13 లక్షల ఎకరాల్లో పంట మునక..వెయ్యి కోట్లకుపైగా నష్టం

13 లక్షల ఎకరాల్లో పంట మునక..వెయ్యి కోట్లకుపైగా నష్టం
  • 13 లక్షల ఎకరాల్లో పంటలు మునక.. రూ. వెయ్యి కోట్లకుపైగా నష్టం
  • పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, 
  • కొత్తగూడెం జిల్లాల్లో ఇంకా నీటిలోనే వేల ఎకరాలు
  • ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా లక్షా 3 వేల 605 ఎకరాల్లో పంట నష్టం 
  • అనేక జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు.. కూలిన ఇండ్లు..  
  • విద్యుత్​ వ్యవస్థ అస్తవ్యస్తం..4 వేలకు పైగా కరెంటు పోల్స్​ నేలమట్టం
  • సత్వర సాయం కోసం బాధితుల ఎదురుచూపులు

హైదరాబాద్ ​/ నెట్​వర్క్, వెలుగు: వరుసగా వారం రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రూ. 1,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానంగా వర్షాలు, వరదలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. గోదావరి తీరం వెంట ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో వేలాది ఎకరాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. గురువారమే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ శుక్రవారం కూడా వివిధ విభాగాల ఆఫీసర్లు పెద్దగా రంగంలోకి దిగలేదు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అనేక గ్రామాలకు కరెంట్ సప్లయ్​ఇంకా అందడం లేదు. భగీరథ మోటార్లు గోదావరిలో మునగడంతో చాలా ఏరియాలకు తాగునీరు అందడం లేదు. కీలకమైన రోడ్లకు తాత్కాలిక రిపేర్లు చేయకపోవడంతో వందలాది గ్రామాల్లో రాకపోకలు సాగడం లేదు. చెరువుల గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు  100 చెరువులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఇండ్లు కూలిపోయినవాళ్లకు తక్షణ సాయంగా రూ.5వేలు అందించాల్సి ఉన్నా ఎవరికీ నయాపైసా ఇవ్వడంలేదు. దీంతో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల ఇండ్లు కూలిపోయాయి. 

ఇందులో పదో వంతు ఇండ్లు పూర్తిగా నేలమట్టమట్టం కావడంతో దిక్కుతోచని కుటుంబాలు ప్రస్తుతానికి స్కూళ్లు, సర్కారు ఆఫీసుల్లో తలదాచుకుంటున్నాయి. కుళ్లిపోతున్న పత్తి, సోయాబిన్వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు వానాకాలం పంటలు ఆగమయ్యాయి. ప్రధానంగా పత్తి, సోయాబిన్​, మక్క రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సీజన్​లో రైతులు జూన్‌‌ రెండోవారం నుంచి విత్తనాలు వేయడం ప్రారంభించారు. జులై 8న వర్షాలు మొదలయ్యేదాకా కూడా విత్తనాలు వేయడంలోనే ఉన్నారు. ఈ క్రమంలో వారం పాటు కురిసిన వర్షాలకు కొన్ని విత్తనాలు భూమిలోనే కుళ్లిపోగా,  మరికొన్ని మొక్క దశలోనే కొట్టుకుపోయాయి. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న జిల్లాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్నాయి. ఇక ఆయా పంటలపై  ఆశ వదులుకోవాల్సిందేనని రైతులు అంటున్నారు. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ టార్గెట్‌‌ పెట్టుకోగా, ఇప్పటికే 53.79 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. అగ్రికల్చర్​ రిపోర్ట్​ ప్రకారం 38.48 లక్షల ఎకరాల్లో  పత్తి,  3.21 లక్షల ఎకరాల్లో సోయాబిన్​, 4.10 లక్షల ఎకరాల్లో కంది, పెసర , రెండున్నర లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యాయి. ఇక 2.58 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ప్రస్తుత వరదలకు ఇందులో సుమారు 13 లక్షల ఎకరాల్లో.. అత్యధికంగా పత్తి, సోయాబిన్​  దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.

రోడ్లకు రూ.200 కోట్ల నష్టం

వరుస వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా చాలా రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. జాతీయ రహదారులు 37 చోట్ల, రాష్ట్ర రహదారులు 70 చోట్ల దెబ్బతిన్నాయి. మున్సిపల్ ఏరియాల్లో 250 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి సుమారు 100 కల్వర్టులు దెబ్బతిన్నాయి. దాదాపు 109 గ్రామ పంచాయతీ రోడ్లు దెబ్బతినడంతో 43 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానంగా మారాయి. అలాగే గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద తెలంగాణ, మహారాష్ట్రను కలిపే బ్రిడ్జి ప్రారంభంలోని అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రకు రాకపోకలు బంద్ అయ్యాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఎన్‌‌హెచ్‌‌-63 వద్ద నీల్వాయి, చెన్నారు– -బుద్దారం రోడ్డు, వేమనపల్లి–-రావులపల్లి, జైపూర్‌‌ –-షెట్‌‌పల్లి, నక్కలపల్లి మధ్య రహదారులు ధ్వంసమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సమీపంలో ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద రోడ్డు కోతకు గురైంది. గ్రామీణ రోడ్లకు రూ.133 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రహదారుల ధ్వంసంతో మొత్తంగా సుమారు  రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సర్కారుకు నివేదించారు. 

స్తంభించిన జనజీవనం

వరదలతో 14 మున్సిపాలిటీల్లో జనజీవనం స్తంభించింది. మరో 79 మున్సిపాలిటీలు వరద ముంపునకు గురయ్యాయి.  సుమారు 50 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పైప్‌‌లైన్లు, 10 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. వర్షాలతో జరిగిన ప్రాణనష్టం, పశువులు, పంటలు, రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాల నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించింది.

 విద్యుత్‌‌ వ్యవస్థ అస్తవ్యస్తం

వర్షాల ఎఫెక్ట్‌‌తో వరంగల్‌‌ కేంద్రంగా ఉన్న ఎన్‌‌పీడీసీఎల్‌‌ పరిధిలో విద్యుత్‌‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పొంగిన వరదలు, వర్షాల తాకిడికి నాలుగువేలకు పైగా విద్యుత్‌‌ స్థంభాలు కూలిపోయి కరెంటు తీగలు తెగిపడ్డాయి. గ్రామాల్లో విద్యుత్‌‌ సరఫరా నిలిచిపోయింది.  ఇప్పటి వరకు 1,800 పోళ్లను పునరుద్దించగా, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వందలాది గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. 

ఎక్కువ నష్టం ఈ జిల్లాల్లోనే.. 

ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 3 వేల 605 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆఫీసర్లు తేల్చారు. ఇందులో 67,945 ఎకరాల్లో పత్తి,  27,185 ఎకరాల్లో సోయాబీన్​, 8,175 ఎకరాల్లో కంది ఉన్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే రూ. 72.85 కోట్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాలో 70కి పైగా రోడ్లు, 10 వంతెనలు తెగిపోయి వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్​ అయ్యాయి.  39 చెరువులు తెగిపోయాయి. 1,200కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి.  ఆసిఫాబాద్ జిల్లాలో  పత్తి 45 వేల ఎకరాలు ,కంది 5 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 36  రోడ్లు, 30 కల్వర్టు లు  తెగిపోయాయి. 122 ఇండ్లు దెబ్బతిన్నాయి. మంచిర్యాల జిల్లాలో 34,687 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 32,285 ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. 753 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మొత్తం 19,889 మంది రైతులు నష్ట పోయారు. జిల్లావ్యాప్తంగా 200కు పైగా ట్రాన్స్​ఫార్మర్లు నీటమునిగాయి. 300 దాకా కరెంట్​పోల్స్​ కూలిపోయాయి.  60 కిలోమీటర్ల మేర ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా లో  25 వేల నుంచి 30 వేల ఎకరాలలో పత్తి, సోయా, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ జిల్లాలో 45 రోడ్లు దెబ్బతిన్నాయి. 370 ఇండ్లు పాక్షికంగా, 14 నేలమట్టమయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో 51,591 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో 2 వేల ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.  470 ఇండ్లు పాక్షికంగా, 13 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. 19 గ్రామాల్లో  862 మంది రాశ్రయులైనట్లు ఆఫీసర్లు ప్రకటించారు.  27 రోడ్లు కోతకు గురయ్యాయి. 89 విద్యుత్ స్తంభాలు నేల మట్టమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 12వేల ఎకరాల్లో వరి, మక్క, సోయా పంటలు దెబ్బతిన్నాయి. రోజుల తరబడి పంటల్లో నీళ్లు నిల్వ ఉండడం వల్ల నష్టం మరింత పెరగవచ్చని ఆఫీసర్లు అంటున్నారు. ఈ జిల్లాలో 82 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజీ అయ్యాయి. సుమారు 500 ఇండ్లు కూలిపోయాయి. 

పెద్దపల్లి జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 219 ఇండ్లు నేలమట్టమయ్యాయి. జగిత్యాల జిల్లాలో 12,558 మంది రైతులకు చెందిన 22,992 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.  22 పంచాయతీ రోడ్లు, 10 ఆర్అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. 5 చెరువులకు గండ్లు పడ్డాయి. 319 ఇండ్లు డ్యామేజీ అయ్యాయి. 

జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు గోదావరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తీరం వెంటే సుమారు 20వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.  వరదల వల్ల భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాల్లోని 44 గ్రామాలు పూర్తిస్థాయిలో ముంపునకు గురయ్యాయి. ఈ జిల్లాలో  955 ఇండ్లు పాక్షికంగా, 51 ఇండ్లు పూర్తిస్థాయిలో కూలిపోయాయి.  వరదల తాకిడికి 24 వాటర్ ట్యాంకులు, 28 రోడ్లు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు తెలిపారు. ములుగు జిల్లాలో 209 ఇండ్లు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు తెలిపారు. 

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పది వేలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 రోడ్లు18 చోట్ల  తెగాయి. మూడు బ్రిడ్జిలు కొట్టుకపోయాయి. 92ఇండ్లు కూలిపోయాయి.  భద్రాచలం డివిజన్​లోని చర్ల, అశ్వాపురం , దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో వేలాది ఎకరాలు గోదావరి వరద నీటిలో మునిగాయి. వరద తగ్గితే తప్ప నష్టం అంచనా వేయలేమని ఆఫీసర్లు చెప్తున్నారు.