బావిలో నీళ్లు తాగారని..దళిత పిల్లలను కట్టేసి కొట్టిండు

బావిలో నీళ్లు తాగారని..దళిత పిల్లలను కట్టేసి కొట్టిండు
  • ఐదుగురు చిన్నారులపై యువకుడి అమానుష దాడి?  
  • వీడియో వైరల్.. జబల్పూర్ లో జరిగిందంటూ వార్తలు 
  • ఇది జబల్పూర్ లో కాదన్న స్థానిక పోలీసులు 

న్యూఢిల్లీ: అభం శుభం తెలువని ఐదుగురు దళిత పిల్లలు. బాగా దూప కావడంతో అగ్ర కులానికి చెందిన ఓ వ్యక్తి బావిలో నీళ్లు తాగారు. అంతే.. వారిపై కోపంతో ఊగిపోయిన బావి ఓనర్ అయిన ఓ యువకుడు.. పిల్లలని కూడా కనికరం చూపకుండా అమానుషంగా దాడి చేశాడు. వారి చేతులను వెనక్కి విరిచి తాడుతో కట్టేసి.. కర్రలతో కాళ్లపై కొట్టాడు. నొప్పి తాళలేక పిల్లలు అరుస్తున్నా.. చుట్టూ జనం పోగయి వేడుక చూశారు తప్ప ఒక్కరూ అడ్డుకోలేదు. ఓ పిల్లాడు జనంవైపు పారిపోతుంటే.. జనం ఆ పిల్లాడిని కొడుతున్న యువకుడివైపే తోసేసి రాక్షసానందం పొందడం వీడియోలో కనిపించింది. 

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో శనివారం ‘ఎక్స్(ట్విట్టర్)’లో వైరల్ అయింది. ఎక్స్ లో హేట్ డిటెక్టర్స్ అనే అకౌంట్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియోకు కొన్ని గంటల్లోనే విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, ఇది జబల్పూర్ లో జరిగిన ఘటన కాదని స్థానిక ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. వీడియోలో వినిపించిన మాటలు యూపీలోని అవధి మాండలికం తరహాలో ఉన్నాయని.. ఆ ఘటన యూపీలో జరిగి ఉండొచ్చని ఆయన తెలిపారు. కాగా, హేట్ డిటెక్టర్స్ అకౌంట్ లో ఆదివారం ఈ వీడియోతో కూడిన పోస్ట్ డిలీట్ అయింది. ఇతర పలు అకౌంట్లలో మాత్రం వీడియో కనిపించింది.