డిజైన్, నిర్మాణం, నిర్వహణనే ముంచింది.. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్ట్​

డిజైన్, నిర్మాణం, నిర్వహణనే ముంచింది.. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్ట్​
  • డీటైల్డ్ ​స్టడీకి ఎక్స్​పర్ట్​ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు
  • బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​ గాలికి
  • ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ గానీ, నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ గానీ పట్టించుకోలే
  • కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత తనిఖీలు కూడా చేయలే
  • నిర్మాణ ఖర్చును ఏకంగా  133.67%  పెంచేశారు
  • వందేండ్ల కింద కట్టిన డ్యాములూ గట్టిగున్నా మేడిగడ్డ నాలుగేండ్లకే ఆగం

హైదరాబాద్, వెలుగు: డిజైన్, నిర్మాణం, నిర్వహణ తీరే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమని విజిలెన్స్​అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ తేల్చిచెప్పింది. బ్యారేజీ  7వ బ్లాక్​లోని 16 నుంచి 21వ పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, 20వ పిల్లర్​లో​ పునాదుల నుంచే పగుళ్లు ఉన్నాయని వెల్లడించింది. 6, 7, 8 బ్లాకులను నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ కాకుండా సబ్ ​కాంట్రాక్టర్​ నిర్మించారని తెలిపింది. ఆ బ్లాకుల్లోనే ఎక్కువగా లోపాలున్నాయని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై 14 పేజీలతో కూడిన ప్రిలిమినరీ రిపోర్టును విజిలెన్స్​ అండ్​ ఎన్​ ఫోర్స్​మెంట్​అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ వైఫల్యానికి గల పూర్తి కారణాలు అన్వేషించడానికి ఎక్స్​పర్ట్​ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్​19న అప్పటి సీఎం ప్రారంభించిన తర్వాత ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​పనులను ఇటు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ గానీ, అటు నిర్మాణ సంస్థ ఎల్ ​అండ్​ టీ గానీ చేపట్టలేదని విజిలెన్స్​ తన రిపోర్టులో పేర్కొంది. 2019 –-20లోనే బ్యారేజీకి దిగువన కాంక్రీట్​ బ్లాకులు కొట్టుకుపోయి ఆప్రాన్​దెబ్బతిందని, దీంతో బ్యారేజీ దిగువన ఇసుక జారిపోయిందని, కొట్టుకుపోయిన బ్లాకులను యథాస్థానంలో ఏర్పాటు చేయలేదని గుర్తించింది.  

ఇండియన్ ​స్టాండర్డ్స్​ ప్రమాణాల ప్రకారం.. ప్రాజెక్టు ఓనర్​గా ఉన్న ఇరిగేషన్ ​ఇంజనీర్లు వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత బ్యారేజీ వద్ద తనిఖీలు నిర్వహించి ఏవైనా లోపాలు ఉంటే సరి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి తనిఖీలేవి చేయలేదని పేర్కొంది. 

బ్యారేజీ వ్యయాన్ని 133.67% పెంచారు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2016లో రూ.1,853.31 కోట్లతో టెండర్లు పిలువగా.. ఎల్​అండ్​టీ – పీఎఈఎస్ ​జాయింట్​ వెంచర్​ 2.7 శాతం ఎక్సెక్స్​కు కోట్​చేసి పనులు దక్కించుకున్నాయని, బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని 2018లో రూ.3,065.4 కోట్లకు పెంచారని, 2021లో రూ.4,321.44 కోట్లకు పెంచారని నివేదికలో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ తెలిపింది. మొత్తంగా 133.67 శాతం బ్యారేజీ నిర్మాణ వ్యయం పెంచేశారని పేర్కొంది. 

నాలుగేండ్లకే ఫెయిల్​

స్టేట్​ డ్యామ్​ స్టేఫీ ఆర్గనైజేషన్​(ఎస్ డీఎస్​వో) యాన్యువల్ రిపోర్టు 2022 –23 లోని అనెగ్జర్​–7 ప్రకారం.. రాష్ట్రంలోని 65 డ్యాములను నిర్మించి 50 ఏండ్ల నుంచి వందేండ్లు అవుతున్నదని, అవన్నీ పటిష్టంగా ఉన్నాయని, మేడిగడ్డ మాత్రం నాలుగేండ్లకే ఫెయిలైందని పేర్కొంది. మేడిగడ్డ కుంగిన తర్వాత దాన్ని ఎన్​డీఎస్​ఏలోని ఆరుగురు నిపుణుల కమిటీ పరిశీలించిందని, బ్యారేజీ వైఫల్యానికి కారణాలు అన్వేషించడానికి వాళ్లు 20 రకాల రిపోర్టులు అడిగితే రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు 11 మాత్రమే సమర్పించారని వెల్లడించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత చేసిన ఇన్​స్పెక్షన్​ రిపోర్టులు, వర్క్​కంప్లీషన్, క్వాలిటీ కంట్రోల్​ లాంటి రిపోర్టులు కూడా అందజేయలేదని తప్పుబట్టింది. కాంట్రాక్టర్​తో చేసుకున్న అగ్రిమెంట్​కండీషన్లను ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ కూడా అతిక్రమించిందని పేర్కొంది.  

టార్గెట్​లో 18.04 శాతమే లిఫ్ట్​

మేడిగడ్డ నుంచి ఒక్కో వాటర్​ ఇయర్​లో 180 టీఎంసీలను లిఫ్ట్​ చేయాల్సి ఉండగా 2019 –20 నుంచి 2023 –24 వరకు 162.36 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్​ చేశారని, ఇది మొత్తం టార్గెట్​లో 18.04 శాతమేనని రిపోర్టులో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ తెలిపింది. 

రిపోర్టులో ఇంకా ఏముందంటే..!

  • బ్యారేజీ నిర్మాణ సమయంలో నిర్మించిన కాఫర్​డ్యాం (మట్టికట్ట), దానికి రక్షణగా నిర్మించిన షీట్​ఫైల్స్​ఐదేండ్ల వరకు తొలగించలేదు. దీంతో గోదావరి ప్రవాహానికి అది అడ్డుగా నిలిచి బ్యారేజీపై వరద ఒత్తిడి అధికంగా పడింది. దీంతో బ్యారేజీ ఆపరేషన్​లోనూ సమస్యలు తలెత్తాయి. 
  •  బ్యారేజీ రాఫ్ట్​ ఫౌండేషన్, దానికి దిగునవ కటాఫ్​వాల్స్​ నిర్మాణం డ్రాయింగ్స్ ​ప్రకారం కనెక్ట్​చేయాల్సి ఉన్నా.. ఆ పనులు సరిగా చేయలేదు. రాఫ్ట్​ ఫౌండేషన్​కు ఎగువ, దిగువన సికంట్​ఫైల్స్​ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైపరీ ఫైల్స్​ దెబ్బతిని ఫౌండేషన్ ​కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండొచ్చు. ఏడో బ్లాక్​లోని 16 నుంచి 21 వరకు పిల్లర్లను పరిశీలిస్తే రాఫ్ట్​ ఫౌండేషన్ విఫమైనట్టు తెలుస్తున్నది. 
  • కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్స్​సహా ఇతర దెబ్బతిన్న వాటిని రిపేర్​ చేయాలని వర్క్​ ఏజెన్సీకి 2020 మే 18న ప్రాజెక్టు ఇంజనీర్లు లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 2న, 2022 ఏప్రిల్​6న రిపేర్లు చేపట్టాలని మళ్లీ కోరారు. 2023 ఏప్రిల్​28న ఏడో బ్లాక్​లోని 17, 18, 19, 20 వెంట్స్​వద్ద ఏర్పడ్డ బుంగలను గ్రౌంటింగ్​ చేయాలని సంస్థకు సూచించినా ఎల్​అండ్​టీ రిపేర్లు చేయలేదు.
  • ఏడో బ్లాక్​ నిర్మాణం నిర్దేశిత పద్ధతుల ప్రకారం చేపట్టలేదు. రాఫ్ట్​ ఫౌండేషన్ ​దానికి ఎగువ, దిగువన ఏర్పాటు చేసిన సికెంట్​ఫైల్స్​ను క్రమబద్ధతిలో అమర్చలేదు. బ్యారేజీ ఎం బుక్​ల పరిశీలనలో ఈ విషయం స్పష్టంగా తేలింది. ఏడో బ్లాక్​ నిర్మాణానికి సంబంధించి అనుమతించిన డిజైన్లలో పనులు చేయకుండా ఎన్నో ఉల్లంఘనలు జరిగినా ​ఉన్నతాధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టలేదు.
  • బ్యారేజీ ఎగువన, దిగువన పేరుకుపోయిన మట్టి సహా ఇతర వ్యర్థాలను ఐదేండ్లుగా నిర్మూలించలేదు. బ్యారేజీపై ఎలాంటి ప్రభావం పడుతుందనే త్రీడీ మోడల్​ స్టడీస్​ కూడా చేపట్టలేదు.
  • బ్యారేజీ నిర్మాణ అగ్రిమెంట్ ​కండిషన్​ నం.50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. అయినా బ్యారేజీ పనులు పూర్తి చేసినట్టుగా ఇంజనీర్లు వర్క్ ​కంప్లీషన్స్​సర్టిఫికెట్లు జారీ చేశారు. 6, 7, 8 బ్లాకులను ఎల్​అండ్​టీ సబ్ ​కాంట్రాక్టర్​కు ఇచ్చారు. ఆ సంస్థకు ఎలా పేమెంట్​ చేశారనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. 
  • బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకున్న 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్​ లయబులిటీ పీరియడ్ ​ప్రారంభమైందని సర్టిఫికెట్ ఇచ్చారు.​కాంట్రాక్టర్​బ్యాంక్​ గ్యారంటీలను రిలీజ్​ చేయాలని ఆదేశిస్తూ రామగుండం ఈఎన్సీ అదే ఏడాది నవంబర్​11న లేఖ రాశారు.  ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి (విజిలెన్స్​ సిఫార్సు మేరకే.. ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం టెర్మినేషన్​ ఉత్తర్వులు జారీ చేసింది).
  • ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైనింగ్​ చేయడంతో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి మధ్య ఖర్చు చేసిన రూ.1,066.20 కోట్లు వృథా అయ్యాయి. అక్కడ పనులు చేపట్టేందుకు రూ.740.21 కోట్లతో కొనుగోలు చేసిన మెటీరియల్​ను కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించారు. 
  • మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి లోటు పాట్లను స్టడీ చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన బడ్జెట్​రిలీజ్ ​చేయాలి. ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు చార్టర్డ్​ అకౌంటెంట్లను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. 
  • బ్యారేజీకి సంబంధించిన డిజైన్స్, డ్రాయింగ్స్​, జియోలాజికల్​ఇన్వెస్టిగేషన్స్, కాంక్రీట్​ నిర్మాణాల పటిష్టతను అధ్యయనం చేయడానికి ఎక్స్​పర్ట్​కమిటీని నియమించి బ్యారేజీ ఫెయిల్యూర్స్​పై సమగ్ర విచారణ జరిపించాలి. 

కంప్లీట్​ అయినట్లు చెప్పి మళ్లీ ఎక్స్​టెన్షన్​ ఇచ్చారు

2019 సెప్టెంబర్​10న పనులు పూర్తయినట్టుగా సబ్​స్టాన్షియల్ ​కంప్లీషన్​ సర్టిఫికెట్​, 2021 మార్చి 3న వర్క్​ కంప్లీషన్ ​సర్టిఫికెట్లను కాంట్రాక్ట్​ కంపెనీ ఎల్​ అండ్​ టీకి ఇంజనీర్లు ఇచ్చారని తెలిపింది. కంపెనీకి రూ.159.72 కోట్ల బ్యాంక్​గ్యారంటీలను రిలీజ్​ చేయడానికి అనుమతి ఇచ్చారు. పనులు పూర్తయినట్టు సర్టిఫికెట్లు జారీ చేశాక కూడా ఈఎన్సీ 2022 మార్చి 31 వరకు ఎక్స్​టెన్షన్​ఆఫ్​అగ్రిమెంట్​టైమ్​(ఈవోఏటీ) జారీ చేశారని, మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్​రూ.280.61 కోట్ల రెండు బిల్లుల చెల్లింపునకు రికమండ్​చేశారని గుర్తించింది.