లాక్​డౌన్​ రూల్స్ వద్దంటూ నిరసనలు

లాక్​డౌన్​ రూల్స్ వద్దంటూ నిరసనలు
  • వీధుల్లోకి వచ్చి జనం నిరసనలు
  • 19 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు
  • ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీలోనూ ఆందోళనలు

ఆమ్​స్టర్​డ్యామ్: యూరోపియన్​దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండటంపై డబ్ల్యూహెచ్​వో ఆందోళన వ్యక్తంచేస్తోంది. కాగా వైరస్​ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు లాక్​డౌన్​ విధించడంతోపాటు కఠిన ఆంక్షలు పెడుతుండగా.. పౌరులు వాటిని ఒప్పుకోవడంలేదు. లాక్​డౌన్​ రూల్స్, కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నెదర్లాండ్స్​లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ దేశ ప్రభుత్వం 3 వారాల పాక్షిక లాక్​డౌన్ ​విధిస్తూ గత వారం ఆంక్షలు పెట్టింది. లాక్​డౌన్​ రూల్స్​ను వ్యతిరేకిస్తూ జనం పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేస్తున్నారు.  నెదర్లాండ్స్‌‌‌‌లోని అనేక పట్టణాలు, నగరాల్లో శనివారం వరుసగా రెండో రోజు అల్లర్లు చెలరేగాయి. రోటర్‌‌‌‌డామ్‌‌‌‌ సిటీలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. హేగ్‌‌‌‌లో ప్రజలు పోలీసులపై టపాసులు పేల్చి, వాహనాలకు నిప్పంటించారు. నిరసనకారులు విసిరిన రాయి పేషెంట్​ను తీసుకెళ్తున్న అంబులెన్స్ కిటికీకి తాకింది. అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. అధికారులు నగరంలో కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడిన19 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. సెంట్రల్ ‘బైబిల్ బెల్ట్’ పట్టణం ఉర్క్, దక్షిణ లిమ్‌‌‌‌బర్గ్ ప్రావిన్స్‌‌‌‌లోని నగరాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. మ్యాచ్​ను చూసేందుకు ఆంక్షలు పెట్టడంపై కోపంగా ఉన్న అభిమానులు రెండు ఫుట్‌‌‌‌బాల్ మ్యాచ్‌‌‌‌లకు అంతరాయం కలిగించారని డచ్ మీడియా తెలిపింది. శుక్రవారం రాత్రి కూడా రోటర్‌‌‌‌డామ్‌‌‌‌లో 51 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

మిగతా దేశాల్లోనూ..
ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ, బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్​​లోనూ ఇవే తరహా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ లాక్​డౌన్ ​కొనసాగుతోంది. అత్యవసర షాప్​లు మినహా అన్ని దుకాణాలు మూసివేశారు. జర్మనీతో పాటు క్రొయేషియాలో కరోనా టీకా తప్పనిసరి చేయడంపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటలీలో ‘గ్రీన్ పాస్’ సర్టిఫికెట్లను వ్యతిరేకిస్తూ నిరసనకారులు రోమ్‌‌‌‌లో ఆందోళన చేపట్టారు. కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌‌‌‌లో ఆందోళనలను కట్టడి చేసేందుకు అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఫ్రాన్స్​లోనూ నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాత్రిపూట అల్లర్ల చెలరేగాయి. ఆందోళనకారులు షాప్​లకు నిప్పు అంటించారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా యూకే, జర్మనీ మధ్య ట్రావెల్​ ​రూల్స్ ​సడలించే ఆలోచనలేదని యూకే హెల్త్​ సెక్రెటరీ సాజిద్​ జావిద్ ​తెలిపారు. యూరప్​అంతటా కఠిన ఆంక్షలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగొచ్చని ప్రాంతీయ హెల్త్​ డైరెక్టర్​ హన్స్​ క్లూగే చెప్పారు.