
శివ్వంపేట, వెలుగు: మండలంలోని దొంతి గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్సుహాసిని రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం ప్రారంభించారు. ఆలయం నుంచి స్వామివారి రథం ఊరేగింపు ప్రారంభం కాగా మహిళల మంగళహారతులతో స్వాగతం పలికారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గ్రామస్తులు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు, కోలాటలు అలరించాయి. భక్తులకు మాజీ జడ్పీటీసీ మహేశ్ గుప్తా ఉచితంగా వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూజారి గోపాలకృష్ణ, మాజీ ఎంపీపీ హరికృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణా గౌడ్, సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ్ ఫణి శశాంక్, కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నవీన్ గుప్తా, శ్రీనివాస్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.