విక్రమ్ ల్యాండింగ్ సైట్ ఇక.. స్టేషియో శివశక్తి పాయింట్

విక్రమ్ ల్యాండింగ్ సైట్ ఇక.. స్టేషియో శివశక్తి పాయింట్

న్యూఢిల్లీ:  ఇస్రో చంద్రయాన్–3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన చోటుకు ‘స్టేషియో శివ శక్తి’ పాయింట్ అనే పేరు అధికారికంగా ఆమోదం పొందింది. విక్రమ్ ల్యాండర్ 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఆ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... విక్రమ్ ల్యాండ్ అయిన చోటుకు శివ శక్తి పాయింట్ గా పేరు పెట్టినట్టు వెల్లడించారు. చంద్రయాన్–3 ల్యాండింగ్ కు గుర్తుగా ఆగస్ట్ 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.

అయితే, విక్రమ్ ల్యాండింగ్ సైట్ కు శివ శక్తి  అనే పేరు పెట్టే ప్రతిపాదనను ఏడు నెలల తర్వాత తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఇంటర్నేషనల్ ఆస్ట్రొనామికల్ యూనియన్ (ఐఏయూ) ఆమోదించింది. విక్రమ్ దిగిన చోటును ‘స్టేషియో శివ శక్తి’ పాయింట్ గా ధ్రువీకరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 19న ప్లానెటరీ నామిన్ క్లేచర్ గజెట్ ను జారీ చేసింది. కాగా, స్టేషియో అంటే.. లాటిన్ భాషలో స్థలం అని అర్థం. అలాగే భారత పురాణాల ప్రకారం.. శివ అంటే పురుషుడు, శక్తి అంటే మహిళకు సంకేతమని.. ఈ రెండూ కలిసి ప్రకృతిని సూచిస్తాయని గజెట్ లో ఐఏయూ పేర్కొంది.