వట్టెంకు భూములిచ్చిన పాపానికి ఎట్టి బతుకులాయె!

వట్టెంకు భూములిచ్చిన పాపానికి ఎట్టి బతుకులాయె!

నాగర్​కర్నూల్/కందనూలు, వెలుగు: పాలమూరు – రంగారెడ్డిలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్​కు భూములిచ్చిన నిర్వాసితులు ఆగమయ్యారు. సర్కారు ఎకరానికి కేవలం రూ. 3.50 లక్షల నుంచి 4.50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోగా, ఆ పైసలు ఏనాడో కరిగిపోయాయి. ప్రస్తుతం చేసేందుకు పనిలేక, చేతిలో చిల్లిగవ్వ లేక భారంగా బతుకీడుస్తున్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న మట్టి ఇండ్లలో కొందరు బిక్కుబిక్కుమంటూ బతుకుతుండగా, ఇప్పటికే ఇండ్లు కూలిపోయిన కొందరు బాత్రూమ్​లలో, రేకుల షెడ్లలో తలదాచుకుంటున్నారు. గత ఎన్నికల ముందు అందరికీ డబుల్​ బెడ్​ రూం ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చిన ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారు. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పటికైనా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు.

వట్టెంలో 2,900 ఎకరాల సేకరణ

14.7 కి.మీ.ల పొడవు,16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల వట్టెం రిజర్వాయర్​పనులను 2015లో ప్రారంభించారు. నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో దాదాపు 5 వేల ఎకరాల వరకు ఉండగా ఇందులో వట్టెం రిజర్వాయర్ కోసం ఇప్పటికే 2,400 ఎకరాలు సేకరించారు.కాల్వల కోసం మరో 400 ఎకరాల వరకు భూసేకరణలో పోనుంది. అప్పట్లో ఎకరాకు రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ఇందులో 35 మంది రైతులు కోర్టుకు వెళ్లడంతో వారికి రూ. 9.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. పరిహారం లెక్క కట్టే టైంలో చెట్లు, బోర్లు, బావులు, పైప్​లైన్లు, పశువుల కొట్టాలు ఎగరగొట్టి రైతులను నిండా ముంచారు. వచ్చిన పరిహారంతో చాలామంది పాత అప్పులు తీర్చగా.. చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు. ప్రస్తుతం గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులను గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం పరిహారం, పునరావాసం అన్ని విషయాల్లో కక్ష సాధించినట్లు వ్యవహరిస్తోందని బాధితులు వాపోతున్నారు. 

భూమి పాయే.. ఉపాధి కరువాయే

వట్టెం గ్రామానికి చెందిన బుడ్డన్నకు నలుగురు కొడుకులు. 5 ఎకరాలు రిజర్వాయర్లో పోయాయి. సర్కారు ఇచ్చిన పరిహారం నుంచి అప్పులు కట్టగా కొడుకులకు తలా రూ. 50 వేలు మిగిలినై. ఈ డబ్బుతో గ్రామంలో 100 గజాల జాగ కూడా దొరకదు. దీంతో నలుగురు కొడుకులు వ్యవసాయ కూలీలుగా మారారు.  రేకుల షెడ్డు  వేసుకుని బతుకుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన అయిలమోని యాదమ్మకు ఇద్దరు కొడుకులు. రెండెకరాలు ప్రాజెక్టు కింద పోవడంతో చెట్టు కింద ఇల్లే మిగిలింది. గ్రామానికి చెందిన మాల శంకర్​కు మూడెకరాల భూమి ఉంది. తక్కువ పరిహారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించాడు. పరిహారం అందలేదు కానీ భూమి పోయింది. రైతుబంధు ఆగింది. భార్య, ఇద్దరు పిల్లలతో రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ప్రస్తుతం గ్రామంలో 92 మట్టి ఇండ్లు ఉన్నాయి. ఇందులో దళితులవే ఎక్కువ. వర్షాలకు కొన్ని ఇండ్లు కూలిపోవడంతో తల దాచుకునేందుకు బాత్రూంలను ఇండ్లుగా మార్చుకున్నారు. 

భూమి పోయింది.. రోడ్డు గతైంది.

పాలమూరు ప్రాజెక్ట్​లో మా భూములు పోయినై. ఇచ్చిన పరిహారం పైసలు అప్పులకు సరిపోయినై. రోడ్డున పడ్డం. కాంపౌండ్ గోడకు రేకులు వేసుకుని బతుకుతున్నం. – ఎరుకలి రాములు, వట్టెం

పరిహారం చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం

పరిహారం  చెల్లింపు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వట్టెంలో ఎకరాకు రూ.25 లక్షల వరకు ధర పలుకుతుండగా మాకు మాత్రం రూ.3.5 లక్షలే చెల్లించారు. సాగు చేసుకునేందుకు భూమి లేదు. కూలి దొరకని కుటుంబాలకు పస్తులే గతి అన్నట్లు ఉంది. – తిరుపతి రెడ్డి, వట్టెం