పేర్లు మార్చి పేదల భూములు .. పట్టా చేసుకున్నడు

పేర్లు మార్చి పేదల భూములు ..  పట్టా చేసుకున్నడు
  • మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో ఓ బీఆర్ఎస్​ లీడర్​ నిర్వాకం
  • తహసీల్దార్​ ఆఫీసు  ముట్టడించినా నో రెస్పాన్స్​ 
  • న్యాయం చేయకపోతే చావే దిక్కంటున్న బాధితులు 

చెన్నూర్​, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో ఓ బీఆర్ఎస్​ లీడర్​ రికార్డుల్లో పేర్లు మార్చి భూముల పట్టా చేసుకున్నాడని, అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తహసీల్దార్​ఆఫీసును ముట్టడించినా అధికారులు స్పందించలేదని, ఈ పరిస్థితుల్లో న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం..చెన్నూర్​ మండలం కన్నెపల్లి శివారులోని సర్వేనంబర్లు 1359లో 1.02 ఎకరాలు, 1319/1లో 1.11 ఎకరాలు, 1316/2లో 24 గుంటల భూమి నెన్నెల రాజం పేరిట ఉంది. 

ఈ భూమిని పాలివారైన బీఆర్ఎస్​లీడర్​ నెన్నెల భీమయ్య అధికారులతో కుమ్మక్కై తన కుటుంబసభ్యుల పేరిట మూడేండ్ల కింద దొంగ పట్టా చేసుకున్నాడని రాజం వారసుడు నెన్నెల పోచం, దెబ్బెల లక్ష్మి ఆరోపించారు. మరికొన్ని సర్వేనంబర్లలోని భూమి పట్టా కూడా మార్చుకున్నాడన్నారు. తొమ్మిది మంది పేరిట ఉన్న దాదాపు పదెకరాలను తన కుటుంబీకుల పేరిట పట్టా చేసుకున్నాడని చెప్పారు. 

పక్కనున్న మరో 20 ఎకరాల అసైన్డ్​ భూమిని కూడా కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం 50 ఏండ్ల కింద తమకు పట్టాలిచ్చిన భూములను బీఆర్ఎస్​లీడర్​ భీమయ్య అక్రమంగా పట్టా చేసుకున్నాడని, తహసీల్దార్​కు, పోలీసులకు కంప్లయింట్​ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఈ నెల 9న తహసీల్దార్​ఆఫీసును ముట్టడించి డిప్యూటీ తహసీల్దార్​ గోవింద్​కు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. సదరు భూమిని తాము సాగు చేసుకోకుండా భీమయ్య అడ్డుపడుతున్నాడన్నారు. అక్రమ పట్టాలు రద్దు చేసి తమకు కొత్త పట్టాపాస్​బుక్​లు ఇవ్వాలని, ధరణిలో తమ పేర్లు నమోదు చేయాలని కోరుతున్నారు.