చెరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : వల్లూరు క్రాంతి

 చెరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది :  వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఫ్యాక్టరీ ఉద్యోగుల వేతనాలను ఈనెలాఖరు లో చెల్లించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో   ఎస్పీ కలిసి ట్రైడెంట్ చక్కర కంపెనీ యాజమాన్యం, నిజాం షుగర్స్ రివైవల్ కమిటీ , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరుకు రైతులకు ఎలాంటి నష్టం జరగవద్దని, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కంపెనీని వేలం వేయనున్నట్టు  ప్రకటించినప్పటికీ కంపెనీ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఉద్యోగుల వేతనబకాయిలు చెల్లించకుండా  నిర్లక్ష్యం చేస్తోందన్నారు.  యాజమాన్యంపై చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని, ఆస్తులన్నింటినీ జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం డాక్టర్ రామ్ నాథ్​,డీఆర్ఓ నగేశ్​, జహీరాబాద్ ఆర్డీఓ వెంకా రెడ్డి, చక్కెర శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు.