా ఉండగా.. సరిపడినన్ని వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్, బెంగాల్, తెలంగాణ, గుజరాత్, ఉత్తప్రదేశ్,. పంజాబ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాశాయి. కోవిడ్‌ ఉధృతి తీవ్రంగా ఉంది కాబట్టి మాకు అత్యవసరంగా 20-30 లక్షల వ్యాక్సిన్‌ అవసరమని..18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే 12 కోట్ల డోసుల టీకాలు కావాలని మహారాష్ట్ర కేంద్రానికి లేఖ రాయగా.. కర్ణాటక కూడా ఇదే దారిలో రేపటి నుంచి మా దగ్గర మూడో దశ వ్యాక్సినేషన్‌ని ప్రారంభించలేమని చేతులెత్తేసింది. ఢిల్లీలో మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు తమ దగ్గర సరిపడా వ్యాక్సిన్‌లు లేవని  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియా ముఖంగా ప్రకటించారు. కాబట్టి 18-44 ఏళ్ల వారు మే 1న వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రుల వద్దకు రావద్దని సూచనలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ గురించి రెండు మూడు రోజుల్లో తామే ప్రకటన చేస్తామని కేజ్రివాల్ తెలియజేశారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ కూడా వ్యాక్సిన్‌ డోసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు వేస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీలు తాము ఆర్డర్‌ చేసిన వ్యాక్సిన్‌ డోసులను ఇంకా డెలివరీ చేయలేదని కాబట్టి రేపు మూడో దశ వ్యాక్సిన్‌ ప్రారంభించలేమని ప్రకటించింది.