ఏడాదికి 12 పంటలు పండిస్తూ.. రైతులకు అవగాహన కల్పిస్తున్న60 ఏళ్ల విజయ్ జర్దారీ

ఏడాదికి 12 పంటలు పండిస్తూ.. రైతులకు అవగాహన కల్పిస్తున్న60 ఏళ్ల విజయ్ జర్దారీ

రైతులు మామూలుగా అయితే ఏడాదికి రెండు పంటలు పండిస్తరు. ఇంకొంతమందైతే వాళ్ల వీలును, పరిస్థితులను బట్టి మూడు పంటలు పండిస్తరు. కానీ ఏడాదికి 12 పంటలు పండించవచ్చని చెప్తున్నడు ఉత్తరాఖండ్‌‌‌‌కు చెందిన విజయో జర్దారీ. 60 ఏండ్ల వయసులో దేశంలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నడు. ‘బీజ్‌‌‌‌ బచావో ఆందోళన్‌‌‌‌’ పేరుతో రైతులకు దాని గురించి చెప్తున్నడు. తక్కువ ఖర్చుతో 12  పంటలు వేయొచ్చని, ఆ పంటలు వేయడం వల్ల కరువు, వరద పరిస్థితులను తట్టుకోవచ్చని అంటున్నడు. దాని కోసం ‘బారానాజ్‌‌‌‌’ (12 పంటలు పండించడం) పేరుతో పంటలను పండిస్తున్నారు. 

దేశంలో మిల్లెట్స్‌‌‌‌ లాంటి పోషక పంటల సాగును, క్యాష్‌‌‌‌ క్రాప్స్‌‌‌‌ భర్తీ చేశాయని, దాని వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు ‘బీజ్‌‌‌‌ బచావో ఆందోళన్‌‌‌‌ (సేవ్‌‌‌‌ సీడ్స్‌‌‌‌)’ క్యాంపైన్‌‌‌‌ నడిపించే విజయ్‌‌‌‌ జర్దారీ. రైతులు కేవలం ఒక్కటి లేదా రెండు పంటలు మాత్రమే వేసి నష్టాలు తెచ్చుకుంటున్నారని, దీన్ని మార్చేందుకు ఈ క్యాంపైన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశానని చెప్పారు. చాలా తక్కువ ఖర్చుతో ఏడాదికి 12 పంటలు పండించవచ్చని, దాని వల్ల రైతులకు నష్టం కలగదని అంటున్నారు. దాని కోసం రీసెర్చ్‌‌‌‌ చేసి దాదాపు 350 రకాల విత్తనాలను కలెక్ట్‌‌‌‌ చేశారు.

12 లేదా అంతకంటే ఎక్కువ పంటలు

‘‘బారనాజ్‌‌‌‌ (Baranaj)’ అంటే పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలు పండించే ఇంటర్నల్‌‌‌‌ క్రాపింగ్‌‌‌‌ మెథడ్‌‌‌‌. సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడే ఉత్తరాఖండ్‌‌‌‌లోని తెహ్రీ, గర్హ్వాల్‌‌‌‌ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది రైతులకు మంచి చేస్తుంది. ఒకే భూమిలో చాలా తక్కువ ఖర్చుతో కూరగాయలు, చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, క్రీపర్స్‌‌‌‌ను పెంచుకోవచ్చు. దీనివల్ల ఒక పంట మరో పంట సాగుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రైతులకు నష్టాలు కూడా రావు. వీటిలోని కొన్ని పంటలు కరువును, వరదలను తట్టుకుంటాయి. దీంతో రైతుకు పంట నష్టం ఉండదు. ఈ పంటలు సాగుచేసేందుకు బయో ఫెర్టిలైజర్స్‌‌‌‌ ఉంటే చాలు” అని విజయ్‌‌‌‌ అన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబానికి చెందిన విజయ్‌‌‌‌ రైతుల కష్టాలు చూసి దీన్ని స్టార్ట్‌‌‌‌ చేశారు. ‘‘నా చిన్నప్పుడు మిల్లెట్స్‌‌‌‌ లాంటివి పండించేవాళ్లు. ఒకేసారి ఎక్కువ పంటలు వేసేవాళ్లు. ఆ తర్వాత రైతులంతా క్యాష్  క్రాప్స్‌‌‌‌ వైపు వెళ్లడంతో కెమికల్‌‌‌‌ ఫర్టిలైజర్స్‌‌‌‌ వాడటం ఎక్కువైంది. దాని వల్ల పొల్యూషన్‌‌‌‌ పెరిగి భూమి సారాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితి చూసినప్పుడే ఈ ఆలోచన వచ్చింది.12 పంటలు పండించడం వల్ల భూమి సారవంతంగా తయారవుతుంది. సాధు జంతువులకు ఫుడ్‌‌‌‌ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు” అని అన్నారు విజయ్‌‌‌‌. ఉత్తరాఖండ్‌‌‌‌లోని దాదాపు 15 – 20 గ్రామాల్లో ఈ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు.

“మొదటిసారి సాగు చేస్తున్నప్పుడు విత్తనాల కోసం మార్కెట్‌‌‌‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర పండిన వాటిలోనే కొన్నింటిని ఉపయోగించవచ్చు. మేం ఇప్పటికీ బార్టర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఫాలో అవుతాం. ఎవరి పొలంలో మంచి పంట వస్తుందో దాన్ని మరొకరికి ఇస్తారు. అలా ఒకరికొకరం సాయం చేసుకుంటాం.ఇది చాలా ఉపయోగపడుతుంది” అని బారానాజ్‌‌‌‌ పద్ధతిలో పంటలు పండిస్తున్న ధమ్‌‌‌‌ సింగ్‌‌‌‌ అన్నారు.