నటి ఖుష్బూపై అట్రాసిటి ఫిర్యాదు!

నటి ఖుష్బూపై అట్రాసిటి ఫిర్యాదు!

తమిళ నటి ఖుష్బూ(Khushboo)పై అట్రాసిటి ఫిర్యాదు నమోదయ్యింది. దళితులు మాట్లాడే భాషను కించపరిచినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో శుక్రవారం వీసీకే తరుపున ఫిర్యాదు చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ ఎంత దుమారాన్ని రేపాయో తెలిసిన విషయమే. మన్సూర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇదే విషయంపై సోషల్ మీడియా వేధికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మీలా లోకల్ భాషలో నేను మాట్లాడలేను.. అన్నారు ఖుష్బూ.

ఖుష్బూ చేసిన ఈ కామెంట్స్ పై దళిత వర్గాల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. దళితులు మాట్లాడే భాషను కించపరిచి మాట్లాడారని ఖుష్బూపై అట్రాసిటి చట్టం కింద వీసీకే నేతలు ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకురాలై ఉండి ఇలా మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంజన్ కుమార్. సహనటి త్రిష విషయంలో ఆసక్తి చూపిస్తున్న ఖుష్బు.. మణిపూర్ మహిళల ఘటన జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టు తొలగించి వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని,  లేదంటే ఆమె ఇంటి ముందు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మరి ఈ వివాదంపై నటి ఖుష్బూ ఎలా స్పందించనున్నారు అనేది చూడాలి.