రాజ్యాంగమే నా ఎజెండా..చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు: సుదర్శన్ రెడ్డి

రాజ్యాంగమే నా ఎజెండా..చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు: సుదర్శన్ రెడ్డి
  •  అవకాశమిస్తే కేసీఆర్​ను కలిసి మద్దతు కోరుతా
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వూలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్​ సుదర్శన్ రెడ్డి
  • నాకు దేశవ్యాప్తంగామద్దతు పెరిగింది
  • తెలుగు రాష్ట్రాల ఎంపీలు నాకే సపోర్టు చేస్తరు

హైదరాబాద్, వెలుగు:  రాజ్యాంగమే తన భావజాలమని, తనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరిగిందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘‘ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిరాకిల్ ​జరగబోతున్నది. ఏ పార్టీతో సంబంధం లేని నాకు దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఎక్కువ మంది ఎంపీలు నాకు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం ఉంది. తెలుగు రాష్ట్రాల ఎంపీల మద్దతు నాకే ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు. అవకాశమిస్తే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కలిసి మద్దతు కోరుతాను”అని చెప్పారు. మంగళవారం ‘వీ6 వెలుగు’కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ప్రశ్న: మీ ఎంపిక ఎలా జరిగింది?

సుదర్శన్ రెడ్డి: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడాలని కాంగ్రెస్ జాతీయ ముఖ్య నాయకుడు ఒకరు నాకు ఫోన్ చేశారు. ‘కాంగ్రెస్ ​తరఫున అయితే నిలబడను.. ప్రతిపక్ష పార్టీల తరఫున అయితే నిలబడతాను’అని చెప్పాను. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మేం కూడా అదే భావిస్తున్నాం. ముందుగా మీ అభిప్రాయం తెలుసుకొని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపాలని అనుకుంటున్నాం”అని చెప్పారు. ఆ తర్వాత సీఎం రేవంత్ ​రెడ్డి నన్ను కలిసి.. ‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మీరు పోటీలో నిలబడితే తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు గర్వకారణం అవుతుంది’అని అన్నారు. ఖర్గే కూడా నాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థినైతే నాకు అభ్యంతరం లేదని చెప్పాను. దీంతో వారంతా ముందడుగు వేసి నన్ను ఎంపిక చేశారు. 

ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎట్ల అనిపిస్తున్నది? 

చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా 64 శాతం మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్దతు నాకు లభిస్తున్నది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలో పర్యటించినప్పుడు సంపూర్ణమైన మద్దతు లభించింది. కేజ్రీవాల్​నాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి కాకపోయినా మీరు ఉప రాష్ట్రపతి అభ్యర్థి అని ప్రకటించిన వెంటనే మేం మద్దతిస్తున్నాం’అని అన్నారు. ఇలా ఇంకా ఎన్నో పార్టీలు నాకు మద్దతిస్తున్నాయి. ఎన్డీయేలోని పార్టీల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తున్నది. 

మీరు గెలుపుపై ఎలా ధీమాగా ఉన్నారు? 

నా గెలుపుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ రాజకీయ పార్టీలోనూ నాకు సభ్యత్వం లేదు. రాజకీయేతర రంగాల నుంచి వచ్చిన వాళ్లు చాలామంది ఉప రాష్ట్రపతి అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్​, కేఆర్​నారాయణన్​, హమీద్​అన్సారీ, హిదయతుల్లా వంటి వాళ్లు నాకు రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోడల్. రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవాళ్లు నన్ను గెలిపిస్తారనే నమ్మకం ఉంది. 

ఎన్డీయే కూటమి పార్టీలు మీకు మద్దతిస్తాయా? 

అవును.. నమ్ముతున్నాను. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఆర్ఎస్ఎస్​ భావజాలం కలిగిన వ్యక్తి. నేను రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తిని.. నా భావజాలం రాజ్యాంగం. ఈ ఎన్నిక ఆర్ఎస్ఎస్​భావజాలం, రాజ్యాంగ భావజాలం మధ్య జరుగుతున్న పోటీ. మీకు ఓటెయ్యమని బీజేపీ వాళ్లను అడుగుతారా? అని కొందరు ప్రశ్నిస్తున్నరు. ఈ ఎన్నికలో ఓటేసేది పార్టీలు కావు.. ఎంపీలు. కాబట్టి అవకాశం ఉంటే బీజేపీ ఎంపీలను కూడా అడుగుతాను. 

బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారా? 

నేను 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పని చేశాను. కేసీఆర్ అవకాశం ఇస్తే వ్యక్తిగతంగా వెళ్లి కలుస్తాను. ‘నేను తెలంగాణ బిడ్డను, ఉద్యమకారుణ్ని. మీతో కలిసి నాలుగు అడుగులు వేసిన నాకు అవకాశం ఇవ్వండి. నన్ను బలపరచండి’అని ఆయనను కోరుతాను. 

రాష్ట్ర ఎంపీలందరూ సపోర్ట్​ చేస్తరని భావిస్తున్నారా? 

తెలంగాణ ఎంపీలందరికీ ఓట్లేసి గెలిపించిన ప్రజలున్నారు కదా.. అందుకే వాళ్లకే విన్నపం చేస్తున్నాను. ‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మీ ఎంపీలు ఏం నిర్ణయం తీసుకున్నారో మీరే తెలుసుకోండి. తెలంగాణ బిడ్డకు ఓటేసి గెలిపించాలని మీ ఎంపీలకు సూచించండి’అని ప్రజలను అభ్యర్థిస్తున్నాను. యూరియా ఇచ్చినోళ్లకే మద్దతిస్తామని కేటీఆర్ అన్నారే గానీ కేసీఆర్​ చెప్పలేదు. రాజకీయ పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాకు నమ్మకం ఉంది. సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను.

 

ఏపీలో మీకు మద్దతు లభిస్తుందా? 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నేత. కేంద్రంలో కీలకంగా పని చేశారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. అబ్దుల్​కలామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రపతి చేశారు. తెలుగు జాతి కోసం టీడీపీ పోరాడుతున్నది. ఎన్టీఆర్​హయాంలో ప్రభుత్వ ప్లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశాను. తెలుగు జాతి కీర్తి, ప్రతిష్ట కోసం పుట్టిన పార్టీ కాబట్టి.. ఆ పార్టీ వాళ్లంతా నాకు ఓటేస్తారని నమ్ముతున్నాను. చంద్రబాబు, జగన్​ ప్రత్యర్థులైనా.. ఇద్దరూ కలిసి నాకు మద్దతిస్తారని భావిస్తున్నాను. 

సల్వాజుడుం తీర్పుపై అమిత్ షా వ్యాఖ్యలు మీకు వ్యతిరేకం కాదా?

దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయన ఆ తీర్పు చదివి ఉంటే.. ఆ మాట అనేవారు కాదేమో. నాపై తప్పుడు కథనం సృష్టించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అది నేను ఇచ్చిన తీర్పు కాదు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. నా కంటే ముందు ఐదారుగురు, నా తర్వాత నలుగురైదుగురు జడ్జీలు ఆ తీర్పులో భాగస్వాములయ్యారు. సల్వాజుడుం తీర్పు రాసినందుకు, ఆ అవకాశం వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన విచక్షణకు వదిలేస్తున్నాను. 

సల్వాజుడుం తీర్పు రాజ్యాంగ సూత్రాలను ఎలా పరిరక్షించింది?

నక్సలైట్లను చంపాలనే ఉద్దేశంతో ఐదో తరగతి చదివిన పిల్లలకు తుపాకులు ఇచ్చి యుద్ధం చేయమంటే పిట్టల్లా చనిపోయారు. ఆ ఆధారాలన్నీ నా దగ్గరికి వచ్చినయ్​. ‘రైట్ టు లైఫ్ గ్యారంటీడ్​బై ది కానిస్టిట్యూషన్ అండ్​ఆర్టికల్​21 ఈజ్​బీయింగ్​వాయిలెటెడ్’అని తీర్పులో పేర్కొన్నాను. ‘టాక్స్​బ్రేక్స్​ఫర్​ది రిచ్​అండ్​గన్స్​ఫర్​ది పూర్’అని అందులో ఒక పదప్రయోగం చేశాను. ఇదే ప్రభుత్వంలో ఉన్నోళ్లను బాధించి ఉంటుంది. 

మీపై అర్బన్​ నక్సలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముద్ర బాధ అనిపించలేదా? 

అస్సలు బాధ పడలేదు. సల్వాజుడుం తీర్పు నక్సల్​సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇచ్చింది కాదు. నేను నక్సల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమర్థించినట్లు తీర్పు ఇస్తే బాధపడాలి. కానీ నేను అలా చేయలేదు. నల్లధనానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది నేనే. ఆ తీర్పును చేతిలో పట్టుకొని ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అద్వానీ దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. వాళ్లకు అవసరం ఉంటే అట్ల.. ఏదైనా అనదల్చుకుంటే ఇట్ల. నాకు అమిత్​షాపై వ్యక్తిగతంగా కోపం లేదు. నేను ఆయనను కలవనే లేదు. 

ఆపరేషన్ గ్రీన్​హంట్​పేరుతో నక్సల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చంపుతున్నారు? దీనిపై మీ అభిప్రాయం? 

నరమేధం ఆగాలి. మనిషిని కాల్చి చంపడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. మూడు రోజుల కిందటి వరకు చైనాకు, మనకు ఉన్న సంబంధం ఏంటి? అమెరికాకు, మనకు ఉన్న సంబంధం ఏంటి? ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు అత్యంత ముఖ్యమైనవి. అందరితో చర్చిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతది. 

ఉప రాష్ట్రపతిగా గెలిస్తే రాజ్యాంగ విలువలను రక్షించడంలో మీ పాత్ర ఎట్లుంటది? ఓడిపోతే యాక్టివ్​పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటారా? 

నా ప్రయాణం రాజ్యాంగంతో 1971లో మొదలైంది. ఉప రాష్ట్రపతిగా గెలిస్తే నాలో ఏ మార్పు ఉండదు. వైస్​ ప్రెసిడెంట్​ఆఫీస్​పొలిటికల్​పార్టీ ఆఫీస్​ కాదు. ముఖ్యమైన బాధ్యత రాజ్యసభను నడిపించడం. చర్చ జరిపే సందర్భంలో ప్రతిపక్షాలది ప్రధాన పాత్ర. అర్థవంతమైన చర్చ జరపాలి. ఒకవేళ నేను ఓడిపోతే యాక్టివ్​పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండను. పౌరసమాజంలో భాగస్వామిని గనుక దేశ, రాష్ట్ర సమస్యలపై తప్పకుండా ఒక అవగాహనతో ముందుకుపోతాను. ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖడ్​రాజీనామా గురించి 10వ తారీఖు దాకా ఏమీ మాట్లాడను. 

తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనపై మీ అభిప్రాయం ఏంటి?

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. సామాజిక విప్లవం మొదలైంది. యూపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు పోతే ఇవే ప్రశ్నలు వేశారు. కులగణన సర్వే నివేదికపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి నేనే చైర్మన్. జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించింది. సర్వే చేసి ఆ డేటాను రిలీజ్ చేస్తే చాలా మార్పులకు నాంది పలుకుతుంది. అందరికీ సమాన అవకాశాలు దక్కాలి.

ఓట్​చోర్​ నిజంగా జరిగిందా? 

నేను అలాంటి పదజాలం వాడను. రాజ్యాంగం ప్రకారం ఈసీ అత్యంత ప్రాధాన్యం ఉన్న సంస్థ. తప్పులను సరిదిద్దుకోవాలి. సర్ అనే కొత్త పదం ఇప్పుడు బాగా వినిపిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. చనిపోయినోళ్ల పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించాల్సిందే. కానీ బతికున్నోళ్ల పేర్లను కూడా తొలగిస్తే ఎట్ల? సీబీఐ, ఈడీ పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని భావిస్తున్నాను.