జేఎన్ యూలో మళ్లీ టెన్షన్..యూనివర్సిటీ లో 50 మంది దుండగులు దాడి

జేఎన్ యూలో మళ్లీ టెన్షన్..యూనివర్సిటీ లో 50 మంది దుండగులు దాడి

న్యూఢిల్లీ: జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్​యూ) మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం రాత్రి కొంతమంది ముసుగులు ధరించి, రాడ్లతో క్యాంపస్​లోని హాస్టళ్లలోకి చొరబడి స్టూడెంట్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. జేఎన్​యూ టీచర్స్ యూనియన్​ మీటింగ్​ జరుగుతుండగా ఇటుకలతో దాడి చేసి, హాస్టల్​లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జేఎన్​యూ ఎస్​యూ​ ప్రెసిడెంట్ అయిషీ ఘోష్​తో పాటు కనీసం 18 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు ప్రొఫెసర్లకు కూడా గాయాలయ్యాయినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్‌ రూమ్‌ల్లోకి చొరబడి విద్యార్ధులను చితకబాదారు. కనిపించిన ప్రొఫెసర్లపైనా విరుచుకుపడ్డారు. దాడి ఘటనతో ప్రభుత్వం జేఎన్​యూలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. వర్సిటీ గేటు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది. గాయపడిన వారిని 7 ఆంబులెన్స్​లలో ఎయిమ్స్​ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. మరో పది అంబులెన్స్​లను వర్సిటీ దగ్గర ఉంచాలని ఆదేశించినట్లు వివరించారు.

దాడిపై పరస్పర ఆరోపణలు

ఈ దాడిలో స్టూడెంట్​యూనియన్​తో పాటు ఏబీవీపీ స్టూడెంట్లకూ దెబ్బలు తగిలాయి. తమపై దాడికి తెగబడిన గూండాలు ఇప్పటికీ క్యాంపస్‌ హాస్టల్స్‌లోనే ఉన్నారని విద్యార్ధులు ఆరోపించారు. క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చోద్యం చూశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్‌ మూన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఏబీవీపీ విద్యార్థులే ముసుగులు వేసుకుని తమపై దాడి చేశారని స్టూడెంట్​ యూనియన్​ వర్గం, వామపక్ష విద్యార్థి సంఘం వాళ్లే తమపై దాడి చేశారని ఏబీవీపీ వర్గం స్టూడెంట్లు ఆరోపించారు. తమ వర్గానికి చెందిన 25 మంది స్టూడెంట్లకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 11 మంది కనిపించడంలేదని ఏబీవీపీ నేతలు చెప్పారు.

దాడిని ఖండించిన లెఫ్టినెంట్​ గవర్నర్, సీఎం

జేఎన్​యూలో దాడి ఘటనను లెఫ్టినెంట్​ గవర్నర్ అనిల్​ బైజల్, సీఎం కేజ్రీవాల్ ఖండించారు. జేఎన్​యూ అడ్మినిస్ట్రేషన్​ అధికారులతో కలిసి క్యాంపస్​లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు బైజల్​ట్వీట్​ చేశారు. వర్సిటీ క్యాంపస్ లోనే  స్టూడెంట్లకు సెక్యూరిటీ లేకుంటే, దేశం ఎలా ముందుకెళ్తుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.