మోరంచపల్లి గజ గజ!.. ఊర్లో ఉండడానికి భయపడుతున్న గ్రామస్తులు

మోరంచపల్లి గజ గజ!.. ఊర్లో ఉండడానికి భయపడుతున్న గ్రామస్తులు
  • 1986లో ఎన్టీఆర్‌‌‌‌ ఇండ్లు కట్టిస్తామన్నా పోలే 
  • 2000లో వరదలొచ్చినప్పుడూ భయపడలే..
  • తాజా ఘటనతో ఊరు ఖాళీ చేయడానికి సిద్ధం
  • వేరే చోట ఇండ్లు కట్టిస్తే పోతామని రిక్వెస్ట్

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్‌‌‌‌, వెలుగు:వరదలకు మునిగిన మోరంచపల్లి గ్రామస్తులు గజ.. గజ వణికిపోతున్నరు. రాత్రిపూట ఇంట్లో పడుకోవాలంటే హడలిపోతున్నారు. మళ్లీ వానొచ్చి వరదలొస్తే ప్రాణాలు పోతాయోమోనని జంకుతున్నారు. వెంటనే తమ గ్రామాన్ని ఖాళీ చేసి వేరే చోటికి తరలించాలని కోరుతున్నారు. 1986లో ఎన్టీఆర్‌‌‌‌, 2000 సంవత్సరంలో చంద్రబాబునాయుడు హయాంలో మోరంచవాగు ఉప్పొంగి ఊళ్లోకి నీళ్లొచ్చినయ్‌‌‌‌. అప్పుడు కూడా ప్రాణభయంతో ప్రజలు ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు.

1986లో  కేవలం 70 గుడిసెలతో ఉన్న మోరంచపల్లి గ్రామాన్ని ఖాళీ చేయాలని అప్పటీ సీఎం ఎన్టీఆర్‌‌‌‌ ఆదేశించారు. సర్కారు తరపున కొత్త ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినా అప్పటి గ్రామస్తులు ఒప్పుకోలేదు. కానీ, మొన్నటి వరదలకు భయపడ్డ మోరంచపల్లి వాసులు తమకు వేరే చోట ఇండ్లు కట్టిస్తే వెంటనే ఖాళీ చేస్తామని చెబుతున్నారు.  

రామప్పలో పుట్టి.. మానేరులో కలుస్తుంది

మోరంచ వాగు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప చెరువు మత్తడి, తూము నీళ్ల ద్వారా జన్మిస్తుంది. అక్కడి నుంచి గణపురం, భూపాలపల్లి, చిట్యాల మండలాల మీదుగా సుమారు 40 కిలోమీటర్లు ప్రవహించి చిట్యాల మండలం కాల్వపల్లి దగ్గర ఉన్న పూరేడుగుట్ట వద్ద మానేరు వాగులో కలుస్తుంది. అయితే, వరదలొచ్చిన ప్రతిసారి మోరంచపల్లికి మోరంచవాగు ముప్పు పొంచి ఉంటుంది. 

మోరంచపల్లికి వరదలెందుకొస్తున్నయ్‌‌‌‌? 

మోరంచవాగు ప్రవహించే ప్రదేశం నుచి సుమారు అర కిలోమీటర్ ​దూరంలో మోరంచపల్లి ఉంటుంది. గుడెప్పాడ్‌‌‌‌ నుంచి సిరొంచ 153 సీ నేషనల్‌‌‌‌ హైవే రోడ్డుకు రెండువైపులా ఇండ్లు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ 320 కుటుంబాలు నివసిస్తున్నాయి. పై నుంచి చూస్తే మోరంచవాగు ప్రవాహం వంకలు, వంకలు తిరిగి కనిపిస్తుంది. వాగులో నీటి ప్రవాహం భారీగా పెరిగినప్పుడు నేరుగా గ్రామంలోని ఇండ్లలోకి వరద వస్తోంది.

జూలై 26వ తేదీ రాత్రి కురిసిన వానతో వెంకటాపూర్‌‌‌‌ మండలంలోని బూరుగుపేట‒లక్ష్మీదేవీపేట మధ్యన ఉన్న మారేడు కొండ చెరువు, ఊర చెరువు, గణపురం మండలం ధర్మరావుపేట చెరువులు తెగిపోయాయి. రామప్ప, గణప సముద్రం చెరువులు మత్తడి పోశాయి. దీంతో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది. భవిష్యత్‌‌‌‌లో మళ్లీ ఇలా భారీ వర్షాలు పడితే వరదతో గ్రామం మునగడం ఖాయమని ఇరిగేషన్​శాఖ నిపుణులు చెబుతున్నారు. 

ఎత్తయిన జాగలో ఇండ్లు కట్టించాలి

మొదట1986లో మోరంచవాగుకు వరదలు వచ్చినప్పుడు గ్రామంలో 70 గుడిసెలు మాత్రమే ఉండేవి. దీంతో అప్పటి సీఎం ఎన్టీ రామారావు మోరంచపల్లిని సమీపంలో ఉన్న ఎత్తయిన ప్రదేశంలోకి మార్చి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే, గ్రామస్తులంతా దీనికి ఒప్పుకోలేదు. మళ్లీ 2000లో వరదలు వచ్చి ఇండ్లలోని వస్తువులు, పశువులు కొట్టుకుపోయాయ్​. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తక్షణ పరిహారం ఇచ్చినప్పటికీ గ్రామాన్ని తరలించే ఆలోచన చేయలేదు. 

ఆ రెండు టర్మ్‌‌‌‌లు నేనే ఉప సర్పంచ్‌‌‌‌ని. ఈ సారి భారీ వరదలు రావడంతో గ్రామం మొత్తం మునిగి అపార నష్టం జరిగింది. ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చి వదిలేసింది. గ్రామంలో ఉంటే ఎప్పటికైనా సచ్చిపోతాం అని భయమేస్తోంది. 
‒సందెచారి  రాజేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్‌‌‌‌, మోరంచపల్లి

ప్రాణాలు పోతుంటే ఇక్కడేం చేస్తం 

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు మోరంచపల్లెకు మూడుసార్లు వరదలు వచ్చినయ్‌‌‌‌. ఈ సారి వచ్చిన భారీ వరదల్లో నలుగురు కొట్టుకుపోయిన్రు. వందలాది పశువులు, అనేక ఎకరాల పొలాలు నష్టపోయినం. ఇదంతా చూసినం కాబట్టి ఈ ఊర్లో ఉండాలంటేనే భయమేస్తాంది. సర్కారు వెంటనే మా ఊరిని ఇక్కడినుంచి వేరే చోటికి తరలించాలి. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టియ్యాలి.
‒మేరిపెల్లి నరసయ్య, మోరంచపల్లి

పదివేలిచ్చి చేతులు దులుపుకున్నరు!

1986లో వరదలొచ్చినప్పుడు అప్పటి సర్కారు మా ఊరిని తరలిస్తామంటే పోమని చెప్పినం. ఇప్పటి  వరదలను చూసినప్పటి నుంచి కోలుకోలేకపోతున్నా. రాత్రిపూట ఇండ్లల్లో ఉండలేకపోతున్నం. ఊరంతా కొట్టుకుపోతే సర్కారు ఇంటికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. మా ముఖం చూసేటోడు కూడా లేడు. ఊరును తరలించాలని అడుగుతున్న పట్టించుకుంటలేరు. సీఎం, ఎమ్మెల్యే, కలెక్టర్ మా ఊరును తరలించాలి.
‒ చుక్క సాంబయ్య, మోరంచపల్లి

కాపాడితే బతికి బయటపడ్డం

తెల్లార గట్ల మోరంచవాగు ఉప్పొంగి నీళ్లు ఇండ్లలోకి వచ్చినయ్. నేను, నా భార్య ఇల్లు పైకెక్కుదామని బయటికి వస్తే వరదల్లో కొట్టుకపోయినం. మా ఇంటి వెనకిండ్లల్లో ఉన్న సెంచోళ్ళు కాపాడిన్రు. అప్పటికే నా భార్యకు కడుపులో, ఊపిరితిత్తుల్లో దెబ్బలు తాకడంతో దవాఖానలో చేర్పించినా. చికిత్సకోసం రూ.మూడు లక్షలు ఖర్చయ్యింది. బంధువుల దగ్గర అప్పు తెచ్చి ట్రీట్​మెంట్​చేయిస్తున్నా. కనీసం ఎట్లున్నరు అని అడిగేటోళ్లు కూడా లేరు. 
‒ బిల్ల రాజిరెడ్డి, మోరంచపల్లి