ఏపీలో కర్ఫ్యూ: సరిహద్దుల్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు

ఏపీలో కర్ఫ్యూ: సరిహద్దుల్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలు సరిహద్దుల దగ్గర నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలోని ఏపీ సరిహద్దులైన గరికపాడు, వాడపల్లి చెక్‌పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలను నిలిపివేశారు ఆ రాష్ట్ర పోలీసులు. ఏపీలో మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చెక్‌ పోస్టుల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మాత్రమే మినహాయింపు ఉంది. విమాన, రైల్వే ప్రయాణాలకు టిక్కెట్లు చూపించేవారిని, అత్యవసర సేవలు వినియోగించుకునే వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.


గతకొద్ది రోజులగా కరోనా ప్రభావంపై తీవ్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించిన ఏపీ సీఎం జగన్.. మే 5 నుండి రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది.