మహబూబ్నగర్ లో చివరి విడతలో భారీగా పోలింగ్..

మహబూబ్నగర్ లో చివరి విడతలో భారీగా పోలింగ్..
  • ముగిసిన పల్లె పోరు
  • మహబూబ్​నగర్​లో 88.36 శాతం, నారాయణపేటలో 85.53 శాతం,వనపర్తి జిల్లాలో 85.55 శాతం, గద్వాల జిల్లాలో 84.54 శాతం, నాగర్​కర్నూల్​ జిల్లాలో  83.01 శాతం నమోదు

మహబూబ్​నగర్/వనపర్తి/నాగర్​కర్నూల్/ గద్వాల, వెలుగు:మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి. చివరి విడతలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా పోలింగ్​ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో చివరి విడత ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్​ ప్రారంభమైనా.. చలి ప్రభావంతో 9 గంటల వరకు పోలింగ్​ కేంద్రాలకు రాలేదు. 

9 గంటల తర్వాత భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు 12.73 శాతం పోలింగ్​ మాత్రమే జరిగింది. ఆ తర్వాత 11 గంటల వరకు 55.12 శాతం పోలింగ్​ నమోదు కాగా.. ఒంటి గంట వరకు 83.53 శాతం పోలింగ్​ నమోదైంది. మహబూబ్​నగర్​ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు 25.38 శాతం ఓట్లు పోల్​ కాగా.. పోలింగ్​ ముగిసే వరకు 88.36 శాతం పోలింగ్​ నమోదైంది. 

నారాయణపేట జిల్లాలోని మక్తల్, మాగనూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు, ఊట్కూరు, నర్వ, కృష్ణ మండలాల్లోని వంద గ్రామ పంచాయతీలు, 775 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,52,648 మంది ఓటర్లు ఉండగా.. 1,27,502 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణలో 21,847 మందికి గాను 17,550 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాగనూరులో 19,145 మంది ఓటర్లకు గాను 16,269 మంది, మక్తల్​లో 43,701 మంది ఓటర్లకు గాను 37,998 మంది, నర్వలో 26,175 మంది ఓటర్లకు గాను 22,013 మంది, ఊట్కూరులో 41,780 మంది ఓటర్లకు గాను 33,672 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 83.53 శాతం పోలింగ్​ జరిగింది. 

వనపర్తి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్  ఆదర్శ్​ సురభి తెలిపారు. కంట్రోల్  రూమ్  నుంచి ఎన్నికల సరళిని పరిశీలించారు. శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్ లో ఏర్పాటు చేసిన మోడల్  పోలింగ్ స్టేషన్, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలం కంచిరావుపల్లి పోలింగ్  కేంద్రాలను సందర్శించి పోలింగ్  సరళిని పరిశీలించారు.  కౌంటింగ్  ప్రక్రియను కలెక్టరేట్  నుంచి అబ్జర్వర్  మల్లయ్య భట్టు, శ్రీనివాస్, అడిషనల్​ కలెక్టర్​ యాదయ్యతో కలిసి  పర్యవేక్షించారు. మూడో విడతలో పాన్​గల్, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో 1,30,059 ఓట్లకు గాను 1,11,357 ఓట్లు పోలయ్యాయి. 85.55 శాతం ఓటింగ్  నమోదైంది.

జోగులాంబ గద్వాల జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో 84.54 శాతం పోలింగ్  నమోదైంది. 44,382 మంది పురుషులు, 44,482 మంది మహిళలు, ఒక ట్రాన్స్​జెండర్​తో కలిపి 88,865 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలంపూర్ లో 86.89 శాతం, మానవపాడులో 89.55 శాతం, ఉండవల్లిలో 88.25 శాతం, ఇటిక్యాలలో 88.63 శాతం, ఎర్రవల్లిలో 89.06 శాతం పోలింగ్​ నమోదైంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఉండవల్లి మండలం పుల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జడ్పీ మాజీ చైర్ పర్సన్  సరిత దంపతులు మానవపాడు మండలం జల్లాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్రహం ఎర్రవల్లి మండలం వల్లూరులో ఓటు వేశారు. మానవపాడు, జల్లాపురం, బోరవెల్లి పోలింగ్  కేంద్రాలను కలెక్టర్  సంతోష్ పరిశీలించారు. కలెక్టర్ వెంట అడిషనల్  కలెక్టర్  నర్సింగరావు, ఎన్నికల ఆఫీసర్లు రామలింగేశ్వర్, రాఘవ, శ్రీనివాస్  జోషి, శివప్రసాద్, అగస్టీన్  ఉన్నారు.

నాగర్ కర్నూల్​ జిల్లాలో మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అచ్చంపేట, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో ఓటర్లు ఉదయం 7 గంటలకే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు. పొగమంచు కారణంగా వృద్దులు, పిల్లల తల్లులు కొంత ఆలస్యంగా ఓటేయడానికి వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట కంటే ముందే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కలెక్టర్​ బదావత్​ సంతోష్, ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ జీ పాటిల్, అడిషనల్  ఎస్పీ వెంకటేశ్వర్లు పోలింగ్​ కేంద్రాలను సందర్శించారు. 

బల్మూరు మండలం మహదేవపూర్​లో స్కూల్​ బిల్డింగ్​ ఇరుకుగా ఉండడంతో స్కూల్​ ఆవరణలో టెంట్​ కింద పోలింగ్​ నిర్వహించారు. 1,79,464 మంది ఓటర్లకు గాను 1,49,222 ఓట్లు పోలైనట్లు కలెక్టర్​ తెలిపారు. అచ్చంపేటలో 30,675  మందికి గాను 26,652 మంది, -అమ్రాబాద్ లో 17,004 మందికి గాను 12,852 మంది, -బల్మూరులో 34,802  మందికి గాను 28,037 మంది, లింగాలలో 31,190 మందికి గాను 25,317 మంది, పదరలో 15,838 మందికి గాను 12,909  మంది, -ఉప్పునుంతలలో 30,453 మందికి గాను 26,576 మంది, చారగొండ మండలంలో 19,502 మంది ఓటర్లకు గాను 16,879  మంది ఓటు వేశారు.

మహబూబ్​నగర్​ జిల్లాలోని అడ్డాకుల, మూసాపేట, భూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్పూర్, జడ్చర్ల, బాలానగర్​ మండలాల్లోని 122 గ్రామపంచాయతీలు, 914 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో 1,42,909 మంది ఓటర్లు ఉండగా.. 1,26,280 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా అడ్డాకులలో 23,757 మంది ఓటర్లకు గాను 21,161 మంది, మూసాపేటలో 21,167 మంది ఓటర్లకు గాను 18,688 మంది, భూత్పూర్​లో 25,240 మంది ఓటర్లకు గాను 21,118 మంది, బాలానగర్​లో 32,457 మంది ఓటర్లకు గాను 28,865 మంది, జడ్చర్లలో 40,288 మంది ఓటర్లకు గాను 36,448 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 88.36 శాతం ఓటింగ్​ నమోదైంది.