
- ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- గురుద్వారా శ్రీ గురు సింగ్ సభాతో పాటు ఆలయం, మసీదు, ఇండ్లు, వాహనాలు ధ్వంసం
- సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. పూంచ్, రాజౌరీ జిల్లాలతోపాటు బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జరిగిన పేలుళ్ల కారణంగా వెంటనే బ్లాక్ అవుట్ అయ్యిందని, సైరన్‌లు మోగాయని అధికారులు తెలిపారు. పూంచ్ జిల్లాలోని లోరాన్, మెంధార్ సెక్టార్లలో జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, అతడి భార్యతో సహా ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
మృతుడిని లోరాన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్రార్‌గా గుర్తించారు. షెల్లింగ్ ధాటికి పలు నివాస గృహాలు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గురుద్వారా శ్రీ గురు సింగ్ సభాతో పాటు ఓ ఆలయం, మసీదు కూడా దెబ్బతిన్నాయని వీడియోల్లోని దృశ్యాల ద్వారా తెలుస్తున్నది. వందలాది వాహనాలు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. కాగా, సరిహద్దు గ్రామాల ప్రజలను శిబిరాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఉద్రిక్తత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదు: ఒమర్ అబ్దుల్లా
ఉద్రిక్తత ఏ దేశానికీ ప్రయోజనం చేకూర్చదని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం కోసం ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరారు. జమ్మూ నగరంలో పాకిస్తాన్ డ్రోన్ దాడి ప్రయత్నం విఫలమైన తర్వాత.. ఒమర్ అబ్దుల్లా స్థానిక పరిస్థితిని సమీక్షించేందుకు జమ్మూకు వెళ్లారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలు, ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా అబ్దుల్లా విజయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు.
జమ్మూపై జరిగిన వైమానిక దాడులను 1971 యుద్ధం తర్వాత నగరంపై జరిగిన ‘‘అత్యంత తీవ్రమైన దాడులు’’గా ఆయన అభివర్ణించారు. పహల్గాం దాడి తర్వాత భారత్ తగిన సమాధానం ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఉద్రిక్తతను పెంచే చర్యలు పాకిస్తాన్ నుంచి జరుగుతున్నాయని, ఇది ఎవరికీ మేలు చేయదని స్పష్టం చేశారు.
ఉరి సెక్టార్లో ఎల్జీ పర్యటన
ఉరి సెక్టార్లో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్మనోజ్ సిన్హా శుక్రవారం పర్యటించారు. పాక్ కాల్పుల్లో దెబ్బతిన్న నివాస సముదాయాలను పరిశీలించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
స్కూళ్లు మూత.. ఆన్లైన్లో చదువులు
జమ్మూ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేశారు. స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ కోల్పోవద్దనే ఉద్దేశంతో పలు విద్యాసంస్థలు ఆన్లైన్లో క్లాసులు ప్రారంభించాయి. ఈ నెల 7 నుంచి బంద్ కొనసాగుతున్నది.
జమ్మూ– ఢిల్లీకి స్పెషల్ ట్రైన్స్
జమ్మూ, ఉధంపూర్ నుంచి ఢిల్లీకి ఇండియన్ రైల్వేస్3 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ట్రైన్ నంబర్ 04612 జమ్మూ నుంచి10:45 గంటలకు, 20 కోచ్‌లతో వందే భారత్ ట్రైన్ జమ్మూ, పఠాన్‌కోట్ మీదుగా ఉధంపూర్‌కు 12.45 గంటలకు ప్లాన్చేశారు. 22 ఎల్‌హెచ్‌బీ ట్రెయిన్ జమ్మూకు రాత్రి 7 గంటలకు ఉంటుంది.
ప్రతీకారం తీర్చుకున్న భారత ఆర్మీ
పాక్ కాల్పులకు భారత ఆర్మీ కూడా ప్రతీకారం తీర్చుకున్నది. జమ్మూ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన డ్రోన్లు, ఇతర ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్‌ను భారత వాయు రక్షణ వ్యవస్థ న్యూట్రలైజ్ చేయడం వీడియో దృశ్యాల్లో కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ నిరంతరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని భారత సైన్యం పేర్కొంది.
గురువారం రాత్రి పాక్ బలగాలు డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పశ్చిమ సరిహద్దు వెంబడి అనేక దాడులకు ప్రయత్నించాయని, వీటిని తమ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆర్మీ తెలిపింది.