
- ‘పల్లెనిద్ర’కు ఎల్లంకి వచ్చిన కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు : గ్రామంలోని చెరువులను కబ్జా చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఎల్లంకి గ్రామస్తులు కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. నీటిని అక్రమంగా బయటకు పంపిస్తున్నారని, దీంతో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ పేరుతో వస్తున్న నీటిలో బోరు వాటర్ కలుపుతున్నారని ఫిర్యాదు చేశారు. పల్లెనిద్రలో భాగంగా శుక్రవారం రాత్రి రామన్నపేట మండలం ఎల్లంకి వచ్చిన కలెక్టర్ ను గ్రామస్తులు కలిసి తమ సమస్యలను వివరించారు.
ఆర్టీసీ బస్సు రావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం స్థానిక రైతు వేదికలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో మాట్లాడారు. గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ఎల్లంకి గ్రామం నుంచి గుండ్రాంపల్లికి వరకు కొత్త రోడ్లు వేయించాలని గ్రామస్తులు కోరారు.
రామన్నపేట మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్‌సెంటర్30 పడకలుగా ఉందని, దానిని 100 పడకలకు అప్గ్రేడ్చేయాలన్నారు. ప్రభుత్వ భూమిలో గ్రామంలోని నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి పట్టాలు ఇవ్వాలని, అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామంలోని 3 చెరువులు కబ్జాకు గురికాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలో రెండు రోజులు గ్రామంలో కృష్ణ నీళ్లు అందించాలని, మిగతా రోజుల్లో బోరు నీళ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
నల్ల కనెక్షన్ లేని ఇండ్లను గుర్తించి కొత్త కనెక్షన్లు ఇవ్వాలన్నారు. గ్రామంలోని జీపీ కార్యాలయాన్ని మహిళా సంఘాలకు కేటాయించాలని ఆదేశించారు. చేనేత కార్మికుల మగ్గాలను జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు. గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో నాగిరెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహారావు, డీఎంహెచ్ వో మనోహర్ పాల్గొన్నారు.