ఆగమ శాస్త్రానుసారమే రాజన్న ఆలయ విస్తరణ..శృంగేరి పీఠాధిపతుల అనుమతితో అభివృద్ధి పనులు

ఆగమ శాస్త్రానుసారమే రాజన్న ఆలయ విస్తరణ..శృంగేరి పీఠాధిపతుల అనుమతితో అభివృద్ధి పనులు
  • భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా దర్శనాలు  
  • మీడియాతో రాజన్న ఆలయ ఈఓ వినోద్​రెడ్డి వెల్లడి
  • అభివృద్ధి పేరుతో ఆలయం మూసివేయొద్దు
  • రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అభివృద్ధిని అడ్డుకోవద్దు :  కాంగ్రెస్​ 
  • అయోమయంలో వర్తక, వ్యాపారులు

వేములవాడ, వెలుగు : శృంగేరి పీఠాధిపతుల అనుమతుల మేరకే  రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభించబోతున్నట్లు ఆలయ ఈఓ వినోద్ రెడ్డి తెలిపారు. ఆర్కిటెక్ట్, ప్రధాన అర్చకులతో కలిసి మంగళవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. జూన్15న ఆలయం మూసి వేస్తున్నట్లు వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. అవి కేవలం అపోహలు మాత్రమేనని ఖండించారు. ఆలయ విస్తరణ పనులు చేపడితే భక్తులకు రాజన్న అనుబంధ ఆలయం  భీమేశ్వర ఆలయంలో దర్శన సౌకర్యాలు కల్పించేందుకు తేదీని ప్రకటిస్తామని తెలిపారు. 

ఆలయం ఇరుకుగా ఉందని, లక్షల్లో భక్తులు వస్తున్నారని, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వేములవాడ ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆగమశాస్ర్త ప్రకారమే  వచ్చే1,000 ఏండ్లకు ఉపయోగపడే విధంగా డెవలప్ చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు.  

ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శంకుస్థాపనలు చేశారని గుర్తుచేశారు.  ఆలయం మూసి వేయడం ఉండదని, యధావిధిగా పూజలు కొనసాగుతున్నాయని తెలిపారు.  ఇంకా తేదీ ఖరారు కాలేదని ఆర్కిటెక్ ప్లాన్ ఫైనల్ అయ్యాక ప్రకటిస్తామని చెప్పారు.  ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 76 కోట్లతోనే పనులు చేపడతామని, భక్తుల ద్వారా వచ్చిన డబ్బులు వినియోగించడంలేదని తెలిపారు.   భక్తులు  ఆందోళనకు గురికావద్దని కోరారు. ఈ సమావేశంలో అర్చకులతో పాటు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, ఈఈ రాజేశ్ ​పాల్గొన్నారు.  

 దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పేరిట వచ్చే నెల15 నుంచి మూసి వేయవద్దని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పిలుపు నిచ్చింది. పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ఱ, సభ్యులు మంగళవారం మాట్లాడుతూ  ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని భక్తులకు దర్శనాలు బంద్​చేయకుండా చేపట్టాలని సూచించారు.  ఆలయాన్ని మూసివేస్తే వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. బుధవారం జరిగే బంద్ కు వర్తక, వ్యాపారులు  సహకరించాలని కోరారు. 

మరోవైపు పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేని  కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకోవద్దని ఆ పార్టీ నేతలు సూచించారు. టౌన్ లో కరపత్రాలతో ప్రచారం చేశారు.  వేములవాడ రాజన్న ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించకోలేకపోతున్నాయని విమర్శించారు.  వర్తక వ్యాపారులు బంద్​కు  మద్దతు ఇవ్వొద్దని సూచించారు.