- అధికారుల జవాబులకు మేయర్ తో పాటు సభ్యులు అసంతృప్తి
- బల్దియాకు ఆదాయం రావడం లేదన్న పలువురు కార్పొరేటర్లు
- పలు అంశాలపై హౌస్ కమిటీలు వేస్తామని మేయర్ హామీ
- నాలుగు ప్రశ్నలపై చర్చించాక నేటికి సమావేశం వాయిదా
హైదరాబాద్, వెలుగు: బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో గతంలో ఎన్నడూ లేనంతగా సిటీలోని ప్రజా సమస్యలు, ఆదాయంపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో వివిధ శాఖల అధికారుల తీరును తప్పుపట్టారు. ఆరోపణలు కూడా చేశారు. సోమవారం ఉదయం 10–15 గంటలకు హెడ్డాఫీసులో ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 3–40 గంటల వరకు కొనసాగింది. అనంతరం సీఎంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సమావేశం కావాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. మీటింగ్ లో వేసే ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోగా మేయర్ తో పాటు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివిధ అంశాలపై పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేయగా.. హౌస్ కమిటీ వేసి విచారణ చేయిస్తామని మేయ ర్ హామీ ఇచ్చారు. అధికారుల తీరుపైనా మేయర్ మండిపడ్డారు. జోనల్ మీటింగ్ లు పెడుతున్నారా..? లేదా.. అనేది తనకే తెలియడం లేదని అసహనం వ్యక్తంచేశారు. కార్పొరేటర్లు కాల్ చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె అధికారులను నిలదీశారు. వివిధ విభాగాల్లో జరిగిన పొరపాట్లపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
అన్ని పార్టీలతో కలిసి కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను మేయర్ ఆదేశించారు. మెట్రో పిల్లర్ల అంశంపై బీజేపీ సభ్యులు మాట్లాడుతుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్సభ్యుల మధ్య వాగ్వాదం మినహా మీటింగ్ సాఫీగా సాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బల్దియా మీటింగ్ రెండో రోజుకు వాయిదా పడడం కూడా ఇదే తొలిసారి.
ఏ సమాచారం అడిగినా ఇవ్వట్లేదు
ఏ సమాచారం అడిగినా అధికారులు ఇవ్వడం లేదని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రశ్నించారు. స్టాఫ్ లేరంటున్నారని, చివరకు ఆర్టీఐకి కూడా సమాధానం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ మమత, వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. గతంలోనూ వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ, మమత కౌన్సిల్ ను బైకాట్ చేసి వెళ్లారని, ఆరేండ్ల నుంచి ఒకేచోట మమత జోనల్ కమిషనర్ గా పని చేస్తున్నారని వీరిపై చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేయాలని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.
ఐఏఎస్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు హైదరాబాద్ లో ఉండటం కోసమే బల్దియా జాబ్ చేస్తున్నట్టుగా తయారైందని అసహనం వ్యక్తంచేశారు. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడంలేదని, అధికారులు ఆఫీసుల్లోనే ఉంటున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని పలువురు కార్పొరేటర్లు పేర్కొన్నారు.
ఆ అధికారి వందల కోట్లు సంపాదించిండు..
అడ్వటైజ్ మెంట్ల ద్వారా బల్దియాకు ఆదాయం రావ డం లేదని, ప్రమాదాల పేరుతో 2020లో జీవో 68 తీసుకొచ్చి, అప్పటి ఈవీడీఎంలోని ఓ ఉన్నతాధికారి రూ. 500 కోట్లు సంపాదించుకొనిపోయాడని, ప్రస్తుతం అందులోని సిబ్బంది కార్తీక్, అజయ్ అక్రమాలకు పాల్పడుతూ ఆదాయానికి గండి కొడుతున్నారని చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈవీడీఎం అధికారుల అక్రమాలతో బల్దియాకు నష్టం వాటిల్లుతుందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అడ్వటైజ్ మెంట్ కి సంబంధించి కొత్త పాలసీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, పర్మిషన్ వస్తే తిరిగి హోర్డింగ్స్ఏర్పాటు చేసుకోవచ్చని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. అడ్వటైజ్ మెంట్ల ద్వారా 2022–23 ఏడాదికి రూ.17.5 కోట్లు వచ్చాయని, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,856 కోట్లు వచ్చాయని వివరించారు. మెట్రోకు చెందిన ఎల్ అండ్ టీ రూ.45 కోట్ల బకాయిలు ఉందని పేర్కొన్నారు.
ఎక్కడ చూసినా లైట్లు వెలగట్లేదు..
సిటీలో స్ట్రీట్ లైట్లపై బల్దియా ఫెయిలైందని, ఏజెన్సీ సరిగా పని చేయడంలేదని, అధికారులు పట్టించుకోవడంలేదని రియాసత్ నగర్ కార్పొరేటర్ ముస్తఫబేగ్, వెంకటేశ్వరనగర్ కాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ప్రశ్నించారు. అధికారులు ఆఫీసులో కూర్చొని అబద్ధా లు చెప్పకూడదని ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఫీల్డ్ లోకి వచ్చి చూస్తే స్ట్రీట్ లైట్ల సమస్య తెలుస్తుందని నిలదీశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో బల్దియా ఉందని, వచ్చే ఆదాయం కూడా రాకుండా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్ఈ శ్రీనివాస్ ఇచ్చిన సమాధానానికి వారు సంతృప్తి చెందలేదు. చివరకు కమిషనర్ జవాబునిచ్చారు. స్ర్టీట్ లైట్లు పగలు వెలుగుతున్నాయని, రాత్రి పూట వెలగడంలేదనే కంప్లయింట్లు వస్తున్నాయని, టైమర్లు పని చేయడం లేదని వివరించారు. సిమ్ కార్డులు రీచార్జ్ చేయకపోగా 7 వేల బాక్స్ లు ఆటోమెటిక్ కాకుండా మ్యాన్ వల్ గా ఆన్ ఆఫ్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై గతంలో మాదిరిగా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తామని, సాయంత్రం డార్క్ ప్లేస్ ల్లో పర్యటించి సమస్య లేకుండా చూస్తామని కమిషనర్ వివరణ ఇచ్చారు.
ఉన్న ఉద్యోగులు ఇలా..
బల్దియా ఉద్యోగుల వివరాలను అడిషనల్ కమిషనర్ సరోజ వివరించారు. రెగ్యులర్ ఉద్యోగులు 9,038 మంది ఉండగా ఇందులో సంస్థకు చెందిన వారు 4,604 మంది ఉన్నారని తెలిపారు. వేరే డిపార్టుమెంట్లకు చెందిన ఉద్యోగులు778 మంది ఉన్నారని, ఔట్ సోర్సింగ్ కింద 28, 673 మంది, బల్దియాలో వేరే 25 డిపార్టుమెంట్లకు శాంక్షన్ పోస్టులు ఉన్నాయని, డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులు 315 మంది 25 డిపార్టుమెంట్లకు చెందినవారు కాకుండా మిగతా వారు 65, ఐదేళ్లపైబడిన ఉద్యోగులు10 మంది ఉన్నారని, రిటైర్డ్ అయినవారు 45 మంది కొనసాగుతున్నట్లు ఆమె వెల్లడించారు.
పీవీ సేవలను కొనియాడారు
మీటింగ్ ప్రారంభం కాగానే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న రావడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇందులో అన్ని పార్టీల సభ్యులు మాట్లాడి పీవీ సేవలను కొనియాడారు. పీవీ కూతురు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని, ప్రతి ఒక్కరూ తమకే అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
మూడేండ్ల తర్వాత మాట్లాడిన డిప్యూటీ మేయర్
మూడేండ్లలో ఎన్నడూ మాట్లాడని డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి తొలిరోజు సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ మీటింగ్ కూడా ఇంత మంచిగా జరగలేదు. సభ్యులు కూడా ఎక్కువ మంది వచ్చారు. సిటీ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి పండుగకు ముందు మీటింగ్ నిర్వహించి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ సూచించారు. మూడేండ్ల నుంచి అధికారులను మార్చలేదని చెప్పారు.
ఇయ్యాల బడ్జెట్ కు ఆమోదం
2024--–25 ఏడాదికి బల్దియా బడ్జెట్ రూ రూ.8,437 కోట్లుగా ఖరారు చేశారు. ఇందులో రెవెన్యూ ఆదాయం రూ.5,938 కోట్లు, వ్యయం రూ.3,458 కోట్లు, మిగులు రూ.2,480 కోట్లు, మూలధన నిధులు రూ.1,999 కోట్లు, మూలధన వ్యయం రూ. 4,479 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. హౌసింగ్ కు ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. మంగళవారం రెండో రోజు కౌన్సిల్ మీటింగ్ లో బడ్జెట్ కు బల్దియా ఆమోదం తెలపనుంది.
నోరు విప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఎక్స్ అఫిషీయో సభ్యులు కూడా మాట్లాడారు. ప్రతి మీటింగ్ లో పెద్దగా మాట్లాడకపోయినా ఈసారి పలు సూచనలు చేశారు. కరెంట్ ఆదా కోసం ఎల్ఈడీ లైట్లు పెట్టుకున్నామని, 4 నెలలుగా రిపేర్లు చేయడం లేదని, ఎలక్ర్టిసిటీ వ్యవస్థ బల్దియాలో చనిపోయిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పేర్కొన్నారు. స్మశాన వాటికలు, రోడ్లుపై ఎక్కడ కూడా లైట్లు వెలగట్లేదని, వాటిని మార్చేందుకు సిబ్బంది లేరని, సమస్య ఓటర్లు ఎక్కువగా ఉన్న తమ నియోజకవర్గంలోనే ఉందని తెలిపారు.
సిటీలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రతి దానిపై సగ్రమంగా విచారించాలని చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫీకర్ కోరారు. బల్దియా అప్పుల్లో కూరుకుపో డానికి కారణం ఎవరు..? అన్ని ప్రశ్నిస్తూ.. 9 ఏండ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 2 నెలల్లోనే రూ.1, 776 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బల్దియా ఆదాయం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ప్రభాకర్ సూచించారు. హైరిడ్జ్ బిల్డింగ్ లకు పర్మిషన్లు ఇచ్చే విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల ని, సీవరేజీ లైన్లు లేకుండానే ఓసీలు జారీ చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు.
