కాగడాలతో కరోనాను తరిమికొట్టిన గ్రామస్తులు

కాగడాలతో కరోనాను తరిమికొట్టిన గ్రామస్తులు
  • ‘భాగ్ కరోనా భాగ్’.. కరోనాను తరిమికొట్టిన గ్రామస్తులు
  • మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో వినూత్న ఘటన

కరోనాతో రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కరోనా నియంత్రణకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటివి అమలుచేస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామస్తులు మాత్రం లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి లేకుండా కరోనాను వినూత్నంగా అరికట్టే ప్రయత్నం చేశారు. వందలమంది గ్రామస్తులు చేతుల్లో కాగడాలు పట్టుకొని ‘భాగ్ కరోనా భాగ్’అంటూ ఊరంతా పరిగెత్తారు. చివరకు ఊరు బయటకు వెళ్లి కాగడాలను విసిరేసారు. ఈ వింత ఘటన అగర్ మాల్వా జిల్లాలోని గణేష్‌పురా గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గ్రామస్తులు చేతుల్లో కాగడాలు పట్టుకొని ‘భాగ్ కరోనా భాగ్’ అని అరవడం చూడొచ్చు.

ఇలా చేస్తే తమ గ్రామం కోవిడ్ బారీ నుంచి తప్పించుకుంటుందని స్థానికులు భావిస్తున్నారు. ‘పురాతన కాలం నుంచి మా గ్రామంలో ఏదైనా అంటువ్యాధి వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకరు కాగడాలు పట్టుకొని ఊరి బయటవరకు పరిగెత్తుతారు. ఆ తర్వాత కాగడాలను గ్రామ సరిహద్దులో పడేస్తారు. ఇలా చేస్తే మా గ్రామం కాపాడబడుతుందని మా నమ్మకం. మా గ్రామంలో గత రెండు, మూడు రోజుల నుంచి ప్రతిరోజూ ఒకరు చనిపోతున్నారు. దాంతో గ్రామస్తులలో భయాందోళనలు కలుగుతున్నాయి. గ్రామంలో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. అందుకే ఇలా చేశాం’అని గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. కాగా.. గ్రామస్తులు ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించినప్పటి నుంచి గ్రామంలో ఎవరూ మృతిచెందకపోవడం గమనార్హం. 

గత ఏడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి రామ్‌దాస్ అథవాలే ‘గో కరోనా.. గో కరోనా’ అని నినాదాలు చేశారు. ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే పద్దతిలో గణేష్‌పురా గ్రామస్తులు భాగ్ కరోనా భాగ్ అంటూ నినాదాలు చేసి మళ్లీ అథవాలే వీడియోను గుర్తు చేశారు.