ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించిన ఒకే ఒక్క హీరోయిన్

ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించిన ఒకే ఒక్క హీరోయిన్

హీరోల కోసమే సినిమాలు చూసే రోజుల్లో.. హీరోయిన్‌ కూడా ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించగలదని ప్రూవ్ చేశారామె. పాటలైనా ఫైట్స్ అయినా.. హీరోలతో సమానంగా హీరోయిన్లూ చేయగలరని అందరూ ఒప్పుకునేలా చేశారామె. ఆనాడు ఆమె ఆలపించిన ‘పడమటి సంధ్యారాగం’.. ఒక గొప్ప ‘జైత్రయాత్ర’కి శ్రీకారం. రొటీన్‌ సినిమాలపై ఆమె చేసిన ‘ప్రతిఘటన’.. ఎందరో హీరోయిన్లకి  మార్గదర్శకం. కూల్‌ పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి.. పవర్‌‌ఫుల్‌ రోల్స్ కు కేరాఫ్‌గా మారి.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసి..లేడీ అమితాబ్‌గా అందరి గుండెల్లో నిలిచిపోయిన ఆమె.. విజయశాంతి. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా విజయశాంతి గురించి, తన కెరీర్‌‌ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

పెళ్లిచూపులుతో హీరోయిన్..నేటిభారతంతో నటిగా..

మద్రాసులో పుట్టి పెరిగిన విజయశాంతికి.. తన పిన్ని విజయలలిత ద్వారా చిన్నతనంలోనే సినిమా పరిచయమైంది. అందుకే ఆమె పేరులోని విజయని.. తన అసలు పేరు శాంతికి యాడ్ చేసుకుని విజయశాంతిగా మారారామె. పద్నాలుగేళ్ల వయసులో ‘కల్లుక్కుళ్‌ ఈరమ్’ అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ వెంటనే తెలుగు మూవీ ‘కిలాడీ కృష్ణుడు’లో కృష్ణతో కలిసి నటించే అవకాశం వచ్చింది. తర్వాత కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్‌‌ నటించిన ‘సత్యం–శివమ్‌’లో యాక్ట్ చేసే ఛాన్స్ సంపాదించారు విజయశాంతి. మొదట్లో చెల్లెలు, కూతురి పాత్రలే వచ్చేవి. తొలిసారి ‘పెళ్లిచూపులు’ మూవీలో హీరోయిన్‌గా చేసే అవకాశం దక్కింది విజయశాంతికి. భాగ్యరాజా తీసిన తమిళ సినిమాకి ఇది రీమేక్. ఇందులోని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆమెకి హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. అయితే విజయశాంతి కెరీర్‌‌ మలుపు తిరిగింది మాత్రం ‘నేటి భారతం’ సినిమాతో టి.కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఆమె పర్‌‌ఫెక్ట్ గా సూటవుతారని దర్శకులంతా గుర్తించారు.

విజయశాంతి నటనని ఇప్పటికీ మర్చిపోలేరెవరూ

ఇక ‘ప్రతిఘటన’ సినిమాతో తిరుగులేని హీరోయిన్‌ అయ్యారు విజయశాంతి. ఒక మామూలు గృహిణి.. బలమైన భావాలున్న లెక్చరర్.. చెడుకు ఎదురుతిరిగే ధైర్యశాలి.. శత్రువుని చీల్చి చెండాడే శక్తి స్వరూపిణి.. ఇలా రకరకాల షేడ్స్ ఉండే ఈ పాత్రని అద్భుతంగా పోషించారామె. ముఖ్యంగా ఎస్.జానకి పాడిన ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ పాటలో విజయశాంతి నటనని ఇప్పటికీ మర్చిపోలేరెవరూ. అందుకే ఆ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ విజయశాంతికి దక్కింది. నంది అవార్డు వరించింది. ఆ తర్వాత భారతనారి, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలకు కూడా నంది అవార్డును అందుకున్నారామె. విజయశాంతి బాలీవుడ్‌లో నటించిన మొదటి సినిమా ‘ఈశ్వర్’. కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసి ఈ చిత్రంలో అనిల్ కపూర్ హీరో. ‘స్వాతిముత్యం’ సినిమాకి ఇది రీమేక్. ఆ తర్వాత ‘అశ్వత్థామ’ హిందీ రీమేక్ ‘ముకద్దర్‌‌కా బాద్‌షా’లో నటించారామె. ఇంకా అపరాధి, గూండాగర్దీ, జమానత్‌ లాంటి సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు హిందీలోకి డబ్ కూడా అయ్యాయి.

 

ఆమె అద్భుత నటనకి నేషనల్ అవార్డు

ఓ సమయం వచ్చేసరికి హీరోలతో సమానమైన స్థాయికి చేరుకున్నారు విజయశాంతి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి ఆమె సినిమాలు. ముఖ్యంగా ‘కర్తవ్యం’ సినిమా అయితే కాసుల వర్షం కురిపించింది. విజయశాంతి కెరీర్‌‌ని పీక్స్ కు తీసుకెళ్లింది. సిన్సియర్ అండ్ టఫ్ పోలీసాఫీసర్‌‌గా ఆమె అద్భుత నటనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పద్నాలుగో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. మాస్‌ మహరాజా రవితేజ ఈ సినిమాలోని ఓ చిన్న పాత్ర ద్వారానే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని హిందీలోకి డబ్ చేసి ‘వైజయంతి ఐపీఎస్‌’ పేరుతో రిలీజ్ చేస్తే అక్కడా సూపర్ హిట్టయ్యింది. ఇందుమతి అనే అమ్మాయి విజయశాంతిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి సివిల్స్‌ రాసింది. 151వ ర్యాంకును సాధించి ఐపీఎస్ ఆఫీసర్‌‌గా మధురైలో చార్జ్ తీసుకుంది. ‘కర్తవ్యం’ సినిమా తర్వాత గ్లామరస్ రోల్స్ తగ్గించి ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు విజయశాంతి. ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. రిస్కీ షాట్స్ కు కూడా వెనుకాడేవారు కాదు. ముప్ఫై అడుగుల ఎత్తు నుంచి దూకి గాయపడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఒక హీరోయిన్‌కి హీరో స్టేటస్ ఎలా వస్తుంది, వాళ్లతో సమానంగా రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటుంది అని ప్రశ్నించినవాళ్లందరికీ తన విజయాలతో జవాబు చెప్పారామె. 

విజయశాంతి కెరీర్‌‌లో ‘పడమటి సంధ్యారాగం’

లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో విజయశాంతిది తిరుగులేని రికార్డ్. ఆమె చేసినన్ని మహిళా ప్రధాన చిత్రాలు ఏ భాషలోనూ ఏ హీరోయిన్ కూడా చేయలేదు. నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, సమాజంలో స్త్రీ, అరుణ కిరణం, భారతనారి, భారతర్నత, పోలీస్ లాకప్, లేడీ బాస్, కర్తవ్యం, ఆశయం, స్ట్రీట్ ఫైటర్, మగరాయుడు, ఒసే రాములమ్మా, రౌడీ దర్బార్, సీఐడీ, అడవి చుక్క, వైజయంతి, ఇందిరమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి.  ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే కాదు.. విజయశాంతి కెరీర్‌‌లో ‘పడమటి సంధ్యారాగం’ లాంటి అద్భుతమైన ప్రేమకథలు.. ‘స్వయంకృషి’ లాంటి చక్కని సందేశాత్మక చిత్రాలు కూడా ఉన్నాయి. ఓవైపు తన ఇమేజ్‌ని బిల్డప్ చేసుకుంటూ.. మరోవైపు హీరోలకు జోడీగా నటిస్తూ సత్తా చాటారు విజయశాంతి. ఆమె అత్యధిక సినిమాలు చిరంజీవితో చేశారు. 19 సినిమాల్లో ఆయనకి జోడీగా నటించారు. ఇక బాలకృష్ణతో పదిహేడు, కృష్ణతో పన్నెండు, శోభన్‌బాబుతో పదకొండు, సుమన్‌తో ఏడు సినిమాలు చేశారు. 

 

‘అడవిచుక్క’ సినిమాని స్వయంగా నిర్మించారు

దర్శకుల్లో కోడి రామకృష్ణతో ఎక్కువ సినిమాలు చేశారామె. పన్నెండు సినిమాలకు వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేశారు. కె.రాఘవేంద్రరావుతో పది, కోదండరామిరెడ్డితో కూడా పది సినిమాలు చేశారు. టి.కృష్ణతో వందేమాతరం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు, దేవాలయం సినిమాలు వచ్చాయి. ఇక దాసరి నారాయణరావుతో ఆరు, కె.విశ్వనాథ్‌తో రెండు, బాపుతో రెండు మూవీస్ చేశారు. మొదట్లో ఏఎం రత్నం..విజయశాంతికి మేకప్‌మేన్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆమె స్థాపించిన సూర్యా మూవీస్‌ సంస్థలో భాగస్వామి అయ్యారు. ‘ఆశయం’ సినిమాకి కో ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరించిన ఆయన, కొన్నాళ్లకు ఆ బ్యానర్ బాధ్యతను పూర్తిగా చేపట్టారు. విజయశాంతితో ‘కర్తవ్యం’ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత చాన్నాళ్లకు సూరజ్ మూవీస్ బ్యానర్‌‌పై  ‘అడవిచుక్క’ అనే సినిమాని స్వయంగా నిర్మించారు విజయశాంతి. 

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ

విజయశాంతి నటించిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని పూర్తయ్యి రిలీజ్ దగ్గర ఆగిపోతే, మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్నింటిని అనౌన్స్ చేసిన తర్వాత సెట్స్ కు వెళ్లకముందే బ్రేక్ పడింది. అడవిరాణి, రాయలసీమ రక్తం, జిందాబాద్, జైహింద్, హోమ్ మినిస్టర్ లాంటివి వాటిలో కొన్ని ఉన్నాయి. కెరీర్‌‌లో బిజీగా ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.వి.శ్రీనివాస ప్రసాద్‌ని పెళ్లి చేసుకున్నారు విజయశాంతి. ఆయన దగ్గుబాటి పురంధరేశ్వరికి మేనల్లుడు. 2006లో ‘నాయుడమ్మ’ సినిమా చేసిన తర్వాత కెమెరా ముందుకు రావడం మానేశారు విజయశాంతి. అంతకు ఆరేళ్ల క్రితం నుంచి చేసిన సినిమాలు కూడా అంతగా సక్సెస్ కాకపోవడంతో కెరీర్‌‌ డల్‌ అయ్యింది. అప్పటికే పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో ఇక నటనకు దూరమై రాజకీయాలపై దృష్టి పెట్టారామె. పద్నాలుగేళ్ల తర్వాత మహేష్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తనకు నచ్చే పాత్రలు దొరికితే ఇకపై నటనను కొనసాగిస్తానని చెప్పారు విజయశాంతి.