జమ్మూ కాశ్మీర్కు వందే భారత్ రైలు

జమ్మూ కాశ్మీర్కు వందే భారత్ రైలు

త్వరలోనే జమ్మూ కాశ్మీర్ కు వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు.. కాశ్మీర్‌ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతూ వందే భారత్‌ రైలును ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా నుంచి జమ్మూ కాశ్మీర్‌ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిచేందుకు ఎనిమిది కోచ్‌లను కేటాయించింది రైల్వేశాఖ. 

దాదాపు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులన్నీ పూర్తి కావొచ్చాయి. అయితే.. కొన్ని చోట్ల సొరంగాల వెంట పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక్కడ పనులు కాస్తా ఆలస్యం జరగొచ్చని రైల్వేశాఖ అధికారి ఒకరు చెప్పారు. వందే  భారత్ ట్రైన్ అందుబాటులోకి వస్తే జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు దాదాపు మూడున్నర గంటల సమయం అదా అవుతుంది. ప్రస్తుతం 248 కిలోమీటర్ల పొడవైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతోంది.

ఒకవేళ వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే.. జమ్ము కాశ్మీర్ లోయల్లోని కుంకుమపువ్వు,  పొలాలు, యాపిల్ తోటల గుండా పర్యాటకులకు మరపురాని రైలు ప్రయాణ అనుభవం పొందవచ్చంటున్నారు. ట్రైన్ లో ప్రయాణిస్తూనే జమ్ము కాశ్మీర్ అందాలను తిలకించేందుకు ప్రత్యేకంగా విస్టాడోమ్ కోచ్‌లు (అద్దాలు లాంటి కోచ్లు) ఏర్పాటు చేస్తున్నారు. రాంబన్ జిల్లాలోని ఖరీ స్టాటన్‌లోని బనిహాల్ నుండి గత వారం మొదటిసారిగా 15- కిలోమీటర్ల మేర ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది ఉత్తర రైల్వేశాఖ.