- దాని వెనుక ఎవరున్నారోతేల్చే పనిలో అధికారులు
- బ్యారేజీ కట్టినంక అంచనాలు పెంచడంపై అనుమానాలు
- లోన్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనా కాళేశ్వరం అధికారులను విచారించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై విజిలెన్స్ విచారణ కీలక దశకు చేరుకున్నది. ఇకపై బ్యారేజీకి సంబంధించిన ఆర్థిక అంశాలపై లోతుగా విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది జనవరిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన అధికారుల బృందం.. ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది. అనంతరం ఇరిగేషన్ హెడ్‌క్వార్టర్స్ జలసౌధతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్ల ఆఫీసుల్లోనూ సోదాలు జరిపి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. ఇటీవల జ్యుడీషియల్ కమిషన్‌కు మధ్యంతర నివేదిక అందజేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యారేజీ అంచనాల పెంపుపై దృష్టి సారించింది. ఎందుకు పెంచారు? ఎవరు పెంచారు? అనే వివరాలు అధికారుల నుంచి రాబట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు పెంపు..
నిజానికి తొలుత మేడిగడ్డ బ్యారేజీ అంచనా వ్యయాన్ని 2016 మార్చిలో రూ.2,590 కోట్లుగా లెక్కగట్టిన గత ప్రభుత్వం.. ఆ తర్వాత రెండు నెలలకే అంటే 2016 మేలో ఆ అంచనాలను రూ.3,260 కోట్లకు పెంచింది. 2021 సెప్టెంబర్‌లో మరోసారి ఆ అంచనాలను పెంచి రూ.4,613 కోట్లు చేసింది. అయితే బ్యారేజీ వినియోగంలోకి వచ్చే నాటికి మొత్తం ఖర్చు రూ.5 వేల కోట్లు దాటిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అంచనా వ్యయాన్ని ఒకటిన్నర రెట్లకు పైగా పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.2 వేల కోట్ల మేర అంచనాలను పెంచడం వెనుక ఎవరున్నారనే విషయాన్ని అధికారుల ద్వారా రాబట్టేందుకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. రానున్న రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు సమాచారం.
బ్యారేజీ పూర్తయినంక అంచనాలు పెంపు..
మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్‌లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కానీ, అప్పటికి బ్యారేజీకి సంబంధించి వివిధ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అప్రోచ్ రోడ్లు, గైడ్‌బండ్స్ నిర్మాణం వంటి పనులు పూర్తి కాలేదు. అయినప్పటికీ ఆ తర్వాత మూడు నెలలకే కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం నిర్మాణ సంస్థ ఎల్ అండ్‌టీ లేఖ రాసింది. మూడు సార్లు లేఖలు రాసిన అనంతరం 2021 మార్చిలో బ్యారేజీ అధికారులు నిర్మాణ సంస్థకు కంప్లీషన్సర్టిఫికెట్ఇచ్చారు. అంతకుముందు 2020 ఫిబ్రవరి నాటికే బ్యారేజీ పూర్తయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ మొదలైందని, అందుకు నిర్మాణ సంస్థ అండర్ టేకింగ్ కూడా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే అధికారుల లెక్క ప్రకారం 2020లోనే పూర్తయిన బ్యారేజీకి కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆరు నెలలకు అంచనాలను మరో దఫా దాదాపు రూ.1,350 కోట్లకు పైగా పెంచారు. ఈ నేపథ్యంలోనే 2019లోనే బ్యారేజీని ప్రారంభించి, 2020లో పూర్తయిందని, 2021లో కంప్లీషన్ సర్టిఫికెట్జారీ చేసి.. ఆ తర్వాత కూడా అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న అంశంపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. ఈ విషయాలపై అధికారులను ఆరా తీయనున్నట్టు తెలుస్తున్నది. కరోనా సాకు చూపి కాంట్రాక్ట్ సంస్థకు బ్యాంక్ గ్యారంటీలను వెనక్కి ఇవ్వడంపైనా ప్రశ్నించనున్నట్టు సమాచారం.
రికార్డులెక్కడ?
బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు లాగ్‌బుక్‌లు, రిజిస్టర్లు, క్వాలిటీ, నిర్వహణకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తెప్పించుకున్నారు. పలు రికార్డులు మాత్రం తమకు అందలేదని చెబుతున్నారు. ఆ రికార్డులు ఏమయ్యాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా రికార్డుల్లోని అంశాల ఆధారంగా ఇంజనీర్లను విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్రశ్నించనున్నట్టు తెలిసింది. కార్పొరేషన్ ద్వారా సేకరించిన రుణాలకు సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించనున్నట్టు సమాచారం. ఎప్పుడెప్పుడు ఎంత లోన్ తీసుకున్నారు? ఎవరి ఆమోదంతో రుణాలు తీసుకున్నారు? తీసుకున్న రుణాల నుంచి కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? అన్న వివరాలను విజిలెన్స్ అధికారులు రాబట్టనున్నారు. ఇందుకోసం వర్క్స్ అండ్ అకౌంట్స్డిపార్ట్మెంట్అధికారులనూ విచారణలో భాగం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని విచారించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్.. ఈ రెండు రోజుల్లో మరో ముగ్గురిని విచారించనుంది. అవసరమైతే మరికొందరు అధికారులనూ విచారణకు పిలిచే అవకాశముందని తెలిసింది.