
- శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్న హింస
ఇంఫాల్/కోల్‌కతా/గువహటి: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం రాత్రి నుంచి హింస కొనసాగుతోంది. అల్లరి మూకలు గుంపులు గుంపులుగా రాజధాని ఇంఫాల్ వీధుల్లోకి వస్తున్నాయి. బీజేపీ నేతల ఇండ్లను టార్గెట్‌గా చేసుకుని తగులబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మూకకు మధ్య ఘర్షణలు జరిగాయి.
బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్త, చురాచంద్‌పూర్ జిల్లాలోని కాగ్వయిలో శుక్రవారం రాత్రంతా కాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు పశ్చిమ ఇంఫాల్‌లోని ఇరింగ్‌బామ్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలను లూటీ చేసేందుకు 400 మంది దాకా ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్, మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు శాఖ కలిసి అర్ధరాత్రి జాయింట్ మార్చ్ నిర్వహించాయి..
వందల సంఖ్యలో మూకలు
దాదాపు వెయ్యి మందికి పైగా మూక ఇంఫాల్‌లోని ప్యాలెస్ కాంపౌండ్ వద్దకు చేరుకుంది. బిల్డింగులను అంటించేందుకు ప్రయత్నించింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించింది. రబ్బర్ బుల్లెట్లను కాల్చింది. మరో గుంపు ఎమ్మెల్యే బిస్వజీత్ ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా.. వారిని బలగాలు అడ్డుకున్నాయి.
ఇంకో గుంపు అర్ధరాత్రి తర్వాత సింజెమయ్‌లోని బీజేపీ ఆఫీసును ముట్టడించింది. వెంటనే స్పందించిన ఆర్మీ.. వారిని అక్కడి నుంచి చెదరగొట్టింది. పోరంపేట్‌లో బీజేపీ మహిళా నేత శారదా దేవి ఇంటిని ధ్వంసం చేసేందుకు మరో గ్రూప్ ట్రై చేసింది. అక్కడ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అడ్డుకున్నాయి. లాంగోల్‌లో ఓ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు అధికారులు చెప్పారు. మణిపూర్ వర్సిటీకి దగ్గర్లో అల్లరి మూక గుమిగూడి కనిపించిందని తెలిపారు. శుక్రవారం రాత్రి 10.40 సమయంలో 300 మంది దాకా ఉన్న మూక థోంగ్జు దగ్గర్లో స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిందని, దళాలు నిరోధించాయని వివరించారు.
వెంటనే స్పందించండి: ఆర్మీ మాజీ చీఫ్ మాలిక్
మణిపూర్ పరిస్థితులపై వెంటనే దృష్టిపెట్టి, స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ కోరారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎల్.నిశికాంత సింగ్ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందించారు. ‘‘నేను మణిపూర్‌కు చెందిన ఒక సాధారణ భారతీయుడిగా రిటైర్‌మెంట్ జీవితాన్ని గడుపుతున్నాను. రాష్ట్రం ఇప్పుడు ‘స్టేట్‌లెస్’గా మారింది.
లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా మొదలైన దేశాల్లో ఎవరైనా, ఎప్పుడైనా ప్రాణాలు తీయొచ్చు, ఆస్తులను నాశనం చేయవచ్చు. ఇప్పుడు మణిపూర్‌లో అలా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా వింటున్నారా?” అని లెఫ్టినెంట్ జనరల్ సింగ్ ట్వీట్ చేశారు. దీనికి జనరల్ మాలిక్ బదులిస్తూ.. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితికి అత్యున్నత స్థాయిలో తక్షణ స్పందన అవసరమని పేర్కొన్నారు.