వందేండ్ల వేమనాంధ్ర భాషా నిలయం : డా. రవికుమార్‌‌‌‌ చేగొని

వందేండ్ల వేమనాంధ్ర  భాషా నిలయం : డా. రవికుమార్‌‌‌‌ చేగొని

నాడు హైదరాబాద్‌‌‌‌ రాష్ర్టం మొత్తం జనాభాలో సగానికిపైగా తెలుగువారే ఉండేవారు.  కానీ, హైదరాబాద్‌‌‌‌ రాష్ర్టంలో కనీసం 100 గ్రంథాలయాలు కూడా లేని పరిస్థితి.  అక్షరాస్యత పెంచేందుకు, నలుగురికీ విజ్ఞానం పంచేందుకు భాషా నిలయాల ప్రయత్నం జరిగింది. ఉర్దూ భాష ఏలికలో  తెలుగు భాష ఉద్యమానికి, సాహితీ వికాసానికి కేంద్రంగా నిలిచిన సంస్థలలో వేమనాంధ్ర భాషా నిలయం ఒకటి. ఉర్దూ పాలనలో 100 ఏండ్ల కింద  హైదరాబాద్‌‌‌‌ నడిబొడ్డున ఆవిర్భవించిన వేమనాంధ్ర భాషా నిలయం చరిత్ర ను ఒకసారి పరిశీలిద్దాం. 

1923 అక్టోబర్​1వ తేదీన ఫిల్‌‌‌‌ ఖానాలోని ఒక కిరాయి గృహంలో వేమనాంధ్ర భాషా నిలయాన్ని కొండా వెంకట రంగారెడ్డి స్థాపించారు. స్థలాభావం వల్ల కొద్ది రోజులకే దాన్ని ఉస్మాన్‌‌‌‌ గంజ్​ సమీపంలోని సిద్ది అంబర్‌‌‌‌ బజార్‌‌‌‌ కి మార్చారు. అయితే, తెలుగువారికి  అందుబాటులో లేదన్న కారణంతో 1927 జనవరి 1వ తేదీన ఆ గ్రంథాలయాన్ని నాంపల్లిలోని అద్దె ఇంటికి తరలించారు. 1927 నాటికి ఆ  గ్రంథాలయంలో 629 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 

1925లో ఆ గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలను కేంద్ర పరిశోధనశాఖకి అప్పగించారు. ఈ గ్రంథాలయం స్థాపించినప్పటి నుంచి అక్కెనపల్సి జానకి రామారావు అధ్యక్షుడిగా, కొండా వెంకట రంగారెడ్డి కోశాధ్యక్షుడిగా, కొమ్మవరపు సుబ్బారావు కార్యదర్శిగా మూడు దశాబ్దాల పాటు సేవలందించారు.  1980 నాటికి 10వేల పైచిలుకు గ్రంథాలు అందుబాటులోకి వచ్చాయి.    

ప్రజా కవి వేమన పేరు 

ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 30,000 పై చిలుకు గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నవలలు, కథలు, వేదాంత, మత గ్రంథాలు, చరిత్ర, పరిశోధన వార్షిక సంచికలు, వచన, పద్య కావ్యం, అనేక సాంఘిక ఉద్యమాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.  ప్రజల భాషలో జీవిత సత్యాలను, స్పష్టంగా మనిషిని హత్తుకునేలా బోధించిన ప్రజాకవి వేమనను కొండా వెంకట రంగారెడ్డి అభిమానించేవారు. అందుకే ఈ గ్రంథాలయానికి వేమనాంధ్ర భాషా నిలయం అని పేరు పెట్టారు. 

1929లో బాలికల కోసం పాఠశాల

అక్కినపల్లి జానకిరామారావు, చుంగి శేషగిరిరావు, కొమ్మవరపు సుబ్బారావు చందాలు వసూలు చేసి 1942లో  సొంతభవనం బజార్‌‌‌‌ ఘాట్​లో  ఏర్పాటు చేశారు. ఇక్కడ బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం, తెలుగు భాషలో విద్యను నేర్పడం కోసం 1929 లో బాలికల పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నది.  గత ఐదు దశాబ్దాలుగా బందా మురళీకృష్ణ  కార్యదర్శిగా శక్తి వంచన లేకుండా తెలుగు భాష ఉన్నతికి కృషి చేస్తున్నారు.  తెలుగును వెలిగించిన వేమనాంధ్ర భాషా నిలయం 100 ఏండ్ల కాలంలో 9 దశాబ్దాల పాటు అనేక ఉద్యమాలకు, సాహిత్య సభలకు సమావేశాలకు కేంద్రంగా నిలిచింది.  ఈ గ్రంథాలయంలో ఉన్న గ్రంథ సంపదను ఎలక్ర్టానిక్‌‌‌‌ రూపంలో  భద్రపరిచి భవిష్యత్‌‌‌‌ తరాలకు అందించే ప్రయత్నం చేయాలి.

మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు

ఈ గ్రంథాలయం విశేషమేమంటే ఏ కార్యక్రమం నిర్వహించినా.. స్ర్తీలకు ప్రత్యేక సౌకర్యం కలదు అని రాసేవారు.  అంటే ఆ రోజుల్లోనే స్ర్తీలకు ఈ గ్రంథాలయంలో ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 1934 నాడు ఓ సభలో ఆర్య సమాజ పెద్దలు ఆదిపూడి సోమనాథరావు మాట్లాడుతూ.. ప్రతి మహిళకు వివాహ సమయంలో నగల కన్నా కత్తి బహూకరించడం అవసరమని గ్రంథాలయంలో ప్రసంగించడం జరిగింది. తొలుత ఈ గ్రంథాలయంలో 40 మంది సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ గ్రంథాలయం ఏర్పాటైన ఒక సంవత్సరంలో దాదాపు 1000 పుస్తకాలను ఇండ్లకు తీసుకెళ్లి చదివారని రికార్డులు వెల్లడిస్తున్నాయి. గద్వాల్‌‌‌‌ సంస్థాన మహారాణి వివాహ సమయంలో ఈ  గ్రంథాలయానికి 25 రూపాయలు బహూకరించారు. 

మహామహుల సాహిత్య చర్చలు

1984 నాటికి ఈ గ్రంథాలయంలో 10 దినపత్రికలు, 16 వార పత్రికలు, 6 పక్ష పత్రికలు, 30 మాస పత్రికలు, 13 వార్షిక పత్రికలు లభించేవి. వేమనాంధ్ర గ్రంథాలయంలో సాహిత్య చర్చలు, రాజకీయ సభలు, సమావేశాలు జరిగేవి. సురవరం ప్రతాపరెడ్డి, రాజా బహదుర్‌‌‌‌  వెంకటరామిరెడ్డి, మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, బూర్గు ల రామకృష్టారావు, సీతారామారావు, అడవి బాపిరాజు, ఆచార్య కురుగంటి సీతారామయ్య,  దేవులపల్లి రామానుజరావు, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు వంటి ప్రముఖులు ఈ  సమావేశాల్లో  పాల్గొనేవారు. 1932 నాటికి 18 రకాల పత్రికలతో, నాలుగు వేలకుపైగా వివిధ రకాల పుస్తకాలతో  గ్రంథాలయం కళకళలాడింది.

దసరా, దీపావళి, వినాయక చవితి వంటి పండుగలకు సాంస్కృతిక కార్యక్రమాలను ఈ గ్రంథాలయం వేదికగా నిర్వహించేవారు. శ్రీకృష్ణతులాభారం వంటి నాటక ప్రదర్శనలు కూడా చేసేవారు. బుర్రకథ, హరికథలు నిర్వహించేవారు. వేమన జయంత్యుత్సవాలు అద్భుతంగా జరిపేవారు. ఆ రోజుల్లో సభలు సమావేశాలు నిర్వహణ ఆషామాషీ కాదు. తెలుగు ఉపన్యాసాలు తొలుత ఉర్దూ భాషలోకి అనువదించి ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే  సభలో మాట్లాడాలి. అలా అన్ని ఆంక్షలు, నిర్బంధాలను తట్టుకొని సామాజిక చైతన్యాన్ని  ప్రోది చేసిన సంస్థ వేమనాంధ్ర భాషా నిలయం. 

‑ డా. రవికుమార్‌‌‌‌ చేగొని,  ప్రధాన కార్యదర్శి  తెలంగాణ గ్రంథాలయ సంఘం