టైగర్ జోన్లో భారీ వెహికల్స్కు అనుమతి : శివ్ ఆశిష్ సింగ్

టైగర్ జోన్లో భారీ వెహికల్స్కు అనుమతి :  శివ్ ఆశిష్ సింగ్
  • డీఎఫ్​వో శివ్ ఆశిష్​ సింగ్

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ నుంచి భారీ వాహనాల రాకపోకలపై విధించిన అంక్షలను ప్రభుత్వం ఎత్తివేసిందని మంచిర్యాల డీఎఫ్ వో శివ్ ఆశిష్​సింగ్ తెలిపారు. సోమవారం రాత్రి జన్నారంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 4న  హైదారాబాద్​లోని అరణ్య భవన్​లో జరిగిన వైల్డ్ లైఫ్ బోర్టు మీటింగ్​లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పీసీసీఎఫ్ ​సువర్ణ, స్టేట్ వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ​ఎలుసింగ్ మేరుతో పాటు వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి వాహనాల అనుమతిపై సుదీర్ఘంగా చర్చించారని, అనుమతులిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. 

టైగర్ జోన్ పరిధిలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చిందన్నారు.  రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ట్రాన్స్ పోర్టు వాహనాలకు రూ.150, జీపులకు, కార్లకు చెక్ పోస్టుల వద్ద ఎంట్రీ ఫీజు ఉంటుందని తెలిపారు. జన్నారం ఇన్​చార్జ్ ఎఫ్ఆర్​వో సుస్మారావు, ఇందన్​పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధర్ చారీ, బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్లు దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.