నృసింహ మండపంలో రామయ్యకు రాపత్ సేవ

నృసింహ మండపంలో రామయ్యకు రాపత్ సేవ

భద్రాచలం, వెలుగు :  వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి వైకుంఠ రాముడికి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నృసింహ మండపంలో రాపత్ సేవ జరిగింది. సర్పంచ్​ పూనెం కృష్ణదొర, వార్డు సభ్యులు, ఈవో శ్రీనివాసరావు సిబ్బంది రామాలయం నుంచి స్వామిని ఊరేగింపుగా, బాణాసంచాల కాల్పులు, కోలాటాల మధ్య పంచాయతీ ఆఫీసుకు తీసుకొచ్చారు. తోరణాలతో, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించిన నృసింహస్వామి మండపంలో స్వామిని అధిష్ఠించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం ,ఆరాధన అయ్యాక వేదపండితులు మంత్రోచ్ఛరణలు మధ్య పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. బేడా మండపంలో స్వామికి అధ్యయన పారాయణం జరిగింది. నాళాయర దివ్యప్రబంధ పారాయణం చేశారు. అనంతరం సీతారాముల నిత్య కల్యాణం నిర్వహించారు. మాజీ సీబీఐ ఆఫీసర్​ జేడీ లక్ష్మీనారాయణ రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూజలనంతరం ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు.