చంద్రమోహన్ కన్నుమూత

చంద్రమోహన్ కన్నుమూత
  •     గుండె, కిడ్నీ సమస్యలతో తుదిశ్వాస  
  •     932 చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు  
  •     నిర్మాత యక్కలి రవీంద్ర బాబు కూడా మృతి 

హైదరాబాద్, వెలుగు : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్(80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో హస్పిటల్​లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత నాలుగేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కిడ్నీలపై కూడా ఆ ప్రభావం పడడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారని తెలిపారు. ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న చంద్రమోహన్ జన్మించారు.

1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 932 చిత్రాల్లో నటించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అమెరికాలో ఉన్న పెద్ద కూతురు మధుర మీనాక్షి వచ్చాక సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చంద్రమోహన్ మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.   

చిత్రసీమలో మరో విషాదం 

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. అవార్డు విన్నింగ్ చిత్రాలను అందించిన నిర్మాత యక్కలి రవీంద్రబాబు(55) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిర్మించిన సొంతూరు, గంగపుత్రులు చిత్రాలకు అవార్డులు అందుకున్నారు. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్ లాంటి విభిన్నమైన చిత్రాలను ఆయన నిర్మించారు. రవీంద్రబాబుకు భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.