
- అటవీ ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్న బాధితులు
- 2023లో వచ్చిన వరదల్లో ఎనిమిది మంది మృతి
- మరోసారి వరద వస్తుందన్న భయంతో వలసబాట పట్టిన గ్రామస్తులు
జయశంకర్ భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు : వానాకాలం వచ్చిందంటే చాలు ములుగు జిల్లా కొండాయి గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 2023 జూలై 27న జంపన్న వాగు వరద కొండాయి గ్రామాన్ని ముంచెత్తడంతో ఎనిమిది మంది చనిపోయారు. అప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయంటేనే భయాందోళన చెందుతున్నారు. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుండడంతో వలసబాట పట్టారు.
అడవిలోకి చేరిన 28 కుటుంబాలు
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో కొండాయి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలకు చెందిన 28 దళిత కుటుంబాలు వలస బాట పట్టాయి. సోమవారం ఉదయమే మూటముల్లే సర్దుకొని, పిల్లాజెల్లను వెంటబెట్టుకొని వాగు ఇవతల ఉన్న దొడ్ల, కొత్తూరు గ్రామాల మధ్య గల అడవిలోకి మకాం మార్చారు. అక్కడే చెట్లకు పరదాలు కట్టుకొని తలదాచుకుంటున్నారు. రెండేండ్ల కింద వరదలు సంభవించినప్పుడు అడవిలో గుడిసెలు వేసుకోగా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకొని వాటిని పీకేశారని బాధితులు తెలిపారు.
వరదలు రానిచోట ఇండ్లు కట్టించి ఇస్తామని అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠి హామీ ఇచ్చిందని, అయినా ఇప్పటివరకు తమకు స్థలం చూపెట్టలేదని వాపోయారు. మళ్లీ ఇప్పుడు ఎడ తెరిపి లేకుండా వర్షాలు పడుతుండడం, జంపన్న వాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు తెగడంతో వరద భయం కారణంగా ఇండ్లను వదిలి అడవిలోకి వచ్చామని చెప్పారు. ప్రభుత్వం తమకు ఇంటి స్థలం కేటాయించే వరకు అడవిలోనే ఉంటామని చెప్పారు.
ప్రాణభయంతోనే అడవి బాట పట్టినం
2023 జూలైలో వచ్చిన వరదల వల్ల నా పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. అప్పటినుంచి పూరి గుడిసె వేసుకొని ఉంటున్న. మళ్లీ ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలు వస్తాయోమోననే భయంతో గ్రామాన్ని వదిలి అడవిలో తలదాచుకుంటున్నాం. ఆఫీసర్లు స్పందించి మాకు ఇంటి స్థలాలు కేటాయించాలి. - మామిడి నగేశ్, కొండాయి గ్రామం
వారం రోజుల్లో పరిష్కారం చూపిస్తాం
కొండాయి నుండి వచ్చి దొడ్ల ‒ కొత్తూరు గ్రామాల మధ్య అడవిలో తలదాచుకుంటున్న వారికి వారం రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తాం. అడవిలో నివసించడం ప్రమాదకరం అయినందున తిరిగి గ్రామానికి వెళ్లాలని సూచించాం. - మహేందర్, ములుగు అడిషనల్ కలెక్టర్