వెస్ట్ బెంగాల్ లో రచ్చ:పోలింగ్ సందర్భంగా ఘర్షణ,దాడులు

వెస్ట్ బెంగాల్ లో రచ్చ:పోలింగ్ సందర్భంగా ఘర్షణ,దాడులు

వెస్ట్ బెంగాల్ లోని 3 లోక్ సభ నియోజకవర్గాల్లో పలు చోట్ల పోలింగ్ హింసాత్మకంగా మారింది. డార్జీలింగ్, రాయ్ గంజ్ , జల్ పైగురి సెగ్మెంట్లలో పోలింగ్ కొనసాగుతోంది.

బెంగాల్ లోని ఈ మూడు సెగ్మెంట్లలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి.

రాయ్ గంజ్ సెగ్మెంట్ పరిధిలోని పటాగొరా ప్రాంతంలో సీపీఎం అభ్యర్థి మొహమ్మద్ సలీమ్ కారుపై దాడి జరిగింది. “తృణమూల్ కాంగ్రెస్ వర్కర్లు కొందరు పటగొరా పోలింగ్ బూత్ దగ్గర గ్రూపులుగా తిరుగుతున్నారు. ఓటర్లను భయపెట్టేందుకు వారు ప్రయత్నించారు. విషయం తెలిసి నేను అక్కడకు కారులో వెళ్లారు. నా కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసి నన్ను బెదిరించారు” అని సలీం చెప్పారు.

గిర్ పార్ సెగ్మెంట్ లోని ఓ బూత్ లోని హింస చెలరేగింది. తమను ఓటు వేసేందుకు కొందరు అనుమతివ్వడం లేదంటూ ఓటర్లు నేషనల్ హైవే 34ను బ్లాక్ చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు.

డార్జీలింగ్ కు 200 కి.మీ. దూరంలోని చోప్రాలో ఓ పోలింగ్ బూత్ లో BJP, TMC వర్కర్ల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో పోలింగ్ బూత్ లోని ఓ EVM ధ్వంసమైంది. గొడవ తర్వాత ఇక్కడ సెక్యూరిటీని పెంచారు.

చోప్రాలో జాతీయ రహదారి 31ని బ్లాక్ చేశారు ఓటర్లు. ఓటేసేందుకు అనుమతివ్వడంలేదంటూ నిరసన కారులు ఆందోళన చేశారు. పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సెంట్రల్ ఫోర్స్ ను రప్పించారు.

రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత ఎన్నికలు జరపాలి : బాబుల్ సుప్రియో

2009, 2014లో డార్జీలింగ్ లో బీజేపీ గెలిచింది. పలుప్రాంతాల్లో TMC వర్కర్లు గూండాయిజం చేయడం వల్లే ఉద్రిక్తతలు పెరిగిపోయాయని బీజేపీ నేత, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారని మమతా బెనర్జీని ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత ఎన్నికలు జరపాలని ఆయన అన్నారు.