
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతు ఆత్మహత్య ఘటనపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సదాశివనగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌లో తన భూమిని ఇండస్ట్రియల్ జోన్లో చూపారన్న కారణంతోనే ఆయన బలవన్మరానికి పాల్పడ్డాడని గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. రైతు మృతదేహాన్ని తీసుకుని మున్సిపల్ ఆఫీసుకు వస్తున్న గ్రామస్తులు, రైతు బంధువులను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కామారెడ్డి బస్టాండ్ వద్ద మృతుని బంధువులు, రైతులు ఆందోళనకు దిగారు.
మున్సిపల్ ఆఫీసు నుంచి బయటకు వెళ్తున్న కమిషనర్‌ను రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చే ప్రసక్తేలేదని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.