వెలుగు సక్సెస్ : గదర్​ పార్టీ

వెలుగు సక్సెస్ :  గదర్​ పార్టీ

గదర్​ అంటే విప్లవం లేదా తిరుగుబాటు. ఈ సంస్థను హిందుస్థాని గదర్​ పార్టీగా పిలిచారు. ఈ పార్టీని 1913, నవంబర్​ 1న అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలోని యుగాంతర్​ ఆశ్రమంలో లాలా హరదయాల్​ (ప్రధాన కార్యదర్శి) స్థాపించాడు. ఈ సంస్థకు అధ్యక్షుడు  సోహన్​ సింగ్​ భక్నా, కోశాధికారిగా పండిత్​ కాశీరాం పనిచేశారు. ఈ పార్టీలో ముఖ్య సభ్యులుగా కర్తార్​సింగ్​ శరభా, భాయ్​ ప్రేమానంద, సర్దార్​ బలవంత్​ సింగ్, పండిట్​ కాన్షీరాం, రామచంద్ర భరద్వాజ్​లు ఉండేవారు. గదర్​ పార్టీ జర్మనీ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది.

స్వేచ్ఛ, సమానత్వం, భారత్​లో బ్రిటిష్​ పాలన అంతం లక్ష్యంగా గదర్​ పార్టీ పనిచేసింది. ఈ పార్టీ గదర్​ లేదా హిందుస్థాన్​ గదర్​ అనే పత్రికను ప్రారంభించింది. ఈ పత్రిక మొదటి పేజీలో అంగ్రేజికా రాజ కచ్చాచిత్తా అనే హెడ్​లైన్​తో వరుసగా కథనాలు ప్రచురించింది. ఈ పత్రిక మొదటి ప్రతి ఉర్దూలో 1913 నవంబర్​ 1న ప్రచురితమైంది. రెండో ప్రతి గురుముఖి భాషలో అదే సంవత్సరంలో వెలువడింది. గురుముఖి భాషలోని గదర్​ పత్రికకు కర్తార్​ సింగ్​, ఎడిటర్​గా పనిచేశారు. ఇంగ్లీష్​ భాషలో ప్రచురించిన గదర్​ పత్రికకు లాలా హరిదయాల్​ సంపాదకుడిగా పనిచేశాడు.

భాయి భగవాన్​ సింగ్​ గదర్​ దీ గూంజ్​ పేరిట విప్లవ గేయాలను రచించాడు.  మొదటి లాహోర్​ కుట్ర కేసు: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1915, ఫిబ్రవరిలో బ్రిటిష్​ పాలన అంతం చేయడానికి గదర్​ పార్టీ యవద్భారత తిరుగుబాటుకు ప్రయత్నించింది. దీనినే గదర్​ తిరుగుబాటు అంటారు. ఇది విఫలమవడంతో 291 నేరారోపణ రుజువైన విప్లవ ఖైదీలకు ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ 1915 మధ్య కేసు ట్రయల్స్​ లాహోర్​లో జరిగాయి. ఇందుకోసం అప్పటి గవర్నర్​ జనరల్​ లార్డ్​ హార్డింజ్​ విప్లవాత్మక కార్యకలాపాలను అణచడానికి భారత రక్షణ చట్టం – 1915 ను తీసుకువచ్చి, ఆ చట్టం కింద లాహోర్​ కుట్రకేసు విచారణను  అమలు చేశారు.