పంటలకు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నడు

V6 Velugu Posted on Mar 29, 2021

సెంటు భూమి లేదు. అయితేనేం  వ్యవసాయం  చేయాలనుకున్నడు. అందుకోసం ఉద్యోగాన్ని వదిలేసిండు. సాగులో ఓనమాలు తెలియవు. అయినా  వెనక్కి తగ్గలే. ఓపిగ్గా నేర్చుకున్నడు. వ్యవసాయం మెళకువలు తెలుసుకున్నడు. పొలం బాట పట్టి వరితో మొదలుపెట్టి ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పండిస్తున్నడిప్పుడు. అది కూడా ఆర్గానిక్​ పద్ధతిలో.  అంతేనా తన పంటలకి సొంత బ్రాండ్​ కూడా క్రియేట్​ చేసుకున్నడు.  ప్రస్తుతం హెల్దీ ఫుడ్​ ప్రొడక్ట్స్​కి  కేరాఫ్​గా మారిన అతని పేరు విజయ్​ కుమార్​. ‘నో ల్యాండ్​ టు ఓన్​ బ్రాండ్’​ అంటున్న ఈ యంగ్​ ​ ఫార్మర్​ ​ జర్నీ ఇది.

జగిత్యాల జిల్లా నగునూరు మండలం లచ్చక్కపేటలో పుట్టిండు విజయ్​ ​కుమార్. చదువయ్యాక అందరిలానే పొట్టకూటి కోసం పట్నమొచ్చిండు. కార్పొరేట్​ కంపెనీలో ఎగ్జిక్యూటివ్​గా చేరి అడిషనల్​ వైస్​ ప్రెసిడెంట్​ స్థాయికి ఎదిగిండు. అయినా సరే చేసేది  గవర్నమెంట్​ కొలువు కాదని  పిల్లను ఇవ్వనీకి ముందుకురాలేదు ఎవరూ. దాంతో ​ బ్యాంక్​ జాబ్​కు ట్రై చేసిండు. బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్​ (పీవో)గా ఉద్యోగమొచ్చింది. తర్వాత పెళ్లి కూడా అయ్యింది. కానీ, కొద్ది రోజులకే చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్​ లేదు. ఏదైనా కొత్తగ చేయాల్నన్న ఆలోచన మొదలైంది. 
ఆ టైంలోనే తన ఫ్రెండుకి, తన భార్య ​ ఫ్రెండ్​కి  క్యాన్సర్​ వచ్చింది. రోగానికి కారణం ఫుడ్​ కూడా అయి వుండొచ్చన్నరు డాక్టర్లు. హెల్దీ ఫుడ్​ దొరక్క రోగాల బారిన పడుతున్నారని అక్కడా ఇక్కడా చదివిండు  విజయ్. ​ దాంతో ఉద్యోగం వదిలి ఆర్గానిక్​  వ్యవసాయం వైపు అడుగులేసిండు.
ఇంట్లో వాళ్లు వద్దన్నరు
విజయ్​ ఆలోచన ఇంట్లోవాళ్లకి  నచ్చలే. ఉద్యోగం వదిలేసి ఇంత కష్టమెందుకు అన్నరు. అయినా వినలే విజయ్​. సిటీ దగ్గర్లో ఉన్న అవుషాపూర్​లో  ఐదు ఎకరాలు  ల్యాండ్​ లీజుకు తీసుకున్నడు. వరి పంట వేసిండు. మొదటి సంవత్సరం అంతా లాస్. అయినా భయపడలే. వ్యవసాయంలో మెళకువల గురించి సెర్చింగ్​ మొదలుపెట్టిండు. పుస్తకాలు చదివిండు.. యూట్యూబ్​లో వీడియోలు చూసిండు. రొటీన్ పంటలు వేయడం వల్ల ప్రయోజనం లేదనుకున్నడు. దేశవాళీ పంటలు పండించాలని డిసైడ్​ అయ్యిండు. సిటీలో డయాబెటిస్​ ఎక్కువగా ఉండటంతో దాన్ని కంట్రోల్​ చేసే బియ్యం గురించి తెలుసుకున్నడు. వెనకటి కాలం నుంచి ఉన్న విత్తన రకాలను సేకరించి సాగు మొదలుపెట్టిండు . ఆర్గానిక్ పద్ధతిలో ఆకుకూరలు పండించడానికి  నేచురల్ షెడ్  ఏర్పాటు చేశిండు. డ్రిప్ సాయంతో ఆకుకూరల సాగు మొదలుపెట్టిండు. ఐదారు గుంటల జాగాలోనే రోజుకి 100 కట్టల ఆకుకూరలు దిగుబడి చేస్తున్నడు ఇప్పుడు. 
సొంతంగా బ్రాండ్​ 
పాత కాలం నాటి నవారా బత్తి, బ్లాక్​ రైస్​, చోడామణి లాంటి వంగడాలను సాగు చేసిండు విజయ్​.  మొదట్లో పంట చేతికొచ్చాక లాభం చూడకుండానే అమ్మిండు. చాలామంది షుగర్​ పేషెంట్స్​కి  షుగర్​ కంట్రోల్ అయ్యింది. దాంతో  మెల్లగా మౌత్​ పబ్లిసిటీ పెరిగింది. కస్టమర్లు పెరిగిన్రు​. అమ్మకాలు పెరగడంతో సొంతంగా బ్రాండ్​ పెట్టుకోవాలి అనుకున్నడు. ఎకో ఫ్రెండ్లీ వ్యవసాయానికి సింబల్​గా ఉండే పిచ్చుకలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలను లోగోగా ఎంచుకున్నడు. ‘ప్రాచీన’ పేరుతో అమ్మకాలు మొదలుపెట్టిండు. ప్రస్తుతం నాలుగొందల మంది కస్టమర్స్​ ఉన్నరు విజయ్​కి. 

అదే ఆలోచనలో..
వరిలో దాదాపు 1800 దేశీయ వంగడాలున్నయ్​. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల దాకా రకరకాలుగా బలాన్నిచ్చే, ఆరోగ్యాన్ని ఇచ్చే గుణం రైస్​లో ఉంది. పూర్వ కాలం నుంచి ఆయా అవసరాన్ని గుర్తించి వివిధ రకాల రైస్​ను వాడేవాళ్లు. పిల్లలకు ఒక రకమైన రైస్​, సైనికులకు మరో రకం, సంతానోత్పత్తికి ఇంకోరకం, గర్భిణులకు వేరే రకం.. ఇలా రకరకాల రైస్​ ఉండేది. ఆయుర్వేద వైద్యంలో కొన్ని రకాల బియ్యపు గంజిని వాడేవాళ్లు. ఇలాంటి వెరైటీలను ఇప్పుడు  మళ్లీ జనాలకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నా అంటున్నడు విజయ్​..

ఇంట్లోనే ఎరువులు
‘‘ఆవు పేడ, మూత్రంతో చేసిన జీవామృతం, పంచగవ్యం, ఘనామృతం, ల్యాక్టో బాసిల్లస్​ బ్యాక్టీరియా, వేప, ఇతర ఆకుల నుంచి తయారుచేసిన కషాయాలనే ఎరువుగా వాడుతున్నడు విజయ్​. కస్టమర్స్​ అందరికీ తనే స్వయంగా డోర్​ డెలివరీ చేస్తున్నడు. స్టోర్​కి ​ వచ్చి కొనుక్కోవాలనుకునే వాళ్లకోసం సికిందరాబాద్​లోని సుచిత్రలో ఒక స్టోర్​ కూడా తెరిచిండు. రైస్​తో పాటు ఆకు కూరలు, కూరగాయలను కూడా ఆర్గానిక్​ పద్ధతిలో పండించి అమ్ముతున్నడు. నాటు కోళ్లు, కోడిగుడ్లు కూడా సేల్​ చేస్తున్నడు. ‘‘ఎవరైనా ప్రొడక్ట్స్ బాగున్నయ్​ అని చెప్తే అప్పటివరకు... పడ్డ కష్టమంతా మర్చిపోతాను’’ అంటున్నడు విజయ్​.

మార్కెటింగే తెలియాలి

‘‘వ్యవసాయం గురించి తెలియకపోయినా తాను సక్సెస్ కావడానికి మార్కెటింగ్ కారణం అంటాడు విజయ్. రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం వాళ్లకు మార్కెటింగ్ పై అవగాహన లేకపోవడమే. డిమాండ్ లో ఏముందో తెలియాలి. అలాంటి పంటలు వేయాలి. కొత్త పద్ధతుల్లో ఆలోచించాలి. అప్పుడే సక్సె అవుతాం’’ అంటున్నాడు విజయ్.  ::: కడార్ల కిరణ్, హైదరాబాద్​, వెలుగు
  
 

Tagged crops, Created, Jagityal District, brand

Latest Videos

Subscribe Now

More News