Valentines Week 2024: రోజుకో సర్ప్రైజ్‌తో మీ ప్రేమను పంచండిలా..

Valentines Week 2024: రోజుకో సర్ప్రైజ్‌తో మీ ప్రేమను పంచండిలా..

హాయ్ ప్రేమ పక్షులారా..! అంతా కుశలమేనా.. కుశలమే అయ్యుంటదిలే. మరో పది రోజుల్లో ప్రేమికుల దినం రాబోతోంది కదా..! అదేనండి ప్రేమికుల రోజు. ఫిబ్రవరి 14 వస్తుంది కదా..! మరి ఇలా ప్రపోజ్ చేయాలి, ఎలా లైన్ లో పెట్టాలి అనే వ్యూహాలు సిద్ధం చేశారా..! ఒకవేళ ఇప్పటికే మీ సొంతమయ్యుంటే ఆ బంధాన్ని మరింత దృడంగా ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచించారా..! ఆలోచించరు. పడ్డాక పడుంటదిలే బాసూ.. ఇప్పటికే బోలెడంత ఖర్చయింది అంటారు. పక్షులు బాసూ.. సర్ప్రైజ్‌ లేకపోతే ఏ క్షణమైనా ఎగిరిపోవచ్చు. అందుకే రోజుకో సర్ప్రైజ్‌తో మీ ప్రేమను పదిలంగా ఉంచుకోండి. 

'వాలెంటైన్స్ వీక్..' రాబోతోంది.. ఈ వారం రోజులు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. మొదటి రోజు రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డే, మూడో రోజు చాక్లెట్ డే, నాలుగో రోజు టెడ్డీ డే, ఐదో రోజు ప్రామిస్ డే, ఆరో రోజు హ్యాపీ డే, ఏడో రోజు కిస్ డే, చివరగా ప్రేమను వ్యక్తపరిచే.. వాలెంటైన్స్ డే. ఈ వారం రోజులు మీకు ఇష్టమైన వారితో మరింత ఆనందంగా గడపండి. విశిష్టతలు తెలుసుకొని.. రోజుకో ర్ప్రైజ్‌తో మీ ప్రేమను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లండి.     

ఫిబ్రవరి 7: రోజ్ డే

ఎరుపు గులాబీ ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఆరోజు ప్రేమికులు తమకిష్టమైన వారికి గులాబీలను ఇస్తుంటారు. కొందరు ఒక గులాబీతోనే సరిపెడితే, మరి కొందరు బొకేల రూపంలో మరిన్ని గులాబీలు అందిస్తారు. ఎరుపు గులాబీ ఇచ్చారంటే ఎదుటివారిపై ఉన్న ప్రేమను వారికి తెలియజేస్తున్నట్టే.

ఫిబ్రవరి 8: ప్రపోజ్ డే

మొదటి రోజు పువ్వు చేతిలో పెట్టి పడేశారుగా..!  నెక్స్ట్ ఏంటి.. ప్రపోజ్ చేయడమే. దీన్నే ప్రపోజ్ డే అంటారు. ఆరోజు తమకు ఇష్టమైన వారికి ప్రేమను తెలియజేయొచ్చు. మీరూ సిద్ధమవ్వండి.. మీ మనసు దోచిన వారికి ప్రేమను తెలియజేసి ఒక్కటవ్వండి.

ఫిబ్రవరి 9: చాక్లెట్ డే

జీవితంలో కష్టసుఖాలు ఉన్నట్లు.. ప్రతి బంధంలో చేదు, తీపి అనుభూతులు ఉంటాయి. అందులో చేదు అనుభవాలు మర్చిపోయి తీపి జ్ఞాపకాలనే గుర్తుపెట్టుకునేందుకు చాక్లెట్ డే జరుపుకుంటారు. తమకి ఇష్టమైన వారికి ఖరీదైన చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు.

ఫిబ్రవరి 10: టెడ్డీ డే

నాలుగో రోజు టెడ్డీ డే. ముద్దు ముద్దుగా ఉన్న టెడ్డీబేర్లను తమకు ఇష్టమైన వారికి బహుమతిగా ఇచ్చే రోజు. మీకు ఇష్టమైన వారు దాన్ని హత్తుకున్నప్పుడల్లా మీతోనే ఉన్నట్లు ఉంటుంది. కనుక మీరు కూడా ఒక ఆకర్షణీయమైన టెడ్డీబేర్ ను మీ మనుసు దోచిన వారికి ఇవ్వండి.  

ఫిబ్రవరి 11: ప్రామిస్ డే

ప్రామిస్ డే అంటే ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయనని, మధ్యలో వదిలేయనని ప్రామిస్ చేసే రోజు కాదండోయ్.. బలహీనమైన ప్రేమ బంధాన్ని తిరిగి బలోపేతం చేయడానికి ఒకరికొకరు ప్రతిజ్ఞలు చేసుకునే రోజు. ఇద్దరం ఒక్కటై జీవితంలో కలిసి ముందుకు సాగుదాం అని వాగ్దానాలు చేయడమనమాట.

ఫిబ్రవరి 12: హగ్ డే

వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే చాలా స్పెషల్. ఆరోజు తమకు ఇష్టమైన వారిని గట్టిగా కౌగిలించుకొని ప్రేమను తెలియజేయొచ్చు. ఎదుటివారికి ప్రేమను తెలియజేయడానికి పదాలు కరువైనప్పుడు స్పర్శ సాయంతో తెలియజేయడమనమాట. స్పర్శ అనేది మాటలను మించిన అద్భుతాలు చేస్తుంది. మీరూ ఒకసారి ప్రయత్నించండి. కాకపోతే చుట్టూ ఎవరూ లేని సందర్భం చూసుకోండి. నచ్చకపోతే అవతలి వారు చెంప చెల్లుమనిపించవచ్చు. 

ఫిబ్రవరి 13: కిస్ డే

ప్రేమలో విహరిస్తున్న వారు ముద్దుతో తమ ప్రేమను మరింత దృడంగా మార్చుకోవడం అన్నమాట. అలా అని నానా హంగామా చేసి ఎదుటివారిని భయపెట్టకండి. కిస్ డే జ్ఞాపకం కోసం ఓసారి చేసి ప్రయత్నించి వదిలేయండి సుమా..!   

ఫిబ్రవరి 14: వాలెంటైన్స్ డే

చివరగా ప్రేమికుల రోజు.. ఆరోజు ఎటు చూసినా ప్రేమికులే కనిపిస్తుంటారు. తమకు ఇష్టమైన వారితో బయటకు వెళ్లడం, సమయాన్ని గడపడం ఆరోజు ప్రత్యేకత. ఆరోజు నగరంలోని పలు మాల్ లు ప్రేమికులతో కిటకిటలాడుతుంటాయి. కాకపోతే గతకొంతకాలంగా ఆరోజు బయట తిరిగే వారి సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. అందుకు కారణం..భజరంగ దళ్ కార్యకర్తలు. వీరి కంట పడకుండా కాస్త అప్రమత్తంగా ఉండండి. చదివారుగా.. వాలెంటైన్స్ వీక్ ప్రత్యేకతలు. రోజుకో సర్ప్రైజ్‌తో మీకు నచ్చినవారు ఆనందింపచేయండి.