స్ట్రీట్​డాగ్స్​ కోసం వీరాంజయ్​ హెగ్డే

స్ట్రీట్​డాగ్స్​ కోసం వీరాంజయ్​ హెగ్డే

గాయపడిన వీధి కుక్కలను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఇంటికి తీసుకెళ్లి తిండి పెట్టి, గాయాలకు మందు రాస్తాడు. అవసరమైతే వాటికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాడు. ‘అహింస యానిమల్ కేర్ ట్రస్ట్​’ పెట్టి, ఇరవయ్యేండ్లుగా స్ట్రీట్​డాగ్స్​ కోసం పనిచేస్తున్నాడు వీరాంజయ్​ హెగ్డే.

కర్నాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన వీరాంజయ్​కి చిన్నప్పటి నుంచి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే కాసేపు వాటితో ఆడుకునేవాడు. వాటికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోయేవాడు. స్కూల్​ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గాయపడ్డ వీధి కుక్కలు కనిపించేవి. వాటిని చూసినప్పుడల్లా ‘వాటికి ఎవరైనా ట్రీట్మెంట్ చేయిస్తే బాగుండు’ అనుకునేవాడు​ వీరాంజయ్​. పెద్దయ్యాక వీధి కుక్కల్ని కేర్​టేకర్​లా చూసుకునే బాధ్యత తనే తీసుకోవాలి అనుకున్నాడు. దాంతో 2002లో ‘అహింస యానిమల్ కేర్ ట్రస్ట్’ పెట్టాడు. అప్పటి నుంచి వీధి కుక్కల్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం మొదలుపెట్టాడు. మొదట్లో 300లకు పైగా కుక్కలను తన ఇంట్లోనే ఉంచాడు. అతని గురించి తెలిసి డోనర్స్ ఆర్థిక సాయం చేసేవాళ్లు. అలా ఇప్పుడు 15 లక్షలతో కుక్కల కోసం పెద్ద షెడ్డు కట్టించాడు. 

సర్జరీ క్యాంప్​లు

గాయపడ్డ కుక్కలకు వెటర్నరీ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయిస్తాడు వీరాంజయ్​. క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుక్కల కోసం ఇప్పటి వరకు 7 సర్జరీ క్యాంప్​లు పెట్టాడు.  వెటర్నరీ డాక్టర్లతో కలిసి ‘యానిమల్ బర్త్ కంట్రోల్’ ప్రోగ్రాం కూడా మొదలుపెట్టాడు.  ఈమధ్యే గాయపడ్డ పిల్లులు, కుందేళ్లు, పక్షులకు కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అంతేకాదు అనారోగ్యం నుంచి కోలుకున్న కుక్కల్ని పెంచుకునేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకోసం నెలకోసారి ‘అడాప్టింగ్​ క్యాంప్’ పెడతాడు.