అట్టహాసంగా ప్రారంభమైన ‘ఖేలో ఇండియా’ గేమ్స్

అట్టహాసంగా ప్రారంభమైన ‘ఖేలో ఇండియా’ గేమ్స్

బెంగళూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం స్థానిక కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, అక్కడి సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట క్రీడా మంత్రి నిసిత్ ప్రతీక్, మాజీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... క్రీడలు దేహ దారుఢ్యానికి దోహదపడటమే కాకుండా జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు అత్యున్నత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ... 10 రోజులపాటు జరిగే ఈ గేమ్స్ లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి ప్లేయర్లు రానున్నారని తెలిపారు. మొత్తం 20 క్రీడా విభాగాల్లో 257 బంగారు పతకాల కోసం ఆటగాళ్లు పోటీ పడనున్నట్లు పేర్కొన్న ఆయన... మల్లంఖాంబ్, యోగాసన్ వంటి ప్రాచీన భారతీయ క్రీడలను ఈ గేమ్స్ లో చేర్చినట్లు తెలిపారు. ‘జీరో వేస్ట్, జీరో ప్లాస్టిక్’ నినాదంతో ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పీఎం మోడీ డ్రీమ్ అయిన ఈ క్రీడలు... మోడ్రన్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయని చెప్పారు. 

చివరిసారి 2020 లో ఈ క్రీడలను నిర్వహించగా... కరోనా కారణంగా గతేడాది నిర్వహించలేదు. కాగా కరోనా అదుపులోకి రావడంతో ఈ సారి భారీ ఎత్తున ఖేలో ఇండియా గేమ్స్ ను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 158 విశ్వ విద్యాలయాల నుంచి 3 వేలకు పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ వంటి క్రీడలతో పాటు మల్లఖాంబ్, యోగాసన్ వంటి వాటిని కూడా ఈ సారి ఈ క్రీడల్లో ప్రవేశపెట్టనున్నారు. 
 

మరిన్ని వార్తల కోసం...

నవనీత్ రాణా దంపతులకు బెయిల్ క్యాన్సిల్

వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలం