భక్తుల మనోభావాల మేరకే వేములవాడ అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

భక్తుల మనోభావాల మేరకే వేములవాడ అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌
  • వేములవాడ నుంచి ముంబైకి ఏసీ బస్సు ప్రారంభం

వేములవాడ, వెలుగు ​: భక్తుల మనోభావాల మేరకే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుంది, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని హరిహర గార్డెన్స్‌‌‌‌లో మంగళవారం నిర్వహించి మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. శృంగేరి పీఠాధిపతి సలహా మేరకే వేములవాడ అభివృద్ధి జరుగుతుందని, ఇందులో వ్యక్తిగత, రాజకీయ అంశాలేమీ లేవన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిందని, ఈ విషయాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. మండలాలు గ్రామాల్లో పార్టీ పునఃనిర్మాణం జరగాలన్నారు. అనుబంధ సంఘాలు, యువజన సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఎవరైతే పార్టీని నడపగలుగుతారో వారిని గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చెప్పారు. అందరి కృషి, శ్రమతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, అన్ని ఎన్నికల్లో పార్టీ గెలిచేలా చూడాలన్నారు. కలికోట సూరమ్మ, అప్పర్‌‌‌‌ మానేరు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్‌‌‌‌, కృష్ణా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ నాగుల సత్యనారాయణగౌడ్‌‌‌‌ పాల్గొన్నారు.

వేములవాడ – ముంబై బస్సు ప్రారంభం

వేములవాడ నుంచి ముంబై వరకు నడపనున్న రెండు ఏసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ముంబైకి స్లీపర్‌‌‌‌ బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ఈ బస్సు ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి తెల్లవారి ఉదయం 4.45 గంటలకు ముంబైకి చేరుకుంటుందని, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబైలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని చెప్పారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ఝా, ఎస్పీ మహేస్‌‌‌‌ బి గీతే పాల్గొన్నారు.