వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన వీరాపూర్‌‌‌‌ గ్రామ రైతులు

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన వీరాపూర్‌‌‌‌ గ్రామ రైతులు

రాయికల్, వెలుగు : వడ్లు తీసుకొచ్చి రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదంటూ జగిత్యాల జిల్లా రాయికల్‌‌‌‌ మండలంలోని వీరాపూర్‌‌‌‌ గ్రామ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు జగిత్యాల – రాయికల్‌‌‌‌ ప్రధాన రహదారిపై ఉప్పుమడుగు వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వడ్లు కొనాలని పలుమార్లు ఆఫీసర్లను కలిసినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి త్వరగా కొనుగోళ్లు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

 రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న జిల్లా సహకార అధికారి సీహెచ్‌‌‌‌.మనోజ్‌‌‌‌కుమార్‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ ఖయ్యూం, ఎస్సై సుధీర్‌‌‌‌రావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఉప్పుమడుగు పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్ దీటి రాజరెడ్డి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ దుంపల స్వామిరెడ్డి, రైతులు దిండిగాల రామస్వామి, మాద రాజేశం, ముక్కెర నరేశ్‌‌‌‌, మల్లిఖ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌, మహిపాల్, గంగాధర్, ఇస్మాయిల్, పల్లి మల్లయ్య, రాయమల్లు, భూమయ్య పాల్గొన్నారు.

ఉప్పుమడుగు సహకార సంఘం కార్యదర్శిపై సస్పెన్షన్‌‌‌‌

వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాయికల్‌‌‌‌ మండలం ఉప్పుమడుగు పీఏసీఎస్‌‌‌‌ సెక్రటరీ తిరుపతిపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. ఉప్పుమడుగు పీఏసీఎస్‌‌‌‌ పరిధిలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోగా, కొనుగోళ్ల కోసం హమాలీలను కూడా నియమించలేదు. దీంతో వీరాపూర్‌‌‌‌ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్పందించిన సహకార అధికారి సెక్రటరీ తిరుపతిని సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.