మణిపూర్​లో హింస.. కుకీలు ఎవరు? మైతీలు ఎవరు?

మణిపూర్​లో హింస.. కుకీలు ఎవరు?  మైతీలు ఎవరు?

మైతీ తెగకు ఎస్టీ హోదా.. వ్యతిరేకిస్తున్న కుకీలు


ఇంఫాల్: మణిపూర్.. రెండు నెలలుగా హింసతో రగిలిపోతున్నది. కొండ ప్రాంతాల్లో నివసించే మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే హైకోర్టు తీర్పును కుకీ, నాగా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మే 3న చురాచంద్​పూర్ జిల్లాలో చేపట్టిన ‘గిరిజన సంఘీభావ నిరసన యాత్ర’ ఇప్పటి అల్లర్లకు కారణమైంది. ర్యాలీ టైంలో ఓ సాయుధ గుంపు మైతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై దాడి చేసింది. ఇది ప్రతీకార దాడులకు దారితీసింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆ రోజు మొదలైన ఘర్షణలు నేటికీ కొనసాగుతున్నాయి. పరస్పర దాడులు, ఇండ్లు తగుల బెట్టుకోవడం, దోపిడీలు, హత్యలు కాస్తా మహిళలపై అత్యాచారాల దాకా తీసుకెళ్లింది. ఎస్టీ హోదా అడ్డుకుంటున్న కుకీ తెగకు చెందిన మహిళలు, యువతులు లక్ష్యంగా మైతీ వర్గం రేప్, హత్యలకు పాల్పడుతోంది.

కుకీలు ఎవరు?
ఇండియాలోని అనేక కొండ జాతి తెగల్లో కుకీలు ఒకటి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, మేఘాలయ, అస్సాం, త్రిపుర, నాగాలాండ్​లో నివసిస్తారు. కుకీలు ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తుండగా.. మణిపూర్​లోని చురాచంద్​పూర్ వారికి బలమైన కోట. రాష్ట్ర జనాభాలో 40% ఉన్నారు. వీరిలో మళ్లీ 20 ఉప తెగలున్నాయి. చాలా ఏండ్ల కింద కుకీ తెగకు చెందినవాళ్లు క్రైస్తవ మతంలోకి మారారు. కొండ ప్రాంతాల్లో వీళ్లు ఉండొచ్చు. కానీ, ఆ స్థలాలు అమ్మడానికి లేదు. 

మైతీలు ఎవరు?
మణిపూర్‌లో మైతీలు ఎక్కువగా ఉంటారు. వీరంతా హిందువులు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటారు. ఎక్కువగా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరంతో పాటు పలు రాష్ట్రాల్లో వీరి జనాభా ఎక్కువే ఉంది. మైతీలను మణిపూర్ మూల వాసులుగా చెబుతుంటారు. మైతీ ప్రజల స్థలాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. రాష్ట్ర జనాభాలో 53 శాతానికి పైగా ఉన్నారు.