
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల డిమాండ్ కారణంగా సెప్టెంబర్‌లో వెహికల్స్డిస్పాచ్లు (కంపెనీల నుంచి డీలర్లకు వచ్చినవి) పెరిగాయని ఆటోమొబైల్పరిశ్రమ సంఘం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) బుధవారం తెలిపింది. గత సెప్టెంబర్‌లో 3,56,752 యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్వెహికల్స్ (పీవీ) డిస్పాచ్‌లు గత నెలలో 4 శాతం పెరిగి 3,72,458 యూనిట్లకు చేరాయి.
టూవీలర్సేల్స్ ఏడు శాతం పెరిగి 21,60,889 యూనిట్లకు ఎగిశాయి. గత సెప్టెంబర్లోలో 20,25,993 యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రీవీలర్ డిస్పాచ్‌లు 5.5 శాతం వృద్ధితో 79,683 యూనిట్ల నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. కేవలం 9 రోజుల్లోనే ప్యాసింజర్ వెహికల్స్, టూ, త్రీవీలర్అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. జీఎస్టీ 2.0 భారత ఆటో పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే కాక, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోందని అన్నారు.--
రెండో క్వార్టర్లో అమ్మకాలు ఇలా..
ఈ ఏడాది జులై–-సెప్టెంబర్ క్వార్టర్లో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 1.5 శాతం తగ్గి 10,39,200 యూనిట్లకు పడిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 10,55,137 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ క్వార్టర్లో మొదటి రెండు నెలల్లో తగ్గుదల కనిపించినా, జీఎస్టీ తగ్గింపు, వినియోగదారుల బలమైన సెంటిమెంట్, పండుగ సీజన్ ప్రారంభం కారణంగా సెప్టెంబర్‌లో సేల్స్ పెరిగాయని చంద్ర తెలిపారు.
ప్యాసింజర్ వెహికల్స్సెగ్మెంట్లో యుటిలిటీ వెహికల్స్ వాటా దాదాపు మూడింట రెండు వంతులు ఉంది. పీవీల్లో ఎస్యూవీ సెగ్మెంట్ వాటా 29 శాతం నుంచి 56 శాతానికి పెరిగిందని చంద్ర పేర్కొన్నారు. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం ఈ క్వార్టర్లో పెద్దగా మారలేదు. జీఎస్టీ రేటు తగ్గింపుతో ధరలు తగ్గడం ద్వారా చిన్న కార్ల సెగ్మెంట్లో అమ్మకాలు పెరిగాయని ఆయన తెలిపారు.
టూవీలర్ అమ్మకాలు 7 శాతం జంప్
టూవీలర్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 7 శాతం వృద్ధితో 55,62,077 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు, కొనుగోలు శక్తి, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, జీఎస్టీ రేటు తగ్గింపు దీనికి దోహదపడ్డాయని సియామ్ తెలిపింది. స్కూటర్ల సెగ్మెంట్ 12 శాతం, మోటార్‌సైకిళ్ల సెగ్మెంట్ 5 శాతం వృద్ధిని సాధించాయి.
త్రీవీలర్ డిస్పాచ్‌లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో 2,29,239 యూనిట్లకు పెరిగాయి. పట్టణ, సెమీ–-అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్, సులభమైన ఫైనాన్సింగ్, రీప్లేస్మెంట్ అమ్మకాలు ఈ వృద్ధికి కారణం. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు జులై క్వార్టర్లో 8 శాతం వృద్ధితో 2.4 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఇక నుంచి కూడా ఆటో అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సియామ్ తెలిపింది.