మహిళా సంఘాల్లో వీబీకేల చేతివాటం

మహిళా సంఘాల్లో వీబీకేల చేతివాటం

నల్గొండ, వెలుగు:   మహిళా స్వయం సంఘాలకు ఆర్థికంగా భరోసా కల్పించాల్సిన విలేజ్ బుక్ కీపర్లు(వీబీకే) అక్రమాలకు పాల్పడుతున్నారు. సెర్ప్​ద్వారా మహిళా సంఘాలకు అందాల్సిన బ్యాంకు రుణాలు దక్కకుండా మోకాలడ్డుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, వడ్ల కొనుగోళ్లల్లో కీలకంగా వ్యవహరించే వీబీకేల చేతివాటం భారీగా పెరిగింది. సంఘాలను అడ్డం పెట్టుకుని అక్రమంగా రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన సెర్ప్​ సిబ్బందినే బెదిరిస్తున్నారు. రుణాల రికవరీలో వీబీకేలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాలప్పడినట్లు సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ఒక్కో వీబీకే కనీసం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు స్వాహా చేసినట్లు రుజువైం ది. గడిచిన మూడేళ్లలో 25 మండలాల్లో పేరుకుపోయిన రూ.68.80 కోట్ల బకాయిల్లో వీబీకేలు పెద్ద మొత్తంలో కాజేశారని చెపుతున్నారు. 

అక్రమాలు వెలుగులోకి..

స్త్రీనిధిలో రుణాలు పొందిన సభ్యులు వరుసగా మూడు నెలలు ప్రీమియం కట్టకపోతే ఆ సంఘం ఎన్ పీఏ జాబితాలో చేరిపోతుంది. ఈ గుట్టును పసిగట్టిన వీబీకేలు సభ్యుల నుంచి వసూలు చేసిన ప్రీమియంలో రెండు నెలలు వాళ్ల దగ్గరే పెట్టుకుని మూడో నెల ప్రీమియం మాత్రమే కట్టారు. 60 రోజుల అమౌంట్​వీబీకేలే దగ్గరే రొటేషన్​అయ్యేది. సభ్యుల పేర్ల మీద వీబీకేలే బినామీలుగా రుణాలు తీసుకున్నవారు ఇప్పుడు చేతులెత్తేశారు. ఈ రకంగా ఏళ్ల తరబడి మేనేజ్ చేసుకుంటూ వస్తోన్న వీబీకేల గుట్టు కాస్తా ఇటీవల బయట 
పడింది. స్త్రీనిధి బకాయిలు, కిస్తీలు పక్కదారి పడుతున్నాయన్న కారణంతో సెర్ప్​కొత్త రూల్​అమల్లోకి తెచ్చింది. వీబీకేలతో ప్రమేయం లేకుండా డైరెక్ట్​రీపేమెంట్​సిస్టమ్​ప్రవేశపెట్టారు. దీంతో సభ్యులే నేరుగా స్త్రీనిధి అకౌంట్లోకి కిస్తీలు జమ చేసేలా మార్పు చేశారు. ఈ కొత్త విధానం వచ్చాక అప్పటి వరకు పేరుకు పోయిన బకాయిలను స్త్రీనిధి స్టాఫ్​ఆరా తీయగా వీబీకేల అక్రమాల గుట్టు బయట పడింది. మహిళా సంఘాల నుంచి కిస్తీలు వసూలు, వాటిని స్త్రీనిధి ఖాతాలో జమచేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తేలింది. 

కరోనా టైంలోనే కాజేసిర్రు...

రాష్ట్రంలో కరోనా వైరస్​ ఎంటరైనప్పటి నుంచే స్త్రీనిధి కిస్తీలు పెండింగ్​లో పెడ్డాయి. కరోనా టైంలో ఆఫీసులు, ఉద్యోగులు డ్యూటీలకు సక్రమంగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో దీన్నే అధునుగా భావించిన వీబీకే లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. సంఘాల నుంచి వసూలు చేసిన కిస్తీలు మూడొంతలు వాడుకుని, ఒక వంతు మాత్రమే జమ చేశారు. దీంతో అప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలే మూడేళ్లలో రూ.60 కోట్లకు చేరాయి. బకాయిలు వసూలు కాక సభ్యులు కొత్త రుణాలు తీసుకోలేకపోతున్నారు. మరోవైపు తీసుకున్న అప్పు మీద వడ్డీ 11% అయితే ఇన్నేళ్ల నుంచి పెండింగ్ లో ఉండటం తో చక్రవడ్డీ కూడా తోడైంది. ఇంకోవైపు రుణాల పర్పంటేజీ కూడా భారీగా కోత పెట్టారు. ఈ ఏడాది స్త్రీనిధి కింద రూ.221 కోట్లు టార్గెట్​పెడితే దాంట్లో రూ.70కోట్లు తగ్గించి కేవలం రూ.155 కోట్లకే పరిమితం చేశారు. ఇదేరకంగా గత రెండు, మూడేళ్ల నుంచి రూ.70, 80 కోట్లు కోత పెట్టడంతో సంఘాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. 

ఇరకాటంలో మహిళా సంఘాలు....

వీబీకేలు చేసిన అక్రమాలతో ఇప్పుడు మహిళా సంఘాలు ఇరకాటంలో పడ్డాయి. జిల్లాలో 25 మండలాల్లో 718 వీఓల పరిధిలోని 5,522 సంఘాలు ఎన్పీఏ జాబితాలో చేరాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలు రూ.68.80 కోట్లు. కాగా దీంట్లో ఇప్పటికిప్పుడు రూ.29.80 కోట్లు కడితే తప్పా ఎన్​పీఏ లిస్ట్​నుంచి ఆ సంఘాలు బయట పడే పరిస్థితి లేదు. 

25 మండలాల్లోనే అధికం..

జిల్లాలో అత్యధికంగా కట్టంగూరు, నార్కట్​పల్లి, అడవిదేవుపల్లి, పెద్దవూరు, మాడ్గుపల్లి, దామచర్ల, నిడమనూరు, మిర్యాలగూడ, పీఏపల్లి, నాంపల్లి, తిరమలగిరి సాగర్, గుర్రంపోడు మండలాల్లో సంఘాలున్నాయి. కట్టంగూరు మండలంలో 32 వీఓల పరిధిలోని 451 సంఘాలు రూ.6.43 కోట్ల బకాయి పడ్డాయి. దీంట్లో ఒక వీబీకే రూ.7.50 లక్షల వాడుకున్నట్లు తేలింది. సంఘాల నుంచి వసూలు చేసిన కిస్తీలు స్త్రీనిధి ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నాడు. నార్కట్ పల్లి మండలంలో మాండ్రలో కూడా ఇదే రకమైన పరిస్థితి. ఈ మండలంలో 25 వీఓల పరిధిలో 357 సంఘాలు రూ.4.29 కోట్ల బకాయి పడ్డాయి. మాండ్రలో రూ.5లక్షలు వాడుకున్నట్లు తేలింది. 25 మండలాల్లో ఇలాంటి పరిస్థితులేనని ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. వీటి రికవరి కావాలంటే జిల్లా అధికారులే ప్రత్యేక శ్రద్ధ చూపించడం తప్ప మరో దారి లేదంటున్నారు.