
- ఫలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయత్నం
- మూడు గంటల్లోనే హైదరాబాద్‌కు చేరుకునే చాన్స్
- ట్రైన్ హాల్టింగ్‌కు కృషి చేసిన ఎంపీకి జిల్లావాసుల అభినందనలు
- సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు, కాకా అభిమానులు, వ్యాపారులు
కోల్‌బెల్ట్, వెలుగు: సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైలు మొదలైన 11 నెలల తర్వాత, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితో హాల్టింగ్‌కు పర్మిషన్ రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వందేభారత్ రైలు మంచిర్యాల, కాగజ్‌నగర్ స్టేషన్లలో ఎప్పటి నుంచి ఆగుతుందన్న తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
మొదటే హాల్టింగ్ ఇవ్వకపోవడంతో..
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, బంధుత్వ సంబంధాలు ఉండడంతో ప్రతిరోజు వందలాది మంది ఇరువైపులా ప్రయాణిస్తుంటారు. మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో బొగ్గు గనులు, పరిశ్రమలు ఉండడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ జీవిస్తుంటారు. వ్యవసాయోత్పత్తుల విక్రయానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన నాగ్‌పూర్‌కు ఉమ్మడి జిల్లా వ్యాపారులు నిత్యం వెళ్తుంటారు. మంచిర్యాల, కాగజ్‌నగర్ స్టేషన్ల నుంచి ఏటా 13 నుంచి 14 లక్షల మంది అటు నాగ్‌పూర్‌కు, ఇటు హైదరాబాద్‌కు ప్రయాణాలు చేస్తుండగా, సంవత్సరానికి సుమారు రూ.50 కోట్ల ఆదాయం వస్తున్నది.
గతేడాది సెప్టెంబర్ 15న సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య ప్రారంభమైన వందే భారత్ ట్రైన్‌కు మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో హాల్టింగ్ ఇవ్వకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రెండు స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని పలుమార్లు కోరినా రైల్వే ఆఫీసర్లు పట్టించుకోలేదు.
తగ్గనున్న ప్రయాణ సమయం
మంచిర్యాలలో వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వడంతో ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌కు కేవలం మూడు గంటల్లో చేరుకునే అవకాశం కలుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రలో 575 కిలోమీటర్లు ప్రయాణించే వందేభారత్ రైలుకు ఇప్పటికే కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్‌లో హాల్టింగ్‌లు ఉండగా.. త్వరలోనే మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో సైతం ఆగనుంది. నాగ్‌పూర్‌లో ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు మొదలయ్యే వందేభారత్.. మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుంంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్టేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది.
ఎంపీ ఫొటోకు క్షీరాభిషేకం.. మంచిర్యాల, మందమర్రిలో కేక్ కటింగ్
వందేభారత్ కు హాల్టింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, కాకా అభిమానులు, వ్యాపారులు, ప్రయాణికులు సంబురాలు చేసుకున్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో కేక్ కట్‌చేయగా.. మందమర్రి పట్టణంలోని ఇందు గార్డెన్స్‌లో వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌నేతలు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో వంశీకృష్ణ, రాష్ట్ర
కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి స్పందించి వందే భారత్ హాల్టింగ్ కోసం కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, బండి సదానందం యాదవ్, కేవీ ప్రతాప్, కాకా అభిమాన సంఘం నాయకుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ పాల్గొన్నారు.
ఫలించిన ఎంపీ వంశీకృష్ణ కృషి
మంచిర్యాలలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ కల్పించాలని స్థానికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు రావడంతోఎంపీ వంశీకృష్ణ, రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. వందే భారత్‌కు హాల్టింగ్ ఇచ్చే విషయంపై ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం కుమార్ జైన్, రైల్వే బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రాలు అందించారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుంచి రైల్వే శాఖకు ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని, మంచిర్యాలలో వందే భారత్‌కు హాల్టింగ్ ఇవ్వడంవల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయంటూ వంశీకృష్ణ పార్లమెంట్లో సైతం మాట్లాడారు. సుమారు 11 నెలల పోరాటం ఫలితంగా వందేభారత్‌కు మంచిర్యాలతో పాటు కాగజ్‌నగర్‌లోనూ హాల్టింగ్ ఇస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైలు హాల్టింగ్‌కు కృషి చేసిన వంశీకృష్ణకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
వందేభారత్‌తో కనెక్టివిటీ పెరుగుతుంది: గడ్డం వంశీకృష్ణ
వందేభారత్ ట్రైన్ కు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పించడంతో ప్రజలకు మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను పలుమార్లు కలిశాను. మంచిర్యాలలో ట్రైన్‌కు హాల్టింగ్ ఇస్తే స్థానిక ప్రజలతో పాటు కార్మిక వర్గాలు, వ్యాపారులు, ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంపై పార్లమెంట్లో కూడా ప్రస్తావించిన. పారిశ్రామిక అభివృ ద్ధితో వేగంగా ఎదుగుతున్న మంచిర్యాల.. భవిష్యత్ వృద్ధికి కీలక కేంద్రంగా నిలుస్తుంది. రైల్వేలకు సంబంధించిన ఇతర డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్త.