
- కిందటేడాది జనవరితో పోలిస్తే 24 శాతం గ్రోత్
- మొత్తం 5,411 ఇండ్ల రిజిస్ట్రేషన్
- సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి నుంచి ఎక్కువ
- నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : కిందటి నెలలో హైదరాబాద్‌లో రూ.3,279 కోట్ల విలువైన 5,411 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ పేర్కొంది. కిందటేడాది జనవరిలో రిజిస్టర్ అయిన 5,454 ఇండ్లతో పోలిస్తే ఒక శాతం తగ్గిందని తెలిపింది. కానీ, వాల్యూ పరంగా చూస్తే 24 శాతం గ్రోత్ నమోదు చేసిందని వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్– మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ రియల్‌ఎస్టేట్ మార్కెట్‌గా పరిగణిస్తున్నారు.
రీసేల్, ఫస్ట్ సేల్ ట్రాన్సాక్షన్ల డేటాను తీసుకొని ఈ రిపోర్ట్‌ను నైట్ ఫ్రాంక్ రెడీ చేసింది. ఖరీదైన ఇండ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని ఈ రియల్‌ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, కిందటి నెలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వాటిలో రూ.25 –50 లక్షల బ్రాకెట్‌లోని ఇండ్ల వాటా 47 శాతం ఉంది. రూ.25 లక్షల కంటే తక్కువ విలువున్న ఇండ్ల వాటా 15 శాతం ఉంది. అదే రూ. కోటి కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఇండ్ల వాటా 14 శాతానికి పెరిగింది. కిందటేడాది జనవరిలో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్‌లో వీటి వాటా 8 శాతం దగ్గర ఉంది.
1,000 – 2,000 చదరపు అడుగుల ఇండ్లకే ఓటు
వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్ల సేల్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా 1,000–2,000 చదరపు అడుగుల రేంజ్‌లోని ఇండ్ల రిజిస్ట్రేషన్లు కిందటి నెలలో ఎక్కువగా జరిగాయని, 71 శాతం ఇండ్లు ఈ రేంజ్‌లోనే ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. వెయ్యి కంటే తక్కువ చదరపు అడుగుల ఇండ్లకు డిమాండ్ తగ్గిందని తెలిపింది. కిందటి నెలలో రిజిస్ట్రేషన్ అయిన మొత్తం ఇండ్లలో 1,000 చదరపు అడుగుల కంటే తక్కువున్న ఇండ్ల వాటా 16 శాతంగా రికార్డయ్యింది.
కిందటేడాది జనవరిలో నమోదైన 19 శాతం నుంచి తగ్గింది. కానీ, 2,000 కంటే ఎక్కువ చదరపు అడుగులు ఉన్న ఇండ్లకు మాత్రం డిమాండ్ పెరిగిందని, కిందటేడాది జనవరిలో ఇటువంటి ఇండ్ల వాటా 9 శాతం ఉంటే, కిందటి నెలలో 13 శాతానికి పెరిగిందని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. జిల్లాల వారిగా చూసుకుంటే, రంగారెడ్డి నుంచి ఎక్కువ ఇండ్లు రిజిస్టర్ అయ్యాయి. కిందటి నెలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లలో ఈ జిల్లా వాటా 43 శాతంగా నమోదయ్యింది.
మేడ్చల్–మల్కాజ్‌గిరి వాటా 42 శాతంగా, హైదరాబాద్ వాటా 15 శాతంగా నమోదయ్యింది. అలానే కిందటి నెలలో ఇండ్ల ధరలు సగటున ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ పేర్కొంది. ముఖ్యంగా రంగారెడ్డిలో ఇండ్ల రేట్లు 12 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయని, హైదరాబాద్‌లో 11 శాతం, మేడ్చల్–మల్కాజ్‌గిరిలో 5 శాతం ఎగశాయని వెల్లడించింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2024 ను బాగా మొదలు పెట్టిందని, రిజిస్ట్రేషన్ల గ్రోత్ నిలకడ ఉందని, హై క్వాలిటీ ఇండ్లకు డిమాండ్ పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఎండీ శిశిర్ బైజాల్ అన్నారు.