
- మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్ మారుతుంది
- వసుధైక కుటుంబం మన విధానమని వెల్లడి
- ‘సెల్యూటింగ్ అవర్ హీరోస్’ కార్యక్రమానికి హాజరు
గచ్చిబౌలి, వెలుగు: దేశ సైనికులు, డిఫెన్స్శాస్త్రవేత్తల వల్లే ఆపరేషన్ సిందూర్ సాధ్యమైందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అతి త్వరలోనే భారత్ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) లో ఆదివారం ‘సెల్యూటింగ్ అవర్ హీరోస్ - ఆపరేషన్ సిందూర్’ పేరుతో కార్యక్రమం జరిగింది. ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికుల ధైర్యానికి, దేశభక్తికి గుర్తుగా అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి హాజరయ్యారు.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘‘ టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను భారత్ ఏకం చేసింది. మనమంతా మన దేశ డిఫెన్స్ సైంటిస్టులకు, ఆర్డ్మ్ ఫోర్సెస్‌కు సెల్యూట్ చేయాలి. ప్రపంచ దేశాల విద్యార్థులు మన దగ్గర చదువుకుంటున్నారు. కేర్.. షేర్ అనేది ఇండియా పద్ధతి. వసుధైక కుటుంబం మన విధానం. ఇండియా విశ్వగురు” అని తెలిపారు.
యుద్ధరంగంలో ఆపరేషన్ సిందూర్ కొత్త చరిత్రను లిఖించిందని.. మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిందని చెప్పారు. అమాయక టూరిస్టుల ప్రాణాలను తీసిన వాళ్లను మన సైన్యం తుదిముట్టించిందని పేర్కొన్నారు. వాటర్ అండ్ బ్లడ్ రెండు ఒకే దగ్గర పారవని మన ప్రధాని పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, వాటికి అర్థమే లేదని అన్నారు.
ఇంత గ్లోబలైజేషన్ జరుగుతున్న కూడా ఆ దేశాలు యుద్ధాలు ఎందుకు చేస్తామంటున్నాయో ఆర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఏ దేశంలో అయినా శాంతి ఉండాలని, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలన్నారు. కొందరూ ఇండియా ఎకానమీ పడిపోతున్నదని అంటున్నారని, కానీ తర్వలోనే భారత్ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య తెలిపారు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఉపయోగించి లబ్ది పొందాలని కొందరు చూస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు.
అద్భుతంగా పనిచేసిన డ్రోన్లు: డాక్టర్ సతీశ్‌రెడ్డి
ఆపరేషన్ సింధూర్ తో భారత సాంకేతిక నైపుణ్యం ప్రపంచానికి తెలిసిందని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి అన్నారు. భారతదేశంలో అభివృద్ధి చేసిన డ్రోన్లు, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలు ఆపరేషన్ సిందూర్ లో అద్భుతంగా పనిచేశాయని తెలిపారు. భారత సైన్యంలోని మూడు విభాగాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లు సమన్వయంతో ముందుకు సాగాయని పేర్కొన్నారు. అగరం వసంత్, రమణ వనమాల రచించిన ‘సైనికుడే దేశ ప్రేమికుడు’ పాట కార్యక్రమంలో ప్లే చేశారు. కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ సంయుక్త నిర్వాహక కార్యదర్శి గుంట లక్ష్మణ్, పలువురు సైనిక అధికారులు పాల్గొన్నారు.