తెలంగాణ కిచెన్ : కరకరా కాలీఫ్లవర్ కమ్మని కాఫీ ఫ్లేవర్​

తెలంగాణ కిచెన్ : కరకరా కాలీఫ్లవర్ కమ్మని కాఫీ ఫ్లేవర్​

కూరగాయలు, పండ్లు... ఇవి ఏ సీజన్​లో వచ్చేవి ఆ సీజన్​లో తినడం హెల్త్​కి మంచిది. కానీ, వాటిని రొటీన్​గా తినాలంటేనే బోర్ కొడుతుంది. అలాంటప్పుడు ఇలా వెరైటీలు ట్రై చేయాలి. కాలీఫ్లవర్​తో కరకరలాడే శ్నాక్స్​, వాటితోపాటు కమ్మని కాఫీ ఫ్లేవర్​తో వెరైటీ​ రెసిపీలు ఈ వారం స్పెషల్​.

స్పైస్డ్ కాఫీ  కుల్ఫీ

కావాల్సినవి :
బాదం పప్పులు
-  100 గ్రాములు, పాలు -  అర లీటర్
కండెన్స్డ్​ మిల్క్ -  అర కప్పు, ఫ్రెష్​ క్రీమ్​ -  అర కప్పు
కాఫీ పొడి -  ఒక టీస్పూన్, దాల్చిన చెక్క -  చిన్న ముక్క
అనాస పువ్వు -  రెండు, యాలకులు -  రెండు

తయారీ : బాదం పప్పుల్ని వేగించి, సన్నగా తరగాలి. ఒక గిన్నెలో పాలు కాగబెట్టాలి. పాలు పొంగు వచ్చాక అందులో కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్​ క్రీమ్​ వేయాలి. వాటితోపాటు కాఫీ పొడి​, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు వేసి మరికాసేపు కాగబెట్టాలి. ఈ పాలు చల్లారాక వేసిన మసాలాలన్నింటినీ తీసేసి, అందులో బాదం తరుగు వేయాలి. కాఫీని కుల్ఫీ కోన్స్​లో పోయాలి. తరువాత వాటిని ఫ్రిజ్​లో ఎనిమిది గంటలు లేదా ఒక రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత తీసి తింటే టేస్ట్​ బాగుంటుంది. 

కాలీఫ్లవర్ పకోడి

కావాల్సినవి :
కాలీఫ్లవర్ (చిన్నది)
-  ఒకటి, శనగ పిండి -  పావు కిలో
గరం మసాలా -  రెండు టీస్పూన్లు
ఎండు మిర్చి తునకలు (చిల్లీ ఫ్లేక్స్) -  అర టీస్పూన్
కొత్తిమీర తరుగు -  రెండు టేబుల్ స్పూన్లు
నూనె -  వేగించడానికి సరిపడా

తయారీ : కాలీఫ్లవర్​ని ఓ మాదిరి పూలుగా తరగాలి. గిన్నెలో నీళ్లు మరిగించి అందులో తరిగిన కాలీఫ్లవర్ వేసి రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటిని వడకట్టాలి. ఒక గిన్నెలో శనగపిండి, ఎండుమిర్చి తునకలు, కొత్తిమీర తరుగు, గరం మసాలా వేయాలి. అందులో నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత పాన్​లో నూనె వేడి చేసి కాలీఫ్లవర్​ తరుగుని శనగపిండిలో ముంచి, నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. అంతే కరకరలాడే కాలీఫ్లవర్​ పకోడి రెడీ. 

జర్మన్ కట్​లెట్

కావాల్సినవి:
కాలీఫ్లవర్ -
 ఒకటి
బ్రెడ్ పొడి -  రెండు కప్పులు 
ఆలుగడ్డలు -  నాలుగు, కారం -  ఒక టీస్పూన్
కోడిగుడ్లు -  రెండు
మిరియాల పొడి -  అర టీస్పూన్
ఉప్పు -  సరిపడా, చీజ్ -  100 గ్రాములు
నూనె -  రెండు టేబుల్ స్పూన్లు, 
కొత్తిమీర తరుగు -  కొంచెం

తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోయాలి. అందులో ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత నీటిని వడకట్టాలి. ఆలుగడ్డల తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని కూడా వేడి నీళ్లలో ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు వడకట్టి ఒక గిన్నెలో వేసి, అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి మెత్తగా మెదపాలి. తర్వాత కోడిగుడ్ల సొన కార్చి బాగా కలపాలి. బ్రెడ్ పొడి, కారం, మిరియాల పొడి, ఉప్పు, చీజ్, కొత్తిమీర తరుగు వేసి మళ్లీ ఒకసారి అన్నీ కలిసేలా కలపాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేయాలి. వాటిని కట్​లెట్​లా చేత్తో వత్తి బ్రెడ్​ పొడిలో అద్దాలి. పాన్​లో నూనె వేడి చేసి కట్​లెట్​లను రెండు వైపులా దోరగా కాల్చాలి. 

స్పానిష్ గార్లిక్​  ఫ్లవర్

కావాల్సినవి :
కాలీఫ్లవర్ -  ఒకటి

వెల్లుల్లి తరుగు -  ఒక టేబుల్ స్పూన్
కారం -  ఒక టీ స్పూన్
నూనె -  సరిపడా
కొత్తిమీర తరుగు -  కొంచెం

తయారీ : కాలీఫ్లవర్​ని తరిగి శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి కాగబెట్టాలి. ఈ వేడి నీళ్లలో కాలీఫ్లవర్​ పూల తరుగు వేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ నీటిని వడకట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి తరుగు వేయాలి. అవి వేగాక, కారం కలపాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ తరుగు, ఉప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. వేగించిన పూలను ప్లేట్​లోకి తీసి కొత్తిమీర తరుగు చల్లి తినేయాలి.  

కాఫీ  వేఫర్ రోల్స్

కావాల్సినవి :
మైదా లేదా గోధుమపిండి
– ముప్పావు కప్పు
కొకొవా పౌడర్ – మూడు టేబుల్ స్పూన్లు
చక్కెర పొడి – అర కప్పు
బేకింగ్ పౌడర్ – అర టీస్పూన్
పాలు – అర కప్పు
వెనీలా ఎసెన్స్ – ఒక టీస్పూన్

తయారీ :ఒక గిన్నెలో గోధుమపిండి, కొకొవా పౌడర్, చక్కెర పొడి, బేకింగ్ పౌడర్ వేయాలి. అందులో పాలు పోసి బాగా కలపాలి. తరువాత వెనీలా ఎసెన్స్ వేసి మరికాసేపు కలపాలి. ఆ తర్వాత పాన్​ వేడి చేయాలి. వేడైన పాన్​లో ఈ మిశ్రమాన్ని వేసి బ్రష్​తో పాన్​ అంతా పరవాలి. మూత పెట్టి 30 సెకన్లు ఉంచాక దాన్ని తీసి స్టీల్​ స్ట్రా లేదా పుల్లకి చుట్టి పక్కన పెట్టాలి. మరో పాన్​లో ఇడ్లీ స్టాండ్ పెట్టి అందులో నూనె పూసిన ప్లేట్​ పెట్టాలి. ఆ ప్లేట్​లో చుట్టిన కాఫీ వేఫర్లను పెట్టి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తిప్పి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. అంతే.. క్రిస్పీగా ఉండే కాఫీ వేఫర్స్ రెడీ. వీటిని అలాగే నేరుగా తినొచ్చు లేదా వాటి లోపల కాఫీ ఫ్లేవర్​ ఉండే చాకొలెట్ క్రీమ్​ స్టఫ్​ చేసుకుని కూడా తినొచ్చు. 

మినీ కాఫీ కేక్స్

కావాల్సినవి :
గోధుమ పిండి -  ఒక కప్పు
చక్కెర పొడి -  అర కప్పు
పాల పొడి-  ఒక టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ -  ఒక టీస్పూన్
బేకింగ్ సోడా -  అర టీస్పూన్
ఉప్పు -  చిటికెడు, పాలు -  ముప్పావు కప్పు
నూనె -  పావు కప్పు
కొకొవా పౌడర్ -  రెండు టేబుల్ స్పూన్లు
వెనీలా ఎసెన్స్ -  ఒక టీస్పూన్
తాజా పెరుగు -  పావు కప్పు
వెనిగర్ -  అర టీస్పూన్
తయారీ :
ఒక గిన్నె మీద జల్లెడ పెట్టి అందులో గోధుమపిండి, పాలపొడి, చక్కెర పొడి, కొకొవా పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించాలి. తర్వాత వాటన్నింటిని బాగా కలపాలి. మరో గిన్నెలో పాలు, నూనె, వెనీలా ఎసెన్స్, తాజా పెరుగు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గోధుమపిండి మిశ్రమంలో వేయాలి. అందులోనే వెనిగర్ కూడా వేసి బాగా కలపాలి. పొంగనాల పాన్​కి నూనె పూసి అందులో ఒక్కో గరిటె ఈ మిశ్రమం వేయాలి. పైన బాదం పలుకులు చల్లి మూత పెట్టాలి. తక్కువ మంట మీద ఎనిమిది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత తీసి తింటే బాగుంటాయి.