అవినీతి వల్లే సంజయ్ అధ్యక్ష పదవి ఊడింది : గంగుల కమలాకర్

అవినీతి వల్లే సంజయ్ అధ్యక్ష పదవి ఊడింది : గంగుల కమలాకర్
  •     బండి అవినీతి సొమ్ము తీసుకొని కారు గుర్తుకు ఓటేయండి
  •     ఎంపీ టికెట్ ఇవ్వరని తెలిసే ఎమ్మెల్యేగా బరిలో 
  •     కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షం
  •     ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 

కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునేందుకు ప్లాన్ చేయడంతోపాటు పాదయాత్ర పేరిట పార్టీ ఫండ్  దుర్వినియోగం చేసినందుకే హైకమాండ్ ​బండి సంజయ్‌‌ను పదవి నుంచి మెడలు పట్టి గెంటేసిందని మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించారు. దీంతో తనకు ఎక్కడ ఎంపీ టికెట్ రాదోనని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాడన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునుర్ గ్రామంతోపాటు కరీంనగర్ సిటీలోని 37, 38, 55 డివిజన్లలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో గ్రామస్తులు మంత్రి గంగులకు స్వాగతం పలకగా ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు.

 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తనపై రెండుసార్లు చిత్తుగా ఓడిపోయిన సంజయ్ నేడు అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.20 వేలు, సెల్ ఫోన్లు ఇచ్చి గెలిచేందుకు చూస్తున్నాడని ఆరోపించారు. బండి సంజయ్ ఇచ్చే డబ్బులు మనవేనని, అవి తీసుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, కేసీఆర్  లేని తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణను మోసం చేశాయని విమర్శించారు. తెచ్చుకున్న తెలంగాణలో అన్నివర్గాలు ఆనందంగా ఉన్నాయని, పచ్చని తెలంగాణపై మళ్లీ ఆంధ్రోళ్ల కన్నుపడిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దోఖాబాజి పార్టీలని, మరోసారి తెలంగాణను దోచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో ఆంధ్రా నాయకులు వస్తున్నారని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రౌడీ షీటర్, కబ్జాకోరుకు కాంగ్రెస్ డబ్బులకు టికెట్ అమ్ముకుందని ఆరోపించారు. బ్యాలెట్ బాక్సు కింద దొంగలు ఉంటారని, నంబర్ వన్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

బీఆర్‌‌ఎస్‌‌తోనే  సంక్షేమం.. కాంగ్రెస్​కు ఓటేస్తే సంక్షోభం

బీఆర్‌‌ఎస్‌‌కు ఓటేస్తే సంక్షేమం.. -కాంగ్రెస్‌‌ గెలిస్తే సంక్షోభం తప్పదని మంత్రి గంగుల హెచ్చరించారు.  కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్‌‌ను 32 కేసులు ఉన్న భూకబ్జాదారునికి అమ్ముకుందని.. ఆ పార్టీకి ఓటేస్తే మీ భూములన్నీ మాయం చేస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. బండి సంజయ్ తనపై రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలై... అపోలో ఆస్పత్రిలో గుండె నొప్పి నాటకంతో కరీంనగర్ ప్రజల సానుభూతి పొంది ఎంపీగా గెలిచాడని గుర్తు చేశారు. నాలుగున్నర ఏళ్లలో ఒక్కసారి కూడా కరీంనగర్ అభివృద్ధి గురించి ఆలోచించలేదని విమర్శించారు. ప్రచారంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి -హరిశంకర్, కార్పొరేటర్లు కచ్చు రవి, లీడర్లు రమ, చంద్రశేఖర్, శ్రీనివాస్, అనిల్, స్వామి పాల్గొన్నారు.